త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Mataram | ఎర్ర‌కోట‌పై వందేమాత‌రం.. 150 ఏండ్ల చ‌రిత్రలో తొలిసారి..

Vande Mataram | స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్ర‌కోట‌పై స‌రికొత్త చ‌రిత్ర ఆవిష్కృత‌మైంది. బ్రిటీష్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా సాగిన స్వాతంత్య్ర ఉద్య‌మంలో కోట్లాది మంది భార‌తీయుల‌కు శ‌క్తివంత‌మైన ర‌ణ‌నినాదంగా, దేశ‌భ‌క్తికి ప్ర‌తీక‌గా నిలిచిన  వందేమాత‌రం (Vande Mataram) గేయానికి స‌ముచిత స్థానం ల‌భించింది.

G

National | Published On Aug 15, 2026, 8.56 am IST

Vande Mataram | ఎర్ర‌కోట‌పై వందేమాత‌రం.. 150 ఏండ్ల చ‌రిత్రలో తొలిసారి..
Advertisement

Vande Mataram | త్రినేత్ర‌.న్యూస్‌: స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్ర‌కోట‌పై స‌రికొత్త చ‌రిత్ర ఆవిష్కృత‌మైంది. బ్రిటీష్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా సాగిన స్వాతంత్య్ర ఉద్య‌మంలో కోట్లాది మంది భార‌తీయుల‌కు శ‌క్తివంత‌మైన ర‌ణ‌నినాదంగా, దేశ‌భ‌క్తికి ప్ర‌తీక‌గా నిలిచిన  వందేమాత‌రం (Vande Mataram) గేయానికి స‌ముచిత స్థానం ల‌భించింది. దేశ చ‌రిత్ర‌లో ఎర్ర‌కోట‌పై తొలిసారిగా వందేమాత‌రం పూర్తి గీతాన్ని అధికారికంగా ఆల‌పించారు. అనంత‌రం జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌న‌ను ఆల‌పించారు. వందేమాత‌రం 150 ఏండ్ల చ‌రిత్ర‌ను పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా ఈ ప్ర‌ద‌ర్శ‌న చేశారు.

ప్రధాని మోదీ (PM Modi) ఎర్రకోట బురుజుల నుంచి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే, 1721 ఫీల్డ్ బ్యాటరీ (సెరిమోనియల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 సార్లు గన్ సెల్యూట్ చేశారు. ఆ తర్వాత ఆర్మీ బ్యాండ్ `వందేమాతరం` గీతాన్ని వాయించింది. అదే సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు వేదికపై పూలవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్‌పై త్రివర్ణ పతాకం ఉండగా, మరో హెలికాప్టర్‌పై 'వందేమాతరం' అని రాసి ఉన్న పతాకం ఎగరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాగా, 'జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు-2026' ద్వారా జనగణమనకు ఉన్నట్లే వందేమాతరానికి కూడా కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి చట్టపరమైన రక్షణ కల్పించింది. దీని ప్రకారం వందేమాతరం గీతాలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నా లేదా అవమానించినా జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు వందేమాత‌ర గితాలాప‌ణ‌తోనే ముగిశాయి. స్వాతంత్య్ర‌ దినోత్సవానికి ముందు రోజు జాతినుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ముందు, తర్వాత కూడా వందేమాతరం పూర్తి గీతాన్ని ప్రసారం చేశారు. `స్వదేశీ ఉద్యమ సమయంలో వందేమాతరం గీతం ప్రజల పాటగా మారింది` అని రాష్ట్రపతి తన ప్రసంగంలో గుర్తుచేశారు.

1896లో తొలిసారి..

ప్ర‌సిద్ధ బెంగాలీ ర‌చ‌యిత బంకిం చంద్ర చట‌ర్జీ (Bankim Chandra Chatterjee) వందేమాత‌ర గీతాన్ని రచించారు. 1882లో ప్ర‌చురిత‌మైన ఆయ‌న ప్ర‌సిద్ధ న‌వ‌ల ఆనంద‌మ‌ఠ్‌లో (Anandamath) ఈ గేయాని పొందుప‌రిచారు. మొద‌టిసారిగా 1896లో క‌ల‌క‌త్తాలో జ‌రిగిన భార‌త జాతీయ కాంగ్రెస్ స‌మావేశంలో ర‌వీంద్ర‌నాథ్ టాగోర్ (Rabindranath Tagore) దీనిని ఆల‌పించారు. వందే మాత‌రం అంటే `ఓ త‌ల్లీ! నీకు న‌మ‌స్కారాలు` అని అర్ధం. ఇది మాతృభూమిపై గౌర‌వాన్ని, భ‌క్తిని తెలియ‌జేస్తుంది. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత 1950 జ‌న‌వ‌రి 24న రాజ్యాంగ ప‌రిష‌త్ దీనికి జాతీయ గేయంగా స‌ముచిత స్థానం క‌ల్పించింది. ఇప్పటివరకు మొదటి రెండు చరణాలనే ఎక్కువగా ఆలపించేవారు. అయితే 2026 నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఆరు చరణాల పూర్తి గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేశారు. పూర్తి ఆరు చరణాల ఆలపన సమయాన్ని 3 నిమిషాల 10 సెకన్లుగా నిర్ధారించారు. జ‌న‌గ‌న‌మ‌న కంటే ముందే వందేమాత‌రాన్ని పూర్తిగా ఆల‌పించాల‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement