త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamilisai Soundararajan | మ‌ళ్లీ ఓట‌మి పాలైన తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్‌.. ‘క‌ల’ గానే మిలిగిన ‘ప్ర‌జా సేవ‌’..!

Tamilisai Soundararajan | 20 ఏళ్లుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషిస్తున్న ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నిక కాలేదు. మూడు ప‌ర్యాయాలు పార్ల‌మెంట్‌కు, నాలుగు ప‌ర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా కూడా ఆమెను అదృష్టం వ‌రించ‌లేదు. ప్ర‌జా సేవ చేయాల‌నుకున్న ఆమె కోరిక చిర‌కాల కోరికగానే మిగిలిపోయింది.

S

National | Published On May 4, 2026, 12.39 pm IST

Tamilisai Soundararajan | మ‌ళ్లీ ఓట‌మి పాలైన తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్‌.. ‘క‌ల’ గానే మిలిగిన ‘ప్ర‌జా సేవ‌’..!

సంక్షిప్త సారాంశం

ఆమెకు విజ‌యం చిర‌కాల కోరిక‌గానే మిగిలిపోయింది. ప్ర‌జా సేవ కూడా ఆమెకు క‌ల గానే ఉండిపోయింది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి రాజ‌కీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమెకు ఈ ఎన్నిక‌ల్లోనూ అదృష్టం వ‌రించ‌లేదు. గ‌త మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ గెల‌వ‌ని ఆమె.. నాలుగోసారి కూడా త‌న గెలుపును ముద్దాడ‌లేక‌పోయింది. 20 ఏండ్ల నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. దాదాపు ఐదేళ్లు గ‌వ‌ర్న‌ర్‌గా ఒక రాష్ట్రాన్ని శాసించిన‌ప్ప‌టికీ.. చివ‌ర‌కు అసెంబ్లీలో అడుగుపెట్టే యోగ్యం ఆమెకు లేకుండా పోయింది. రాజ‌కీయాల్లో ఇంత‌టి ఘోర ప‌రాభావాన్ని మూట‌గట్టుకున్న ఆమె ఎవ‌రో కాదు.. తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్.

Advertisement

Tamilisai Soundararajan | త్రినేత్ర‌.న్యూస్ : 20 ఏళ్లుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషిస్తున్న ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నిక కాలేదు. మూడు ప‌ర్యాయాలు పార్ల‌మెంట్‌కు, నాలుగు ప‌ర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా కూడా ఆమెను అదృష్టం వ‌రించ‌లేదు. ప్ర‌జా సేవ చేయాల‌నుకున్న ఆమె కోరిక చిర‌కాల కోరికగానే మిగిలిపోయింది.

ప్ర‌జా సేవ కోసం తిరిగి వెళ్తున్నా..

2024, మార్చి నెల‌లో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ రాజీనామా చేశారు. ఇక రాజీనామా అనంత‌రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆమె సొంత రాష్ట్రం త‌మిళ‌నాడుకు బ‌య‌ల్దేరుతూ.. ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్ర‌జా సేవ కోసం తిరిగి వెళ్తున్నాను. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. తాను ఎప్ప‌టికీ తెలంగాణ సోద‌రినే. త‌న‌పై చూపిన ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు అని త‌మిళిపై పేర్కొన్నారు.

2024 పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఓట‌మి.. తాజాగా అదే ప‌రిస్థితి..

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన ఆమె.. 2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున పోటీ చేశారు. చెన్నై సౌత్ నుంచి పోటీ చేసిన త‌మిళిసై.. డీఎంకే అభ్య‌ర్థిపై ఓటమి పాల‌య్యారు. అప్ప‌ట్నుంచి క్రియాశీల‌క రాజ‌కీయాల్లో ఉన్న ఆమె.. తాజాగా జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున మైలాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఈ ఎన్నిక‌ల్లోనూ ఆమె గెల‌వ‌లేక‌పోయారు. మైలాపూర్‌లో టీవీకే అభ్య‌ర్థి వెంక‌ట‌రామ‌న‌న్ గెలుపొంద‌గా, డీఎంకే రెండో స్థానానికి, త‌మిళిసై మూడోస్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు.

ఎన్నిక‌ల్లో క‌లిసి రాని అదృష్టం..

త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌కు ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు అదృష్టం క‌లిసిరాలేద‌నే చెప్పొచ్చు. అటు పార్ల‌మెంట్‌కు, ఇటు అసెంబ్లీకి ఎన్ని సార్లు పోటీ చేసినా కూడా ఓట‌మే ఎదురైంది. చ‌ట్ట స‌భ‌ల్లోకి అడుగుపెట్ట‌లేక‌పోయారు. తాజాగానైనా అసెంబ్లీ గ‌డ‌ప తొక్కుదామంటే ఆమెను అదృష్టం వ‌రించ‌లేదు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌లను ప‌రిశీలిస్తే.. 2009లో చెన్నై సౌత్ నుంచి, 2019లో తూత్తుకుడి నుంచి, 2024లో చెన్నై సౌత్ నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఈ మూడు సార్లు కూడా త‌మిళిసైపై డీఎంకే అభ్య‌ర్థులే గెలుపొందారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. 2006లో రాధాపురం, 2011లో వెల‌చ్చేరి, 2016లో విరుగంప‌క్కం, 2026లో మైలాపూర్ నుంచి పోటీ చేసి ఓట‌మి చ‌విచూశారు. తమిళనాడు బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న సౌందర రాజన్ ఇప్పటి వరకు చట్ట సభలకు ఎన్నిక కాకపోవడం గమనార్హం.

2019లో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా నియామ‌కం..

2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై.. ఆనతి కాలంలోనే అగ్రశ్రేణి మహిళా నేతగా ఎదిగారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ప‌ని చేశారు.

తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఉన్న తమిళిసై సౌందర రాజన్ 1961 జూన్ 2న కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌‌సోల్‌లో జన్మించారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తమిళనాడు ఆసుపత్రులకు విజిటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆమె భర్త సౌందరరాజన్ కూడా వైద్యుడే.

సౌందర్ రాజన్‌కు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉండేది. ఆమె తండ్రి మాజీ ఎంపీ కుమార్ ఆనందన్ తమిళ కాంగ్రెస్‌లో కీలక పదవులు చేపట్టారు. మెడికల్ కాలేజీలో సౌందర్ రాజన్ స్టూడెంట్ లీడర్‌గా పనిచేశారు. కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ ఆమె బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీకి పూర్తిస్థాయి నేతగా పనిచేశారు.

Advertisement
Advertisement