త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu | ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో టీవీకే.. విజయ్‌కి రాహుల్‌ అభయ‘హస్తం’!

P

National | Published On May 5, 2026, 9.29 am IST

Tamil Nadu | ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో టీవీకే.. విజయ్‌కి రాహుల్‌ అభయ‘హస్తం’!
Advertisement

Tamil Nadu | తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఎన్నో ఏళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలకు నటుడు విజయ్‌ సవాల్‌ విసిరారు. పార్టీని స్థాపించి, పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే టీవీకే పార్టీ వందకుపైగా సీట్లను గెలిచింది. 234 సభ్యుల అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు కొద్దిదూరంలోనే ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతు అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో విజయ్ ముందు ఉన్న రాజకీయ అవకాశాలపై చర్చలు జోరందుకున్నాయి. స్వతంత్రంగా పోటీ చేసి గణనీయ ఫలితాలు సాధించినప్పటికీ.. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఇతర పార్టీల మద్దతు కోరాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ వైఖరి కీలకంగా మారింది.

రాహుల్‌ హింట్‌ ఇచ్చారా?

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో టీవీకే అద్భుత విజయం సాధించిందని, ఈ విజయం యువత స్వరానికి ప్రతిబింబంగా నిలుస్తోందన్నారు. ఈ స్వరాన్ని నిర్లక్ష్యం చేయలేమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ముందుంటామన్నారు. అలాగే తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపి, ప్రజలకు సేవ చేయడంలో కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్, డీఎంకే కూటమిలో ఉన్న నేపథ్యంలో టీవీకేకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుందా? చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఎన్నికల ముందు టీవీకే–ఏఐఏడీఎంకే మధ్య కూటమి చర్చలు జరిగినప్పటికీ సీట్ల పంపకాల విషయంలో స్పష్టత రాలేదు. ఫలితంగా రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేయాల్సి వచ్చింది.

అన్నాడీఎంకే మద్దతు ఇచ్చేనా?

ప్రస్తుతం మూడో స్థానానికి పరిమితమైన ఏఐడీఎంకే, తమ ప్రధాన ప్రత్యర్థి డీఎంకేను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు విజయ్‌కి మద్దతు ఇవ్వవచ్చనే అంచనాలున్నాయి. 2016లో పార్టీ అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విజయ్‌కి మద్దతు ఇవ్వడంతో వారికి రాజకీయంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే సభలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయ్ రాజకీయ భవిష్యత్తుపై అనేక అనుమానాలు రేకెత్తించింది. అయితే ఆ ఘటనతో ప్రజల మద్దతు తగ్గకపోవడం, తాజా ఎన్నికల ఫలితాలు ఆయనకు పెరుగుతున్న ఆదరణను స్పష్టం చేస్తున్నాయి. తమిళనాట ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడం రాష్ట్ర రాజకీయాలపై అందరి దృష్టి నెలకొంది. విజయ్‌ టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్‌ ఏ పార్టీతో చేయి కలుపుతారు..? స్వత్రంతంగా మద్దతు కూడగడుతారా అన్నదే రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement