లోడ్ అవుతోంది...


వీధి కుక్కల దాడిలో జరిగే ప్రతి గాయానికి, మరణానికి రాష్ట్ర ప్రభుత్వాలనే బాధ్యులను చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితులకు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, అలాగే కుక్కలకు ఆహారం పెట్టే వారు కూడా ఈ దాడులకు జవాబుదారీ కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. కుక్కల నియంత్రణలో ప్రభుత్వాల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది.
Stray Dog Attacks | దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వీధి కుక్కల దాడులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బెడదను అరికట్టడంలో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. వీధి కుక్కల దాడిలో గాయపడిన వారికి లేదా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ పరిహారం అందేలా నిబంధనలు విధిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
"ప్రతి కుక్క కాటుకు, ప్రతి మరణానికి మేము రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ పరిహారాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. గత 5 ఏళ్ల నుంచి వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు కారణం" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కుక్క కాటు వల్ల కలిగే ప్రభావం జీవితాంతం ఉంటుందని, దీనిని తేలికగా తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.
వీధి కుక్కలకు ఆహారం పెట్టే వ్యక్తులపై కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కలకు ఆహారం పెట్టేవారికి కూడా ఈ దాడుల్లో బాధ్యత ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. "మీకు కుక్కలపై అంత ప్రేమ ఉంటే, వాటిని మీ ఇంటికి తీసుకువెళ్లి పెంచుకోండి. అంతే తప్ప, అవి రోడ్ల మీద తిరుగుతూ ప్రజలను కరవడానికి, భయపెట్టడానికి, వెంబడించడానికి ఎందుకు అనుమతించాలి?" అని కోర్టు ప్రశ్నించింది.
వీధి కుక్కల దాడుల వల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకు భంగం కలిగిస్తుందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
జంతువుల పట్ల జాలి చూపడం మంచిదే అయినా, అది ప్రజల ప్రాణాల మీదకు రాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది. చిన్నపిల్లలపై కుక్కలు దాడి చేస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి? వాటికి తిండి పెట్టే వాళ్లు కాదా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
వీధి కుక్కలను రోడ్ల మీద తిరగనీయకుండా షెల్టర్లకు తరలించాలని గత సంవత్సరం నవంబర్ 7న సుప్రీం ఇచ్చిన తీర్పుపై పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన సుప్రీం.. మంగళవారం కేసు విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని మార్గదర్శకాలను త్వరలోనే సుప్రీం జారీ చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాలపై వీధి కుక్కల నియంత్రణ విషయంలో తీవ్ర ఒత్తిడి పెరగనుంది.

జనవరి 13, 2026

జనవరి 12, 2026

జనవరి 12, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam