త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | సర్క్యులర్లు జారీ చేస్తే సరిపోదు.. యాసిడ్‌ దాడుల నివారణకు బాధ్యత తీసుకోవాలి

Supreme Court | దేశంలో యాసిడ్‌ దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యాసిడ్‌ విక్రయాల నిషేధానికి సంబంధించి సర్క్యులర్లు జారీ చేయడం, కఠినమైన భాషలో మార్గదర్శకాలు రూపొందించడం మాత్రమే సరిపోదని స్పష్టం చేసింది. వాటిని అన్ని రాష్ట్రాలు సమర్థంగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సూచించింది.

P

National | Published On Oct 27, 2026, 9.10 pm IST

Supreme Court | సర్క్యులర్లు జారీ చేస్తే సరిపోదు.. యాసిడ్‌ దాడుల నివారణకు బాధ్యత తీసుకోవాలి
Advertisement
  • రాష్ట్రాల్లో మార్గదర్శకాల అమలును కేంద్రం పర్యవేక్షించాలి
  • యాసిడ్‌ దాడుల కేసుల్లో శిక్షలు పెంచే అంశాన్ని పరిశీలించాల‌న్న సుప్రీంకోర్టు

Supreme Court | దేశంలో యాసిడ్‌ దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యాసిడ్‌ విక్రయాల నిషేధానికి సంబంధించి సర్క్యులర్లు జారీ చేయడం, కఠినమైన భాషలో మార్గదర్శకాలు రూపొందించడం మాత్రమే సరిపోదని స్పష్టం చేసింది. వాటిని అన్ని రాష్ట్రాలు సమర్థంగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సూచించింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్య‌లు చేసింది. యాసిడ్‌ రిటైల్‌ విక్రయాలను నిషేధిస్తూ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దాడులు జరుగుతుండటాన్ని ప్రస్తావించింది. ఎక్కడో లోపం ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొంది. మార్గదర్శకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వనప్పుడు మొత్తం వ్యవహారాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

అధికారుల జవాబుదారీతనం ఏదీ?

యాసిడ్‌ దాడుల నివారణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టేసి కేంద్రం చేతులు దులుపుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దాడులు ఎలా జరుగుతున్నాయో రాష్ట్రాలను ప్రశ్నిస్తూ కేంద్రం ఏమైనా సర్క్యులర్లు జారీ చేసిందా అని నిలదీసింది. చట్టాన్ని అమలు చేసే అధికారుల జవాబుదారీతనం ఎక్కడుందని ప్రశ్నించింది. నిబంధనల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు యాసిడ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉన్నప్పటికీ, యాసిడ్‌ దాడుల నివారణలో కేంద్రం కూడా బాధ్యత పంచుకోవాలని స్పష్టం చేసింది.

అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశం..

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అర్చనా పాఠక్‌ డేవ్‌.. యాసిడ్‌ రిటైల్‌ విక్రయాల నిషేధానికి సంబంధించి రాష్ట్రాలకు సమగ్ర మార్గదర్శకాలు పంపినట్లు ధర్మాసనానికి తెలిపారు. రాష్ట్రాలు కూడా నిబంధనలు రూపొందించాయని, అయితే వాటి అమలు బలహీనంగా ఉందని వివరించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. మార్కెట్లో సులభంగా లభిస్తున్న యాసిడ్‌ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. యాసిడ్‌ దాడులకు పాల్పడేవారికి విధించే శిక్షలను పెంచే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది.

బాధితులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు

యాసిడ్‌ దాడులను గతంలోనూ సుప్రీంకోర్టు అనాగరిక చర్యలుగా అభివర్ణించింది. ఇలాంటి ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ, శిక్షల పెంపుపై కేంద్రం ఆలోచించాలని గతంలో సూచించింది. నేరం చేయలేదని నిరూపించుకునే బాధ్యతను నిందితులపై ఉంచే అంశాన్ని కూడా పరిశీలించాలని అభిప్రాయపడింది. యాసిడ్‌ దాడి బాధితురాలు షహీన్‌ మాలిక్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. యాసిడ్‌ దాడి బాధితులను దివ్యాంగుల కేటగిరీలో చేర్చాలని పిటిషనర్‌ కోరారు. తద్వారా వారు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement