త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసు.. లాయర్‌కు సుప్రీంలోనూ ఊరట కరువు!

Supreme Court | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రూ.15 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ న్యాయవాది హిమాన్షు శేఖర్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. తనను తిరిగి అరెస్టు చేసేందుకు మార్గం సుగమం చేసిన బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.

P

National | Published On Nov 27, 2026, 7.32 pm IST

Supreme Court | మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసు.. లాయర్‌కు సుప్రీంలోనూ ఊరట కరువు!
Advertisement
  • రూ.15 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలపై ఈడీకి నోటీసులు
  • అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ
  • జడ్జీలు, అధికారులను ప్రభావితం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆరోపణలు

Supreme Court | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రూ.15 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ న్యాయవాది హిమాన్షు శేఖర్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. తనను తిరిగి అరెస్టు చేసేందుకు మార్గం సుగమం చేసిన బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ)కి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు మాత్రం నిరాకరించింది.

రూ.15 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలు

జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈడీ ఆరోపణల ప్రకారం.. మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సౌరభ్ చంద్రాకర్ నుంచి హిమాన్షు శేఖర్ రూ.15 కోట్లు తీసుకున్నారు. కేసుకు సంబంధించిన న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేస్తానని హామీ ఇచ్చినట్లు చంద్రాకర్ విచారణలో వెల్లడించినట్లు ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే న్యాయవాదిపై దర్యాప్తు సంస్థ చర్యలకు ఉపక్రమించింది. హిమాన్షు శేఖర్‌పై ఈడీ లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ క్రమంలో నవంబర్ 20న దుబాయ్‌ వెళ్లేందుకు ముంబ‌యి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. వారు ఈడీకి సమాచారం అందించడంతో రాయ్‌పూర్ నుంచి వచ్చిన ఈడీ బృందం నవంబర్ 21న తెల్లవారుజామున 1.10 గంటలకు ఆయనను అదుపులోకి తీసుకుంది. అదే రోజు ముంబ‌యిలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, రాయ్‌పూర్‌కు తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ కోరింది.

అరెస్టు సమయంపై వివాదం

అయితే, ఈడీ ట్రాన్సిట్ రిమాండ్ పిటిషన్‌ను ముంబ‌యి కోర్టు తిరస్కరించింది. 24 గంటల గడువులో చివరి సమయంలో కాకుండా పని వేళల్లో తొలి సెషన్‌లోనే నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచాల్సిందని స్పష్టం చేసింది. ఈడీ మాత్రం నవంబర్ 21 తెల్లవారుజామున 1.10 గంటలకు తమ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే గడువు లెక్కించాలని వాదించింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు నవంబర్ 20న మధ్యాహ్నం 3.03 గంటలకే లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ ఆధారంగా అదుపులోకి తీసుకున్నందున అప్పటి నుంచే గడువు ప్రారంభమైందని కోర్టు అభిప్రాయపడింది. నవంబర్ 23న రాయ్‌పూర్‌లోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని హిమాన్షు శేఖర్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈడీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం ముంబై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హిమాన్షు శేఖర్‌ను రాయ్‌పూర్‌లో అరెస్టు చేసేందుకు మార్గం సుగమమైంది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ తక్షణ ఊరట దక్కలేదు.

చంద్రాకర్ వాంగ్మూలంతో కీలక మలుపు

మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసులో సౌరభ్ చంద్రాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈడీ విచారణలో హిమాన్షు శేఖర్‌కు రూ.15 కోట్లు చెల్లించినట్లు చంద్రాకర్ వెల్లడించాడని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. తొలుత పెద్ద మొత్తంలో, ఆ తర్వాత విడతలవారీగా చిన్న మొత్తాల్లో చెల్లింపులు చేసినట్లు పేర్కొంది. ఈ నెలలో సీబీఐ చేపట్టిన చర్యల అనంతరం ఒమన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చంద్రాకర్ ప్రస్తుతం రాయ్‌పూర్ సెంట్రల్ జైలులో న్యాయ నిర్బంధంలో ఉన్నాడు. చంద్రాకర్, రవి ఉప్పల్‌ కలిసి మహదేవ్ బుక్ యాప్‌ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారాన్ని నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పలు ప్యానెల్స్‌, బ్రాంచ్ ఆపరేటర్ల ద్వారా ఈ నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతను మేనేజర్లు, సూపర్‌వైజర్లు తదితర ఉద్యోగాల్లో నియమించుకుని దుబాయి కేంద్రంగా కార్యకలాపాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ వ్యాపారం, మనీలాండరింగ్ ద్వారా వచ్చిన నేర ఆదాయం రూ.92 వేల కోట్లకు పైగా ఉంటుందని ఈడీ అంచనా వేసింది. పోలీసు, ప్రభుత్వ అధికారులు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులకు కూడా వీరు ముడుపులు చెల్లించి రక్షణ పొందినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నోటీసులకు ఈడీ ఇచ్చే సమాధానం కీలకం కానుంది. ప్రస్తుతానికి హిమాన్షు శేఖర్‌కు మాత్రం అరెస్టు నుంచి ఎలాంటి మధ్యంతర రక్షణ ద‌క్క‌లేదు.

Advertisement
Advertisement