త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఏడాది ప్రాక్టీస్ చేస్తే చాలు న్యాయసేవలోకి.. యువ న్యాయ‌వాదుల‌కు సుప్రీంకోర్టు ఊర‌ట‌..!

Supreme Court | న్యాయసేవలోకి ప్రవేశించాలనుకునే న్యాయ విద్యార్థులు, యువ న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) నియామకాలకు తప్పనిసరి అయిన మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవాన్ని ఏడాదికి తగ్గించింది. అయితే, న్యాయ వృత్తిలో అనుభవం ఉండాలన్న ప్రాథమిక నిబంధనను మాత్రం కొనసాగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

P

National | Published On Aug 21, 2026, 6.15 pm IST

Supreme Court | ఏడాది ప్రాక్టీస్ చేస్తే చాలు న్యాయసేవలోకి.. యువ న్యాయ‌వాదుల‌కు సుప్రీంకోర్టు ఊర‌ట‌..!
Advertisement

Supreme Court | న్యాయసేవలోకి ప్రవేశించాలనుకునే న్యాయ విద్యార్థులు, యువ న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) నియామకాలకు తప్పనిసరి అయిన మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవాన్ని ఏడాదికి తగ్గించింది. అయితే, న్యాయ వృత్తిలో అనుభవం ఉండాలన్న ప్రాథమిక నిబంధనను మాత్రం కొనసాగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు స్టేట్‌ జ్యుడీషియల్‌ అకాడమీలో శిక్షణ, అనంతరం ఏడాది పాటు న్యాయమూర్తుల వద్ద క్లర్క్‌షిప్‌ తప్పనిసరి చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు సమీక్ష పిటిషన్లపై తీర్పు వెలువరించింది. 2025 మేలో ఇచ్చిన తీర్పులో మూడేళ్ల ప్రాక్టీస్‌ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దానిపై వచ్చిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. యువతకు అన్యాయం జరగకుండా నిబంధనను సవరించింది.

2027 మార్చి వరకు మినహాయింపు

2025 మే 20 నుంచి 2027 మార్చి 31 వరకు వెలువడే న్యాయసేవ పరీక్షల నోటిఫికేషన్లకు మూడేళ్ల ప్రాక్టీస్‌ నిబంధన వర్తించదు. ఈ కాలంలో న్యాయ పట్టభద్రులు ఎలాంటి ప్రాక్టీస్‌ సర్టిఫికెట్‌ లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారిని ట్రెయినీ జ్యుడీషియల్‌ ఆఫీసర్లుగా నియమిస్తారు. వారికి ముందుగా ఏడాది పాటు రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీలో కఠిన శిక్షణ ఇస్తారు. అనంతరం ఆరు నెలలు జిల్లా జడ్జి లేదంటే హయ్యర్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌ అధికారి వద్ద, మరో ఆరు నెలలు హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి వద్ద క్లర్క్‌షిప్‌ చేయాలి. శిక్షణ, క్లర్క్‌షిప్‌ అనంతరం పనితీరు, సామర్థ్యంపై నివేదిక ఆధారంగా రెగ్యుల‌ర్ నియామకం ఉంటుంది.

యువత.. ముఖ్యంగా మహిళలపై ప్రభావం

మూడేళ్ల ప్రాక్టీస్‌ నిబంధన వల్ల న్యాయ విద్య పూర్తిచేసిన వెంటనే ప్రతిభావంతులు న్యాయసేవను వృత్తిగా ఎంచుకోలేకపోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వివాహం, కుటుంబ పరిస్థితులు, సామాజిక కారణాలతో మహిళలు అవసరమైన కాలం పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగలేకపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు దూరం కాకుండా అనుభవం, శిక్షణ మధ్య సమతుల్యత అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.

2027 ఏప్రిల్‌ 1 నుంచి ఏడాది ప్రాక్టీస్‌

2027 ఏప్రిల్‌ 1 తర్వాత జారీ చేసే నోటిఫికేషన్లకు ఏడాది యాక్టివ్‌ ప్రాక్టీస్‌ తప్పనిసరి. దానిని ప్రాక్టీస్‌ సర్టిఫికెట్‌ ద్వారా ధ్రువీకరించాలి. కోర్టు కార్యకలాపాల్లో అభ్యర్థి వాస్తవంగా పాల్గొన్న వివరాలు నమోదు చేసిన తర్వాతే ఆ సర్టిఫికెట్‌ జారీ అవుతుంది. న్యాయసేవలోకి వచ్చే వారికి కోర్టు అనుభవం అవసరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే యువతకు మూడేళ్ల నిరీక్షణ భారంగా మారకుండా పరిమిత సడలింపు ఇచ్చింది. న్యాయవాద వృత్తిలో ప్రాథమిక అనుభవంతో పాటు ఎంపిక తర్వాత సమగ్ర శిక్షణ, న్యాయమూర్తుల వద్ద ప్రత్యక్ష అనుభవం కల్పించేలా కొత్త విధానాన్ని రూపొందించింది.

Advertisement
Advertisement