త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Dwarka Tunnel | ఆ ప్రయాణం ఇక 90 నిమిషాలే.. రూ.14 వేల కోట్లతో మెగా ప్రాజెక్టు

కేంద్రం ఆమోదించిన రూ.14,115 కోట్ల ప్రాజెక్టులతో ఢిల్లీ, యూపీల రూపురేఖలు మారనున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రియల్ ఎస్టేట్, ఉపాధి రంగాల్లో భారీ బూమ్ రానుంది.

J

National | Published On Jul 12, 2026, 3.35 pm IST

Delhi Dwarka Tunnel | ఆ ప్రయాణం ఇక 90 నిమిషాలే.. రూ.14 వేల కోట్లతో మెగా ప్రాజెక్టు
Advertisement
  • ఒక టన్నెల్, ఒక హైవే
  • ఢిల్లీ, యూపీల రూపురేఖలు మార్చే భారీ ప్రాజెక్టు
  • రూ.14,115 కోట్లతో రెండు మెగా రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
  • ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లను కలుపుతూ ఢిల్లీలో 8.1 కి.మీ సిక్స్-లేన్ టన్నెల్ (సొరంగం) నిర్మాణం
  • యూపీలో రూ.7,145 కోట్లతో 117.7 కిమీ మేర కాన్పూర్-కబ్రాయ్ గ్రీన్ ఫీల్డ్ హైవే అభివృద్ధి
  • తాజా ప్రాజెక్టుతో 3.5 గంటల ప్రయాణ సమయం 90 నిమిషాలకు తగ్గింపు
  • రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ రంగానికి భారీ ప్రయోజనం

Delhi Dwarka Tunnel | త్రినేత్ర.న్యూస్ : నిత్యం ట్రాఫిక్‌తో సతమతమయ్యే ప్రయాణికులకు ఊరట కల్పించడంతో పాటు లాజిస్టిక్స్ (logistics), రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం (Union Cabinet) రెండు మెగా రోడ్డు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.14,115 కోట్ల అంచనా వ్యయంతో ఢిల్లీలో ఒక భారీ సిక్స్-లేన్ టన్నెల్ (సొరంగం), ఉత్తరప్రదేశ్‌లో గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR), బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధికి, పెట్టుబడులకు ఒక గేమ్ చేంజర్‌గా మారనున్నాయి.

ఢిల్లీ సిక్స్-లేన్ టన్నెల్: నిత్య ప్రయాణికులకు ఇక ట్రాఫిక్ ఫ్రీ జర్నీ

ద్వారక, గురుగ్రామ్, సౌత్ ఢిల్లీ, ఎయిర్‌పోర్ట్ మధ్య ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు ఇక తీరనున్నాయి. ఇక్కడ ప్రయాణం ఎంత అంచనాలకు అందకుండా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే కేంద్రం ఈ కొత్త టన్నెల్ ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది.

ప్రభుత్వ ప్లాన్ ప్రకారం, 8.1 కిలోమీటర్ల పొడవైన ఈ సిక్స్-లేన్ టన్నెల్.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను సౌత్ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్‌తో అనుసంధానిస్తుంది. ఐజీఐ (IGI) ఎయిర్‌పోర్ట్, వసంత్ కుంజ్, అప్‌కమింగ్ ఎయిమ్స్ (AIIMS) మహిపాల్‌పూర్ ఎలివేటెడ్ కారిడార్‌కి ఇది కనెక్ట్ అవ్వడం వల్ల నోయిడా, ఘజియాబాద్, ఈస్ట్ ఢిల్లీ వెళ్లేవారికి రాకపోకలు చాలా సులభతరం అవుతాయి. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద సుమారు రూ.6,969.67 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. దీనివల్ల నిర్మాణ దశలో సుమారు 17 లక్షల మందికి (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

ఆశగా ఎదురుచూస్తున్న రియల్ ఎస్టేట్ (Real Estate) రంగం

సాధారణంగా మెట్రో లైన్లు, హైవేలు, ఎయిర్‌పోర్టులు వస్తే ఆటోమెటిక్ గా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పుడు ఈ టన్నెల్ కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సరికొత్త ట్రిగ్గర్‌గా మారనుందని డెవలపర్లు నమ్ముతున్నారు.

Rs 14,115 Crore Mega Road Projects How Delhi and UP Will Transform

ఈ అంశంపై ఒమాక్స్ లిమిటెడ్ (Omaxe Ltd) మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ గోయెల్ స్పందిస్తూ, "మెరుగైన కనెక్టివిటీ అనేది రియల్ ఎస్టేట్ వాల్యూను పెంచే ప్రధాన అంశాల్లో ఒకటి. ఈ టన్నెల్, హైవే ప్రాజెక్టులు కేవలం రవాణాను మెరుగుపరచడమే కాదు.. నగర విస్తరణ, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనకు అవకాశాలను కల్పిస్తాయి. దీనివల్ల హౌసింగ్ డిమాండ్ పెరగడంతో పాటు, రెంటల్ వాల్యూలు సైతం మెరుగుపడతాయి" అని పేర్కొన్నారు.

కాన్పూర్-కబ్రాయ్ హైవే: బుందేల్‌ఖండ్ రూపురేఖలు మార్చే ప్రాజెక్ట్

ఢిల్లీకి టన్నెల్ వస్తే.. ఉత్తరప్రదేశ్‌కు భవిష్యత్తును మార్చే ఒక భారీ కారిడార్ లభించింది. రూ.7,145.14 కోట్ల అంచనా వ్యయంతో 117.7 కి.మీ మేర 'కాన్పూర్-కబ్రాయ్ గ్రీన్ ఫీల్డ్ హైవే'కి కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్.. భోపాల్-కాన్పూర్ ఎకనామిక్ కారిడార్‌లో కీలకం కానుంది. యూపీలోని పారిశ్రామిక కేంద్రాలను, మధ్యప్రదేశ్‌లోని మైనింగ్ (mining), వ్యవసాయ ప్రాంతాలతో ఇది అనుసంధానిస్తుంది. అలాగే NH-34, NH-35, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే, కాన్పూర్ రింగ్ రోడ్‌లతో ఇది లింక్ అవుతుంది.

సమయం ఆదా

ప్రస్తుతం కాన్పూర్ నుంచి కబ్రాయ్ వెళ్లాలంటే సగటున మూడున్నర గంటల సమయం పడుతుంది. ఈ సరికొత్త హైవే అందుబాటులోకి వస్తే ఆ ప్రయాణం కేవలం 90 నిమిషాలకు తగ్గిపోతుంది. దీనివల్ల లాజిస్టిక్స్ కంపెనీలకు వేగవంతమైన డెలివరీలు, తయారీదారులకు (manufacturers) తక్కువ రవాణా ఖర్చు వంటి భారీ ప్రయోజనాలు చేకూరుతాయి.

మౌలిక సదుపాయాలు (Infrastructure) ఎందుకు అంత ముఖ్యం?

లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి, సప్లై చైన్ (supply-chain) వ్యవస్థను మెరుగుపరచడానికి, కొత్త ఆర్థిక కేంద్రాలను అనుసంధానం చేయడానికి గత దశాబ్ద కాలంగా భారతదేశం హైవేల నిర్మాణంపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. తాజాగా ఆమోదించిన రెండు ప్రాజెక్టులు సరిగ్గా ఇదే వ్యూహంలో భాగం.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కి ప్రయోజనం: టన్నెల్ వల్ల నగరంలో అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ కారిడార్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే నివాస, వాణిజ్య ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది.

ఉత్తరప్రదేశ్‌ కి ప్రయోజనం: కాన్పూర్-కబ్రాయ్ హైవే వల్ల బుందేల్‌ఖండ్ ప్రాంతం ప్రధాన మార్కెట్లకు కనెక్ట్ అవుతుంది. వ్యాపార సంస్థలు ముడి సరుకులు, ఉత్పత్తులను వేగంగా రవాణా చేసుకునేందుకు ఇది అత్యంత కీలకమైన మార్గంగా (key artery) మారనుంది.

Advertisement
Advertisement