త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NCLT Subhash Chandra | అప్పు రూ.22 వేల కోట్లు.. చెల్లించేది రూ.6 కోట్లే: NCLT పై రాహుల్ ఫైర్, అసలు జీ గ్రూప్ వివాదం ఏంటి?

రూ. 22 వేల కోట్ల బకాయిలకు కేవలం రూ. 6.5 కోట్లతో సెటిల్మెంట్. ఎన్‌సిఎల్‌టి నిర్ణయంపై రాహుల్ గాంధీ ఫైర్, జీ గ్రూప్ సుభాష్ చంద్ర వాదన ఏంటో తెలుసుకుందాం రండి.

J

National | Published On Aug 29, 2026, 3.45 pm IST

NCLT Subhash Chandra | అప్పు రూ.22 వేల కోట్లు.. చెల్లించేది రూ.6 కోట్లే: NCLT పై రాహుల్ ఫైర్, అసలు జీ గ్రూప్ వివాదం ఏంటి?
Advertisement
  • జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర రూ. 22,006 కోట్ల అప్పులకు, కేవలం రూ. 6.5 కోట్లతో సెటిల్మెంట్ చేసేందుకు NCLT ఆమోదం
  • 99.97 శాతం 'హెయిర్ కట్' (రుణ మాఫీ) ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
  • NCLT ని 'నేతా-కంపెనీ లూట్ ట్రిబ్యునల్'గా అభివర్ణించిన రాహుల్
  • దేశంలో సామాన్యుడికి ఒక న్యాయం, బడా బాబులకు మరో న్యాయం ఉందంటూ మండిపాటు
  • తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన సుభాష్ చంద్ర
  • ఇప్పటికే రూ.43 వేల కోట్లు చెల్లించానని, తన జీవితం తెరిచిన పుస్తకమని వెల్లడి

NCLT Subhash Chandra | త్రినేత్ర.న్యూస్ : ఒక సామాన్యుడు బైక్ లోన్ లేదా కనీసం ఒక్క నెల ఈఎంఐ (EMI) ఆలస్యంగా కట్టినా బ్యాంక్ రికవరీ ఏజెంట్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి, సిబిల్ (CIBIL) స్కోర్ పడిపోతుంది. కానీ, వేల కోట్ల రూపాయల అప్పులున్న బడా కార్పొరేట్ దిగ్గజాలకు మాత్రం వ్యవస్థ ఎర్రతివాచీ పరుస్తోంది. తాజాగా జీ గ్రూప్ (Zee Group) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. రూ.22,006 కోట్ల బకాయిలకు కేవలం రూ.6.5 కోట్లు చెల్లించేలా NCLT ఆమోదం తెలపడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇది హెయిర్ కట్ కాదు.. ముండన్ (గుండు కొట్టడం): కాంగ్రెస్

సుభాష్ చంద్ర రుణ పరిష్కార ప్రక్రియలో బ్యాంకులు ఏకంగా 99.97% నిధులను కోల్పోతున్నాయి. అంటే వంద రూపాయల అప్పుకు, కనీసం 3 పైసలు కూడా వెనక్కి రాని పరిస్థితి. దీనిపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఎన్‌సిఎల్‌టి (NCLT) అంటే "నేతా-కంపెనీ లూట్ ట్రిబ్యునల్" అంటూ కొత్త పేరు పెట్టారు.

దేశంలో మోదీ ప్రభుత్వం రెండు వ్యవస్థలను సృష్టించిందని రాహుల్ ఆరోపించారు. "ఒక రైతు రూ.50 వేలు కట్టకపోతే భూమి వేలం వేస్తారు. ఉద్యోగి ఒక EMI కట్టకపోతే ఇంటికి గూండాలను పంపుతారు. కానీ మోదీకి కావాల్సిన 'మిత్రులకు' మాత్రం బ్యాంకుల డబ్బు సొంత ఆస్తి లాంటిది" అని ఎక్స్‌ వేదికగా రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సైతం స్పందిస్తూ.. ఇది ఆర్థిక పరిభాషలో చెప్పే 'హెయిర్‌కట్' కాదని, ప్రజా ధనానికి పూర్తిగా 'ముండన్' (గుండు కొట్టడం) చేయడమే అని ఎద్దేవా చేశారు.

అసలు NCLT ఈ డీల్‌ను ఎందుకు ఆమోదించింది?

సుమారు రూ.22 వేల కోట్ల క్లెయిమ్స్‌కు గాను కేవలం రూ.6.5 కోట్లు ఇచ్చే ప్రపోజల్‌ను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి కొన్ని సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ నిబంధనల ప్రకారం 80.81 శాతం మంది రుణదాతలు (Creditors) ఈ రీపేమెంట్ ప్లాన్‌కు ఓటు వేశారు. వ్యతిరేకించిన వారి ఓటింగ్ శాతం 20% కంటే తక్కువే ఉంది. ఒకవేళ ఈ సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోకుండా, సుభాష్ చంద్రను బ్యాంక్రప్టసీ (దివాలా) కింద ప్రకటిస్తే.. ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ చాలా తక్కువగా ఉన్నందున ఈ 6 కోట్లు కూడా బ్యాంకులకు తిరిగి రావని NCLT తన తీర్పులో పేర్కొంది.

"నా జీవితం తెరిచిన పుస్తకం": సుభాష్ చంద్ర కౌంటర్

రాజకీయ వివాదం ముదరడంతో ఎస్సెల్ గ్రూప్ (Essel Group) చైర్మన్ సుభాష్ చంద్ర స్వయంగా రంగంలోకి దిగారు. తనపై వస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.

"నాపై ఉన్న క్లెయిమ్ రూ.22 వేల కోట్లు కాదు, నేను వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చిన రూ.3,992 కోట్లు మాత్రమే. నేను ఏ బ్యాంకు దగ్గరా నేరుగా అప్పు తీసుకోలేదు. నేను నా తప్పును అంగీకరించి అప్పులు తీరుస్తున్నాను. ఇప్పటికే జీల్ (ZEEL) సంస్థను అమ్మేశాను, నా సొంత ఇంటిని కూడా తాకట్టు పెట్టాను. వడ్డీల రూపంలోనే వ్యవస్థకు రూ.60 వేల కోట్ల నుంచి 70 వేల కోట్లు చెల్లించాను. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. రూ.17 తో ప్రయాణం ప్రారంభించి ఈ స్థాయికి వచ్చాను. మళ్లీ పుంజుకుంటాను. త్వరలో నా భవిష్యత్ ప్రణాళికలు ప్రకటిస్తాను." అని ఆయన స్పష్టం చేశారు.

సామాన్యుడి మదిలో మెదిలే ప్రశ్నలు..

చట్టపరంగా మెజారిటీ ఓటింగ్, ఎన్‌సీఎల్‌టి నిబంధనలు అన్నీ కరెక్ట్‌గానే ఉండొచ్చు. కానీ బ్యాంకులు భరించే ఈ 99.97% నష్టం భారం చివరికి సామాన్యుడి మీదే పడుతుందన్నది కాదనలేని సత్యం. సామాన్యుడికి ఒక న్యాయం, కార్పొరేట్లకు మరో న్యాయం అన్నట్లుగా ఉన్న ఈ విధానంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement