త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి

Rahul Gandhi | లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

P

National | Published On Nov 29, 2026, 12.56 pm IST

Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి
Advertisement

Rahul Gandhi | లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టాలిన్‌తో పాటు డీఎంకే మద్దతు కోరుతూ రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్టు చేశారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచడం భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నియోజకవర్గాల స్వరూపాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు అపరిమిత అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లును ఓడించేందుకు జాతీయ ప్రయోజనాలు, తమిళనాడు ప్రయోజనాలు, రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

స్టాలిన్‌పై రాహుల్ ప్రశంసలు

తమిళ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా సోదరుడు స్టాలిన్ ఎప్పుడూ కొండంత అండగా నిలిచారని రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఇప్పుడు కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసం డీఎంకే కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు. రాజ్యాంగం, రాష్ట్రాల హక్కుల పరిరక్షణలో డీఎంకే చారిత్రక పాత్రను గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి నిర్ణయంలోనూ తమిళనాడు, తమిళ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. చరిత్ర తమను కట్టబొమ్మన్‌గా గుర్తుంచుకుంటుందని, ఎట్టప్పన్‌గా కాదని వ్యాఖ్యానించారు.

డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్ (రెండో) బిల్లు-2026లను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచి గరిష్ట సంఖ్యను 850కి చేర్చాలనే ప్రతిపాదిస్తోంది. కొత్తగా నిర్ణయించే స్థానాల కేటాయింపు 2051 వరకు కొనసాగనుంది. అయితే, లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రతిపాదనపై దక్షిణాది రాష్ట్రాల నేతలు అభ్యంత‌రం తెలుపుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం ఢిల్లీలో కేరళ, తెలంగాణ నేతలు వీడీ సతీశన్, రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. డీలిమిటేషన్ ప్రతిపాదనలపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను సమన్వయం చేసే దిశగా ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
Advertisement