త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | దేవాదుల మోటార్లు ఆన్ చేయకుండా వరంగల్, జనగామ జిల్లాలను ఎండబెట్టారు

Harish Rao | దేవాదుల (Devadula) మోటార్లు ఆన్ చేయ‌కుండా వ‌రంగ‌ల్‌ (Warangal), జ‌న‌గామ (Jangon) జిల్లాల‌ను ఎండ‌బెట్టార‌ని.. మిడ్ మానేరుకు కాళేశ్వ‌రం నీళ్లు తెస్తే ఎస్ఆర్ఎస్పీ కింద వ‌రంగ‌ల్ స‌హా 13 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ జ‌రిగేద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు.

S

Telangana | Published On Nov 29, 2026, 7.07 pm IST

Harish Rao | దేవాదుల మోటార్లు ఆన్ చేయకుండా వరంగల్, జనగామ జిల్లాలను ఎండబెట్టారు
Advertisement
  • సమ్మక్క బ్యారేజీ వద్ద 1,456 టీఎంసీల వరద వచ్చినా.. 35 టీఎంసీలు ఎత్తే సామర్థ్యం ఉన్న దేవాదులలో కేవలం 15 టీఎంసీలే ఎత్తి 20 టీఎంసీలు చంద్రబాబుకు వదిలిపెట్టారు
  • కాళేశ్వరం కూలిపోయిందన్న రేవంత్ మైండ్ దొబ్బింది.. మరి 11 నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నీళ్లు ఎక్కడివి? మూసీకి రూ.8,000 కోట్లతో పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
  • రైతులకేమో కరువు.. రేవంత్ రెడ్డికి కమీషన్ల పంట
  • 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతే ఒక్క పైసా ఇవ్వలేదు.. ఒక్కో మీటింగ్‌కు 50 కోట్లు ఖర్చు
  • మిడ్ మానేరుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఉంటే ఎస్ఆర్ఎస్పీ కింద వరంగల్ సహా 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది
  • పల్నాడు లిఫ్ట్ కడుతుంటే రేవంత్ మొద్దు నిద్ర పోతుండు
  • జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దీక్షా దివ‌స్‌లో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నిప్పులు

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: దేవాదుల (Devadula) మోటార్లు ఆన్ చేయ‌కుండా వ‌రంగ‌ల్‌ (Warangal), జ‌న‌గామ (Jangon) జిల్లాల‌ను ఎండ‌బెట్టార‌ని.. మిడ్ మానేరుకు కాళేశ్వ‌రం నీళ్లు తెస్తే ఎస్ఆర్ఎస్పీ కింద వ‌రంగ‌ల్ స‌హా 13 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ జ‌రిగేద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 1,456 టీఎంసీల వరద వచ్చినా.. 35 టీఎంసీలు ఎత్తే సామర్థ్యం ఉన్న దేవాదులలో కేవలం 15 టీఎంసీలే ఎత్తి 20 టీఎంసీలు చంద్రబాబుకు వదిలిపెట్టారని ఆరోపించారు. కాళేశ్వరం కూలిపోయిందన్న రేవంత్.. 11 నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నీళ్లు ఎక్కడివి? మూసీకి రూ.8,000 కోట్లతో పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారని ప్ర‌శ్నించారు. దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా పార్టీ శ్రేణులకు అవగాహన కల్పిస్తూ హరీశ్ రావు మాట్లాడారు.

పోరాటాల‌తో వ‌చ్చిన తెలంగాణిది

ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. తెలంగాణ ఉద్యమ గతిని, చరిత్ర గతిని మలుపు తిప్పిన మహోన్నత దినం నవంబర్ 29. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు, జూన్ 2 లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, 11 రోజుల పాటు అన్నం ముద్ద ముట్టకుండా దీక్ష చేసి ఢిల్లీ మెడలు వంచడం వల్లే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఊరికే రాలేదు, కాంగ్రెస్ పార్టీ ఇస్తే రాలేదు.. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇది.

తెలంగాణ ఉద్యమ చరిత్రలో జనగామ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 2001 నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన ప్రాంతం జనగామ, చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, ధూల్మిట్ట, కొమురవెల్లి. ఉద్యమ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకుంటారు.

ఇవాళ రేవంత్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడు. నా దృష్టిలో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. నవంబర్ 29 లేకపోతే, తెలంగాణ రాష్ట్రమే రాకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండేవాడు? అదే చంద్రబాబు నాయుడుకు అడుగులకు మడుగులొత్తుతూ, ఆంధ్ర నాయకుల బూట్లు తాకుతూ ఉండేవాడు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా జై తెలంగాణ అన్నావా? పదవికి రాజీనామా చేశావా? అమరుల కుటుంబాలను పరామర్శించావా? ఉల్టా ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఉద్యమంలో మేం ఎన్నో శవాలు మోశాం, ఎంతో దుఃఖాన్ని ఎదుర్కొన్నాం.

కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలా వదిలి ఉద్యమాన్ని ప్రారంభించారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి, జేఏసీ ఏర్పాటు చేసి, కోదండరాంను చైర్మన్‌గా పెట్టి అన్ని శక్తులను ఏకం చేసి హైదరాబాద్‌తో కూడిన సురక్షిత తెలంగాణను సాధించారు. తెలంగాణ సాధించడమే కాదు, తన పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు కేసీఆర్. రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని దశదిశలా వ్యాపింపజేశారు.

కానీ రేవంత్ రెడ్డి మూడేళ్ల పాలనలో తెలంగాణ ఆగమైపోయింది. మళ్లీ రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెది ఒక దారి అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు. గ్రామాల్లో వడ్లు కొనడం లేదు, కొబ్బరికాయలు కొట్టి సెంటర్లు మూసేశారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయి. వడ్లు కొనవయ్యా రేవంత్ రెడ్డి, ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావు? అని ప్రజలు అడుగుతుంటే, ఆయన మాత్రం మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సమ్మిట్ అంటున్నాడు. ఉన్న దేవాదుల మోటార్లు ఆన్ చేసే తెలివి లేదు కానీ గ్లోబల్ సమ్మిట్ పెడతాడట. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే.. రైతులకేమో కరువు, రేవంత్ రెడ్డికి కమిషన్ల పంట పండుతోంది. కేవలం తన కమిషన్ల కోసమే మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సమ్మిట్ అంటున్నాడు.

గుడ్డెద్దు చేన్లో పడ్డట్టుంది

అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలు. ఈ రాష్ట్రానికి ఏడాది కాలంగా పరిశ్రమల శాఖ కార్యదర్శి లేడు, ఐటీ కార్యదర్శి లేడు. వచ్చిన పారిశ్రామికవేత్తలతో ఎవరు మాట్లాడతారు? ఎవరు ఫాలోఅప్ చేస్తారు? రేవంత్ రెడ్డి పెట్టేది గ్లోబల్ సమ్మిట్ కాదు, తన అబద్ధాలను ప్రచారం చేసుకునే గోబెల్స్ సమ్మిట్. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు తప్ప ఒక్క రూపాయి సాయం చేయలేదు. పక్కనే ఉన్న మహారాష్ట్ర ఎకరానికి రూ.5,000, కర్ణాటక రూ.2,500 చొప్పున పరిహారం ఇస్తూ, ఉచిత విత్తనాలు, ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు వ్యవహరిస్తున్నాడు.

రేవంత్ రెడ్డి వారానికో మీటింగ్ పెడుతూ ఒక్కో మీటింగ్‌కు కనీసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. మొన్న సిద్దిపేట మీటింగ్ కోసం నారాయణ్‌ఖేడ్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, కోరుట్ల, జగిత్యాల, మెట్‌పల్లి, కరీంనగర్, సిరిసిల్ల నుంచి 1,500 బస్సులు పెట్టి, భోజనాలకు తలా రూ.500 ఖర్చు చేసి రూ.50 కోట్లు తగలేసి, సిద్దిపేటకు 50 పైసలు కూడా ఇవ్వలేదు. శునకానందంలాగా తిట్ల ఆనందం పొందుతున్నాడు రేవంత్ రెడ్డి. సిద్దిపేట మీటింగ్‌లో ఒక గంటలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, నన్ను కలిపి 140 సార్లు తిట్టాడు. చేసింది ఏమీ లేదు, చేయబోయేది అంతకంటే లేదు.. అందుకే తిట్లు తప్ప ప్రజలకు చెప్పడానికి ఏమీ మిగలలేదు.

ప‌ల్లా న‌న్ను అందుకే పిలిచారు

పల్లా రాజేశ్వర్ రెడ్డి నన్ను స్పీచ్ చెప్పడానికి కాదు, ఇరిగేషన్ మీద క్లాస్ చెప్పడానికి పిలిచారు. మన కార్యకర్తలంతా పుస్తకాల్లో రాసుకోండి, అడ్డగోలుగా మాట్లాడే కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదు.. 100 శాతం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఆధారాలు, లెక్కలతో సహా చెబుతున్నా. గోదావరి నదిపై బ్యారేజీ లేక గతంలో దేవాదుల మోటార్లు ఏడాదికి 90 రోజులే నడిచేవి. ఏడాదికి 250 రోజులు నీళ్లు ఎత్తుకోవాలనే దూరదృష్టితో కేసీఆర్ సమ్మక్క బ్యారేజీని నిర్మించారు.

దేవాదుల ఫేజ్-1 (5 టీఎంసీలు), ఫేజ్-2 (12 టీఎంసీలు), ఫేజ్-3 (25 టీఎంసీలు) కలిపి మొత్తం 42 టీఎంసీల నీళ్లు తెచ్చేలా ప్రాజెక్టును తీర్చిదిద్దారు. కాంగ్రెస్ హయాంలో రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు 49 కిలోమీటర్ల సొరంగం కుప్పకూలి, ముగ్గురు కార్మికులు చనిపోతే దాన్ని మూలకు పడేశారు. కేసీఆర్ దాన్ని పునరుద్ధరించి, డీవాటరింగ్ చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్‌ను, పంప్ హౌస్‌లను, సబ్ స్టేషన్లను పూర్తి చేసి మూడో దశను సిద్ధం చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క రెండుసార్లు వచ్చి ఏడాదిలో పూర్తి చేస్తామని, జూన్ 2026 కల్లా పూర్తి చేస్తామని డెడ్‌లైన్లు పెట్టారు. జూన్ వెళ్లిపోయింది కానీ పని కాలేదు, ఇది కూడా రుణమాఫీ లెక్కనే తయారైంది.

దేవాదుల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో రెండేళ్లు కరోనా ఉన్నప్పటికీ 6,338 కోట్లు సగటున ఏడాదికి రూ.704 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో పెట్టింది కేవలం 595 కోట్లు ఏడాదికి రూ.198 కోట్లు మాత్రమే. భూసేకరణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,231 హెక్టార్లు అంటే 15,397 ఎకరాలు ఏడాదికి సగటున 1,711 ఎకరాలు సేకరిస్తే, కాంగ్రెస్ మూడేళ్లలో సేకరించింది కేవలం 739 ఎకరాలు ఏడాదికి 246 ఎకరాలు మాత్రమే. 2001 నుంచి 2014 వరకు 13 ఏళ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలనలో దేవాదుల కింద కేవలం 45,000 ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో 2,71,000 ఎకరాలకు సాగునీరు అందిస్తే, మేం అంతా సిద్ధం చేసి పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో ఇచ్చింది కేవలం 16,000 ఎకరాలకు ఏడాదికి 5,300 ఎకరాలు మాత్రమే. సమ్మక్క బ్యారేజీ వద్ద ఈ సీజన్‌లో జూన్‌లో 10 టీఎంసీలు, జూలైలో 251, ఆగస్టులో 623, సెప్టెంబర్‌లో 462, అక్టోబర్‌లో 110 టీఎంసీలు.. వెరసి ఏకంగా 1,456 టీఎంసీల గోదావరి వరద వచ్చింది. దేవాదుల మూడు ఫేజుల్లోని 10 మోటార్ల ద్వారా రోజుకు 2,600 క్యూసెక్కుల చొప్పున నెలకు సుమారు 6.7 నుంచి 6.9 టీఎంసీల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంది.

ఎల్ నినో వల్ల కరువు వస్తుందని శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా, జూన్ నెలలో 6.7 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా రేవంత్ రెడ్డి కనీసం స్విచ్ కూడా ఆన్ చేయలేదు, ఒక్క చుక్క నీరు ఎత్తలేదు. కరువు ముంచుకొస్తోందని స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ నాయకులు హైదరాబాద్ వచ్చి నాతో కలిసి తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి నిలదీసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఆ తర్వాత జూలైలో 6.9 టీఎంసీలకు గాను 3.9 టీఎంసీలు, ఆగస్టులో 6.9కి గాను 5.4, సెప్టెంబర్‌లో 6.7కి గాను 3 టీఎంసీలు, అక్టోబర్‌లో 6.9కి గాను 4.4 టీఎంసీలు మాత్రమే ఎత్తారు.

ఎందుకింత తక్కువ ఎత్తారంటే.. 10 మోటార్లలో 2 మోటార్ల బేరింగులు పోతే వానాకాలానికి ముందే రిపేర్ చేయించకుండా మూలకు పడేశారు. మిగిలిన 8 మోటార్లను కూడా 24 గంటలు నడపకుండా, కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుందనే కక్కుర్తితో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు కేవలం 10 గంటలు మాత్రమే నడిపారు. మొత్తం మీద 10 మోటార్లను 24 గంటలు నడిపితే 35 టీఎంసీల నీళ్లు ఎత్తే అవకాశం ఉండగా, రేవంత్ రెడ్డి ఎత్తింది కేవలం 15 టీఎంసీలే. మిగిలిన 20 టీఎంసీల నీళ్లను ఎత్తకుండా తన గురువు చంద్రబాబు కోసం కిందికి వదిలేశాడు. ఆ 20 టీఎంసీలు ఎత్తి ఉంటే మన చేర్యాల, బచ్చన్నపేట సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం పంట ఎండేది కాదు, యాసంగి పంట కూడా బ్రహ్మాండంగా పండేది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు గుడ్ ఇయర్, యావరేజ్ ఇయర్, డ్రాట్ ఇయర్ అనే మూడు రకాల నీటి లభ్యత ఉంటుంది. గత రెండేళ్లు మంచి వర్షాలు పడటంతో నీళ్లు ఎత్తుకుని వాడుకున్నారు. ఈ ఏడాది కరవు పరిస్థితులు వచ్చినా, కరవు ఏడాదిలో కూడా నీళ్లు ఎత్తే అవకాశం ఉందని 80 ఏళ్ల వయసున్న, రాష్ట్రానికి 30 ఏళ్లు సేవలందించిన రిటైర్డ్ ఇంజనీర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు.

మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగి గేట్లు తెరిచి ఉంచినా సరే, గోదావరి నదిలో 20 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తే సహజంగానే నీటి మట్టం 93 మీటర్ల కంటే పైకి చేరుతుంది. అప్పుడు గేట్లు మూయాల్సిన అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ల ఫుట్‌వాల్వ్‌లకు నీళ్లు అందుతాయి. ఈ ఏడాది ఐదు నెలల పాటు నదిలో 20 వేల నుంచి 10 లక్షల క్యూసెక్కుల దాకా వరద పారినా రేవంత్ రెడ్డి మోటార్లు ఆన్ చేయలేదు. పొలంలో బోరు ఎత్తిపోతే రైతు ఇంకో బోరు వేస్తాడు, బావిలో నీళ్లు అడుగంటితే క్రేన్ పెట్టి పూడిక తీయిస్తాడు. కానీ కరవు సమయంలో నీళ్లు ఎత్తమని తెలంగాణ సోయితో సలహా ఇచ్చిన 80 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచి మాట్లాడాల్సింది పోయి, మీకు బెల్ట్ ట్రీట్‌మెంట్ ఇస్తా, జైల్లో వేస్తా అని రేవంత్ రెడ్డి బెదిరించడం దుర్మార్గం.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, వాటి గేట్లు మూసి నీళ్లు ఎత్తవచ్చని కేంద్ర ప్రభుత్వ సంస్థ CWPRS నివేదిక ఇచ్చింది. 18 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల టన్నెళ్లు, 1,400 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 18 పంప్ హౌస్‌లు, 18 సబ్ స్టేషన్లతో 99 శాతం కాళేశ్వరం వ్యవస్థ పటిష్టంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 18.31 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 18.61 లక్షల ఎకరాల స్థిరీకరణ మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాళేశ్వరం నీళ్లను మిడ్ మానేరుకు తెచ్చి అక్కడి నుంచి SRSP)కాలువలకు వదిలితే, వరంగల్ జిల్లాలోని కమలాపూర్, జమ్మికుంట, వరంగల్ వెస్ట్, నర్సంపేట, భూపాలపల్లి ప్రాంతాల్లోని 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది.

ఈరోజు కూడా మేడిగడ్డ వద్ద 8,190 క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందికి పోతున్నాయి. కనీసం ఒక చిన్న కాఫర్ డ్యామ్ గానీ, రబ్బర్ డ్యామ్ గానీ వేసి ఉంటే ఆ నీటిని ఆపి మోటార్లతో ఎత్తిపోసే అవకాశం ఉండేది. మూడేళ్లుగా రేవంత్ రెడ్డి ఆ పని చేయడం లేదు. సకాలంలో నీళ్లు ఎత్తకపోవడం వల్ల మల్లన్నసాగర్ నిండక హైదరాబాద్‌లో తాగునీటి కరువు మొదలైంది. మొన్న నేను వెళ్లిన ఒక గేటెడ్ కమ్యూనిటీలోని 4,000 అపార్ట్‌మెంట్లకు రాబోయే నాలుగైదు నెలలు నీళ్లు ఉండవని జలమండలి నోటీసులు ఇచ్చింది.

నీళ్లు లేక కొందరు ఊర్లకు వెళ్లిపోతుంటే, అమెరికా నుంచి రావాల్సిన వాళ్లు వానాకాలం వచ్చాకే వస్తామని ఆగిపోతున్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యల వల్ల హైదరాబాద్ నుంచి ప్రజలు వలస వెళ్లే దుస్థితి వచ్చింది. కాళేశ్వరం కూలిపోయిందని, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కాళేశ్వరమే కూలిపోతే నేడు జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, మేడ్చల్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ సహా 11 నియోజకవర్గాల ప్రజలు తాగుతున్న మల్లన్నసాగర్ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి.

అంతేకాదు, కూలిపోయిన కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచే గజ్వేల్, ప్రజ్ఞాపూర్, శామీర్‌పేట మీదుగా హైదరాబాద్ మూసీకి రూ.8,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు? దీన్నిబట్టే కాళేశ్వరం కూలలేదని, రేవంత్ రెడ్డి మైండ్ దొబ్బిందని అర్థమవుతోంది. కృష్ణా నదిలో జూరాల, శ్రీశైలం మీదుగా నాగార్జునసాగర్‌కు నీళ్లు వస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 88 వేల క్యూసెక్కులు రాయలసీమకు తరలించుకుపోయి అన్యాయం చేశారు.

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు, ఏఎంఆర్ ఎస్ఎల్‌బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందుతుంది. హైదరాబాద్‌కు సగం మంచినీళ్లు సాగర్ నుంచే వస్తాయి. అలాంటి జాయింట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొక్క కొట్టి, జనవరి 2026లో టెండర్లు పిలిచి పల్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టింది. మన అనుమతి గానీ, కేంద్ర అనుమతి గానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే రేవంత్ రెడ్డి, ఆయన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నాయి?

15వ తేదీన నమస్తే తెలంగాణ పత్రిక ఈ కుట్రను బయటపెట్టి, కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాక గానీ రేవంత్ రెడ్డి కళ్లు తెరుచుకోలేదు. అప్పుడు హడావుడిగా 16వ తేదీతో బ్యాక్ డేట్ వేసి ఢిల్లీకి లేఖ రాశారు. అక్కడెవరో ఆంధ్ర ఇంజనీర్ ఉన్నాడు, మాకు చెప్పలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారు. మీరు నడిపేది సర్కారా? లేక సర్కసా? తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి 2022 నాటి జీవో నంబర్ 56ను చూపిస్తూ కేసీఆర్ హయాంలోనే అనుమతి ఇచ్చారని రేవంత్ రెడ్డి బురద చల్లే ప్రయత్నం చేశారు. కానీ జీవో 56 పూర్తిగా చదివితే, అది గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, ఇంటింటికి నల్లా పైప్‌లైన్ల కోసమే తప్ప నాగార్జునసాగర్ నుంచి చుక్క నీరు తీసుకునే ప్రస్తావనే అందులో లేదు.

వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ఈ ఏడాది ఆగస్టు 4న‌ ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 453 ద్వారా నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 1.865 టీఎంసీల నీటిని నేరుగా తోడుకునేందుకు అనుమతి ఇచ్చింది. కుల్లంకుల్లా ఆధారాలతో దొరికిపోయాక సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకున్నారు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement
Advertisement