త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cabinet Expansion | మోదీ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు రంగం సిద్ధం?

Cabinet Expansion | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు రాజకీయ సమీకరణాలపైనా దృష్టి సారించింది.

P

National | Published On Nov 29, 2026, 8.55 am IST

Cabinet Expansion | మోదీ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు రంగం సిద్ధం?
Advertisement
  • పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు వేళ దేశ రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపు
  • మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు, డీలిమిటేష‌న్ బిల్లుల ఆమోదానికి బీజేప ప్ర‌య‌త్నం ప్ర‌య‌త్నాలు
  • బిల్లుల ఆమోదానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం
  • ఈ క్ర‌మంలోనే మంత్రివ‌ర్గంలోకి డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ)
  • స్టాలిన్ పార్టీకి రెండు ప‌ద‌వులు ఇచ్చే ఛాన్స్‌
  • మ‌రో ప‌ద‌వి కావాలంటున్న షిండే
  • డిసెంబ‌ర్ 3 త‌ర్వాతే కొలిక్కి
  • టీఎంసీ రెబ‌ల్స్‌పైనే అంద‌రి దృష్టి

Cabinet Expansion | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు రాజకీయ సమీకరణాలపైనా దృష్టి సారించింది. పార్లమెంట్‌లో కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన మద్దతు కూడగట్టడంతోపాటు, మిత్రపక్షాల బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ అంశం కూడా తెరపైకి వచ్చింది. కొత్త ఏడాది ప్రారంభమయ్యేలోగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చన్న ప్రచారం జోరందుకుంది.

బిల్లుల ఆమోదానికి ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక బిల్లులు చర్చకు వచ్చే అవ‌కాశ‌ముంది. లోక్‌సభ స్థానాల సంఖ్యను గరిష్టంగా 850కి పెంచడం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను త్వరగా అమలు చేసేలా రాజ్యాంగ సవరణలు చేయడం కేంద్రం ప్రతిపాదన‌లు కీల‌కం. ఈ బిల్లులకు రాజ్యాంగ సవరణకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించాల్సి ఉండటంతో అధికార పక్షం ఇతర పార్టీల మద్దతుపైనా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన డీఎంకే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వంటి పార్టీల వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండు పార్టీలు బిల్లుల విషయంలో తమ అభిప్రాయాలను వెల్లడించగా, కేంద్రం కూడా వాటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల వాటాలో అసమానతలు రాకుండా చూడాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, బిల్లులకు మద్దతు ఇవ్వడం అంటే ఎన్డీయే కూటమిలో చేర‌మేన‌ని కాదు కానీ.. బీజేపీ రెండు పార్టీల‌ను ప్ర‌భుత్వంలోకి తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే, డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) అధికారికంగా ఎన్డీయేలో చేరుతున్నట్లుగా వ‌స్తున్న వార్త‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. ఈ రెండు పార్టీల మద్దతు నేపథ్యంలో మంత్రివర్గ విస్త‌ర‌ణ అంశం తెర‌పైకి వ‌చ్చింది.

డీఎంకేకు రెండు.. ఎన్సీపీ (ఎస్పీ)కి ఒక పదవి?

కేంద్ర మంత్రివర్గంలో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీఎంకేకు రెండు మంత్రి పదవులు, ఎన్సీపీ (ఎస్పీ)కి ఒక పదవి ఇవ్వవచ్చన్న అంచనాలున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనలకు సంబంధించి వివ‌రాలు తెలియాల్సి ఉంది. డీఎంకేకు చెందిన కనిమొళి పేరును మంత్రి పదవికి సంబంధించి పరిశీలిస్తున్నారన్న ప్రచారం జ‌రుగుతోంది. పార్టీ కోటాలో ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై డీఎంకే నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)కి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించే అంశంపైనా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. శ‌ర‌ద్ ప‌వార్ త‌న‌య సుప్రియా సూలేను కేబినెట్‌లోకి తీసుకుంటార‌నే ఊహాగానాలు జోరందుకున్నాయి.

టీఎంసీ ఎంపీల వ్య‌వ‌హారం కీల‌కం..

మంత్రివర్గ విస్తరణతోపాటు టీఎంసీ నుంచి విడిపోయిన 20 మంది ఎంపీల వ్యవహారం కూడా కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ ఎంపీలు విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనమైనట్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ విలీనానికి సంబంధించిన అంశంపై లోక్‌సభ స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వ్యవహారంపై స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఎంపీల విలీనానికి చట్టబద్ధమైన గుర్తింపు లభిస్తుందా? అనర్హత పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? అన్న అంశాలపై స‌ర్వ‌త్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలోనే ఈ వ్యవహారంపై స్పీకర్ నిర్ణయం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

శివసేన (షిండే)కు మరో మంత్రి కావాల‌ట!

మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా కేంద్ర మంత్రివర్గంలో తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీకి కేంద్రంలో ఒక మంత్రి పదవి మాత్రమే ఉంది. ఇటీవల శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో చేరడంతో లోక్‌సభలో ఆ పార్టీ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో తమ ప్రస్తుత ఎంపీల సంఖ్యకు అనుగుణంగా మరో మంత్రి పదవి ఇవ్వాలని షిండే వర్గం కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. లోక్‌సభలో 12 మంది ఎంపీలున్న జేడీయూకు కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరికి అవకాశం కల్పించిన తరహాలోనే తమకూ ప్రాతినిధ్యం ఉండాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్‌పై కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

డిసెంబర్ 3 తర్వాతే విస్తరణపై స్పష్టత?

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపైనే దృష్టి పెట్టింది. డిసెంబర్ 3తో సమావేశాలు ముగిసిన తర్వాత వివిధ పార్టీలతో మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చలు జరిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల సమాచారం. కొత్త ఏడాది ప్రారంభమయ్యేలోగా విస్తరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నది కేంద్ర నాయకత్వం ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుంది? ఇప్పటికే ఉన్న మిత్రపక్షాలకు ఎన్ని పదవులు కేటాయిస్తారు? కొత్తగా ఏయే పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు? అన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై ప్రాంతీయ పార్టీల మద్దతు ఎలా ఉంటుందన్నది కూడా కీలకం కానుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ముగింపు తర్వాత కేంద్ర రాజకీయాల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Advertisement
Advertisement