త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPU Students Protest | పంజాబ్ ఎల్‌పీయూలో హైటెన్షన్: మిగ్-23 ఎక్కి విద్యార్థుల నిరసన.. అసలు ఏం జరిగింది?

పంజాబ్‌లోని ఎల్‌పీయూలో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న ప్రచారంతో రాత్రికి రాత్రే ఉద్రిక్తత చెలరేగింది. యుద్ధ ట్యాంకులు, మిగ్ విమానంపైకి ఎక్కి విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

J

National | Published On Sep 27, 2026, 4.49 pm IST

LPU Students Protest | పంజాబ్ ఎల్‌పీయూలో హైటెన్షన్: మిగ్-23 ఎక్కి విద్యార్థుల నిరసన.. అసలు ఏం జరిగింది?

సంక్షిప్త సారాంశం

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్‌లో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందన్న వార్తలతో అర్ధరాత్రి భారీ ఎత్తున విద్యార్థుల నిరసనలు మిన్నంటాయి. ఆందోళనకారులు క్యాంపస్‌లోని మిగ్‌-23 యుద్ధ విమానం, ఆర్మీ ట్యాంక్‌పైకి ఎక్కి నినాదాలు చేయడమే కాకుండా కొన్ని చోట్ల విధ్వంసానికి పాల్పడ్డారు. జలంధర్-ఫగ్వారా హైవేను దిగ్బంధించారు. ఈ ప్రచారాన్ని యూనివర్సిటీ యాజమాన్యం పూర్తిగా ఖండించగా, బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. గర్ల్స్ హాస్టళ్లలో పూర్తిగా మహిళా సిబ్బందినే నియమించాలన్న విద్యార్థుల డిమాండ్‌ను మేనేజ్‌మెంట్‌తో చర్చించి పరిష్కరిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

LPU Students Protest | త్రినేత్ర న్యూస్ : పంజాబ్‌లోని ప్రముఖ విద్యాసంస్థ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్ హాస్టల్‌లో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందన్న ప్రచారం దావానలంలా వ్యాపించడంతో వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి భారీ నిరసనకు దిగారు.

మిగ్‌-23, ఆర్మీ ట్యాంకులపైకి ఎక్కి ఆందోళన

ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థులు క్యాంపస్‌లో ఎగ్జిబిషన్‌గా ఉంచిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిగ్‌-23 (MiG-23UM) యుద్ధ విమానం, మిలిటరీ ట్యాంక్‌లపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొన్నిచోట్ల అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేయడంతో పాటు ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. రాత్రి ఒంటిగంట సమయంలో గర్ల్స్ హాస్టల్ వద్ద మొదలైన ఈ అలజడి చూస్తుండగానే క్యాంపస్ అంతటా పాకింది. ఆ తర్వాత విద్యార్థులు జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిని దిగ్బంధించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

విద్యార్థుల ఆరోపణలేంటి?Massive Protests at LPU Punjab Over Alleged Assault SIT Formed

సెప్టెంబర్ 24న జీ3 హాస్టల్‌లో ఉండే ఒక విద్యార్థినిపై బయటి నుంచి వచ్చిన ప్లంబర్ లేదా కన్‌స్ట్రక్షన్ వర్కర్ అత్యాచారానికి పాల్పడ్డాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. బాధితురాలు ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపారు.

పోలీసుల రంగప్రవేశం.. సిట్ (SIT) ఏర్పాటు

సమాచారం అందిన వెంటనే జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా, ఎస్పీ గౌరవ్ తూరా నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు మోహరించింది. విద్యార్థిని నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నామని, గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీఐజీ వెల్లడించారు.

ఫగ్వారా ఎస్పీ మేజర్ సింగ్ నేతృత్వంలో ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా నిజా నిజాలు తేలుస్తామని, విద్యార్థి ప్రతినిధులతో కలిసి విచారణ జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే గర్ల్స్ హాస్టళ్లలో పూర్తిస్థాయిలో మహిళా సిబ్బందినే ఉంచాలన్న విద్యార్థుల డిమాండ్‌పై మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతున్నామని చెప్పారు.

వదంతులను నమ్మవద్దు: యూనివర్సిటీ స్పష్టత

మరోవైపు ఈ ప్రచారాన్ని ఎల్‌పీయూ రిజిస్ట్రార్ మోనికా గులాటి తీవ్రంగా ఖండించారు. క్యాంపస్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని, ఇవన్నీ నిరాధారమైన వదంతులని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొందరు అసాంఘిక శక్తులు సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నారని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని యూనివర్సిటీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం క్యాంపస్‌లో పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement