త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Vijay Election Affidavit | ఎన్నికల వేళ టీవీకే చీఫ్ విజయ్‌కు బిగ్ షాక్.. రూ.100 కోట్ల ఆస్తుల వ్యవహారంలో హైకోర్టు నోటీసులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న టీవీకే (TVK) అధినేత, హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రెండు చోట్ల దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆస్తుల ప్రకటనలో రూ.100 కోట్ల మేర వ్యత్యాసం ఉండటంపై న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

J

National | Published On Apr 20, 2026, 6.49 pm IST

TVK Vijay Election Affidavit | ఎన్నికల వేళ టీవీకే చీఫ్ విజయ్‌కు బిగ్ షాక్.. రూ.100 కోట్ల ఆస్తుల వ్యవహారంలో హైకోర్టు నోటీసులు
Advertisement

TVK Vijay Election Affidavit | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (2026) పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్‌కు ఆయన సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాలకు సంబంధించి భారీ వ్యత్యాసం ఉండటంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు విజయ్‌తో పాటు ఆదాయపు పన్ను శాఖ (ఇన్వెస్టిగేషన్) డైరెక్టర్ జనరల్, కేంద్ర ఎన్నికల సంఘం (ECI), పెరంబూర్, తిరుచ్చి (తూర్పు) నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సోమవారం నోటీసులు జారీ చేసింది.

అసలు వివాదం ఏంటి? రూ.100 కోట్ల తేడా ఎలా వచ్చింది?

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆయన చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి (తూర్పు) అనే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, నామినేషన్ల సమయంలో అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్ రూపంలో స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది.

విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లలో వివరాలు పొంతన లేకుండా ఉన్నాయంటూ చెన్నై పెరంబూర్‌కు చెందిన వి.విఘ్నేష్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెరంబూర్ రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో విజయ్ తన ఆస్తుల విలువ రూ.115.13 కోట్లుగా చూపించగా.. తిరుచ్చి (తూర్పు) సెగ్మెంట్‌లో మాత్రం రూ.220.15 కోట్లుగా పేర్కొన్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి పత్రాలు చూపించకుండా ఆస్తుల విలువలో ఇంత భారీగా (దాదాపు రూ.100 కోట్లకు పైగా) వ్యత్యాసం ఉండటం అనుమానాలకు తావిస్తోందని, ఐటీ శాఖతో విచారణ జరిపించాలని కోరారు.

కోర్టు ఏమంది?

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "ఇది ముమ్మాటికీ అక్రమమే. ఒక నియోజకవర్గంలో ఏకంగా రూ.100 కోట్లకు పైగా ఆస్తుల వివరాలను బహిర్గతం చేయలేదు" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ విజయ్ సహా సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేశారు.

మొత్తం ఆస్తులు ఎన్ని? క్రిమినల్ కేసుల్లోనూ తేడాలే..

ఎన్నికల ఫైలింగ్స్ ప్రకారం.. విజయ్ తన మొత్తం ఆస్తుల విలువ రూ.620 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో సుమారు రూ.404.58 కోట్ల చరాస్తులు, రూ.220.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

ఆస్తుల వ్యవహారమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాల్లోనూ విజయ్ అఫిడవిట్లలో తేడాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. టీవీకే రాష్ట్ర సదస్సులో విజయ్ బౌన్సర్లు ఒక వ్యక్తిని ఏడడుగుల ర్యాంప్ పై నుంచి కిందకు తోసేసిన ఘటనపై ఆగస్టు 2025లో ఓ కేసు నమోదైంది. ఏప్రిల్ 2న తిరుచ్చిలో నామినేషన్ వేసినప్పుడు ఈ కేసును ప్రస్తావించిన విజయ్.. మార్చి 30న పెరంబూర్‌లో వేసిన నామినేషన్‌లో మాత్రం ఈ కేసును వెల్లడించలేదు. అలాగే, అనుమతి లేకుండా గుమికూడటం తదితర సెక్షన్ల కింద విజయ్‌తో పాటు 5 వేల మంది పార్టీ కార్యకర్తలపై పెరంబూర్ నామినేషన్ తర్వాత మరో కేసు నమోదైంది. ఈ కేసు వివరాలను సైతం తిరుచ్చి అఫిడవిట్‌లో మాత్రమే ప్రస్తావించడం గమనార్హం.

మొత్తానికి ఎన్నికల పోలింగ్ తేదీ (ఏప్రిల్ 23) సమీపిస్తున్న వేళ, అఫిడవిట్ల వివాదం దళపతి విజయ్‌కు రాజకీయంగా తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement
Advertisement