త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VS Babu | ముఖ్యమంత్రినే బోల్తా కొట్టించిన వీఎస్‌ బాబు..! స్టాలిన్‌కు ఓటమి రుచి చూపించిన డీఎంకే మాజీ నేత..!

VS Babu | తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చుక్కెదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘోర పరాజయం పాలవగా.. ఏకంగా స్టాలిన్‌ సైతం ఓడిపోవడం దారుణం. 1996 తర్వాత తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. చెన్నై కొళత్తూర్‌ నియోజకవర్గంలో ఆయనకు అనూహ్యంగా పరాజం పాలయ్యారు.

P

National | Published On May 4, 2026, 8.36 pm IST

VS Babu | ముఖ్యమంత్రినే బోల్తా కొట్టించిన వీఎస్‌ బాబు..! స్టాలిన్‌కు ఓటమి రుచి చూపించిన డీఎంకే మాజీ నేత..!
Advertisement

VS Babu | తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చుక్కెదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘోర పరాజయం పాలవగా.. ఏకంగా స్టాలిన్‌ సైతం ఓడిపోవడం దారుణం. 1996 తర్వాత తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. చెన్నై కొళత్తూర్‌ నియోజకవర్గంలో ఆయనకు అనూహ్యంగా పరాజం పాలయ్యారు. తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో స్టాలిన్ ఓడిపోయారు. ఎన్నికల్లో బాబుకు 88,180 ఓట్లు రాగా.. స్టాలిన్‌కు 72,988 ఓట్లు వచ్చాయి. చెన్నై ప్రాంతం సంప్రదాయంగా డీఎంకే బలమైన కంచుకోటగా భావిస్తారు. అయితే, ఈసారి అక్కడే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ఓటమి పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. స్టాలిన్ గతంలో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలుపొందారు. 2011లో కొళత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన.. తన పట్టును నిలుపుకున్నారు. 2021లో 1,05,522 ఓట్లు సాధించి 61.4 శాతం ఓట్లతో ఘన విజయం సాధించిన స్టాలిన్.. ఈసారి మాత్రం వెనుకబడ్డారు. 2016లో కూడా 51.4 శాతం ఓట్లతో సులభంగా గెలిచిన ఆయనకు.. తాజా ఫలితాల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఇదిలా ఉండగా.. స్టాలిన్‌ను ఓడించిన వీఎస్ బాబు రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరమే.

గతంలో డీఎంకేలో ఉన్న ఆయన.. 2006–2011 మధ్య పురసవాక్కం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. అనంతరం అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ పార్టీని వీడి టీవీకేలో చేరారు. అయితే, స్టాలిన్‌తో పోలిస్తే పెద్దగా ప్రభావం చూపడని భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వీఎస్‌ బాబు సంచలన విజయం సాధించారు. తమిళనాడులో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఓటమి చవిచూసిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 1952లో కాంగ్రెస్ నేత పీఎస్ కుమారస్వామి రాజా ఓడిపోగా.. 1967లో భక్తవత్సలం కూడా పరాజయం పాలయ్యారు. 1996లో జయలలితకు సైతం ఓటమి తప్పలేదు. తాజా ఫలితంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. చెన్నైలో డీఎంకే ఆధిపత్యానికి ఇది పెద్ద సవాల్‌గా మారింది.

Advertisement
Advertisement