త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kailash Mansarovar yatra | కలల యాత్ర.. కైలాస మానస స‌రోవర్!

Kailash Mansarovar yatra | హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన తీర్థ‌యాత్ర‌ల్లో ఒక‌టి కైలాస్ మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌. జీవితంలో ఒక‌సారైనా ఈ యాత్ర చేయాల‌ని చాలామంది కోరిక‌. హిందువుల‌కే కాకుండా బౌద్ధులు, జైనుల‌కు ప‌విత్ర‌మైన స్థ‌లం. కైలాస ప‌ర్వ‌తం శివుడి నివాస‌మ‌ని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ దేవ‌దేవుడు ఇప్ప‌టికే ఈ ప‌ర్వ‌తంపైనే ధాన్యంలో ఉంటాడ‌ని భావిస్తున్నారు. బృహ్మ సృష్టించిన మానస సరోవరంలో ఒక్క‌సారి స్నానం చేస్తే పాపాల‌న్నీ తొల‌గిపోతాయ‌ని భ‌క్తుల విశ్వాసం.

P

National | Published On May 1, 2026, 7.56 pm IST

Kailash Mansarovar yatra | కలల యాత్ర.. కైలాస మానస స‌రోవర్!
Advertisement
  • యాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కేంద్రం
  • జూన్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య యాత్ర‌
  • 2వేల మందికి అవ‌కాశం
  • మే 19 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు
  • 20 బృందాలుగా త‌ర‌లింపు

Kailash Mansarovar yatra | హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన తీర్థ‌యాత్ర‌ల్లో ఒక‌టి కైలాస్ మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌. జీవితంలో ఒక‌సారైనా ఈ యాత్ర చేయాల‌ని చాలామంది కోరిక‌. హిందువుల‌కే కాకుండా బౌద్ధులు, జైనుల‌కు ప‌విత్ర‌మైన స్థ‌లం. కైలాస ప‌ర్వ‌తం శివుడి నివాస‌మ‌ని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ దేవ‌దేవుడు ఇప్ప‌టికే ఈ ప‌ర్వ‌తంపైనే ధాన్యంలో ఉంటాడ‌ని భావిస్తున్నారు. బృహ్మ సృష్టించిన మానస సరోవరంలో ఒక్క‌సారి స్నానం చేస్తే పాపాల‌న్నీ తొల‌గిపోతాయ‌ని భ‌క్తుల విశ్వాసం. ఇక్క‌డ దేవ‌తులు సైతం స్నానం చేస్తుంటార‌ని న‌మ్ముతారు. టిబెట్‌లో ఉన్న ఈ కైలాస ప‌ర్వ‌తం, మాన‌స స‌రోవ‌ర యాత్రం ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. అయినా, ఏటా వేలాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. భారత్-చైనా సమన్వయంతో నిర్వహించే ఈ యాత్ర జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ ఏడాది కొన‌సాగ‌నుంది. ఆధ్యాత్మికత, భక్తి, ప్రకృతి సౌందర్యం కలిసిన ఈ యాత్రపై దేశవ్యాప్తంగా భక్తుల్లో విశేష ఆసక్తి నెలకొంది. ఈ యాత్ర కోసం హైద‌రాబాద్ నుంచి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం..!

జూన్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య యాత్ర‌

కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర‌కు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ‌శాఖ కీల‌క వివ‌రాలు వెల్ల‌డించింది. ఈ ఏడాది యాత్ర జూన్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. యాత్రను ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం, సిక్కింలోని నాథులా పాస్ మార్గాల ద్వారా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. యాత్రలో పాల్గొనాల‌నుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ ఏడాది మొత్తం 20 బృందాలుగా 2వేల మందిని యాత్ర‌కు తీసుకువెళ్ల‌నున్న‌ట్లు పేర్కొంది. ప్రతి బృందంలో 50 మంది యాత్రికులు ఉంటారు. వీరిలో 10 బృందాలు లిపులేఖ్ పాస్ మార్గంలో, మరో 10 బృందాలు నాథులా పాస్ మార్గంలో యాత్ర‌కు బ‌య‌లుదేరుతారు.

ద‌ర‌ఖాస్తు విధానం ఇలా..

యాత్రలో పాల్గొనాల‌ని ఆస‌క్తి ఉన్న వారు మొద‌ట అధికారిక వెబ్‌సైట్ kmy.gov.in లాగిన్ అవ్వాలి. ఆ త‌ర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి డిజిటల్ రూపంలో సమర్పించాలి. మ‌ళ్లీ ఫిజిక‌ల్ ప‌త్రాలను, ఫ్యాక్స్‌, మెయిల్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని విదేశీ మంత్రిత్వ‌శాఖ స్ప‌ష్టం చేసింది. ద‌ర‌ఖాస్తుదారులు లిపులేఖ్ లేదంటే నాథులా మార్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే రెండు మార్గాలకూ దరఖాస్తు చేసుకోవ‌చ్చు. ప్రాధాన్య‌త క్ర‌మం బ‌ట్టి అవ‌కాశం క‌ల్పిస్తారు. దరఖాస్తుల నుంచి యాత్రికుల ఎంపిక వరకు మొత్తం ప్రక్రియ పూర్తిగా కంప్యూటరైజ్డ్ విధానంలో జరుగుతుందని స్ప‌ష్టం చేసింది. దరఖాస్తుదారులు తమ సందేహాలు, అభిప్రాయాలను కూడా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పంప‌వ‌చ్చ‌ని తెలిపింది.

మే 19 చివరి తేదీ

కైలాస్ మానస స‌రోవ‌ర యాత్రలో పాల్గొనేందుకు ఆస‌క్తి ఉన్న వారు మే 19 ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. చైనా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఎంఈఏ పేర్కొంది. ప్ర‌స్తుతం రెండుదేశాల స‌రిహ‌ద్దుల్లో సైన్యాన్ని వెన‌క్కి తీసుకున్న నేప‌థ్యంలో సంబంధాలు మెరుగ‌య్యాయి. దాంతో వ‌రుస‌గా రెండో ఏడాది ప్ర‌భుత్వం యాత్ర‌ను నిర్వ‌హిస్తోంది. ఈ ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లిపులేఖ్ పాస్ మార్గం ద్వారా 10 బృందాలు, సిక్కింలోని నాథులా పాస్ మార్గం ద్వారా మరో 10 బృందాలు యాత్ర‌కు తీసుకెళ్తారు. ప్రతి బృందంలో 50 మంది యాత్రికులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

యాత్ర‌కు ఎంతో ప్రాధాన్యం..

కైలాస్ మానస స‌రోవర్ యాత్రకు విశేషమైన ఆధ్యాత్మిక, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందువులు, బౌద్ధులు, జైనులు ఈ యాత్రను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఆసియాలోనే అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో ఒక‌టిగా గుర్తింపు పొందింది. టిబెట్‌లోని చైనా భూభాగంలో ఉన్న 6,638 మీటర్ల ఎత్తైన కైలాస్ పర్వతం, మానస స‌రోవర సరస్సు కలిసి ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచాయి. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ యాత్ర కొనసాగుతుంది. సుమారు 4,590 మీటర్లకు పైబడిన ఎత్త‌యిన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాత్ర శారీరకంగా స‌వాల్‌గా నిలుస్తుంది. అదే సమయంలో భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించే యాత్రగా మ‌న‌సులో నిలిచిపోతుంది.

యాత్ర‌కు ఖ‌ర్చు ఎంత అంటే..?

యాత్ర‌లో పాల్గొనేందుకు ఖ‌ర్చులు భారీగానే ఉంటాయి. అయితే, యాత్ర ఖర్చు ప‌ర్యాట‌కులు ఎంచుకునే మార్గం, ప్రయాణ సౌకర్యాలు, వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి మారుతుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన మార్గాల్లో అయితే, సుమారుగా రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఖ‌ర్చు అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప‌లు ట్రావెల్ కంపెనీలు అంచ‌నా వేస్తున్నాయి. లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్) మార్గంలో వెళ్తే సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, నాథులా పాస్ (సిక్కిం) రూట్‌లో వెళితే సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఖ‌ర్చు అవుతుంది. అలాగే, నేపాల్ ద్వారా ప్రైవేటు, హెలికాప్ట‌ర్ సేవ‌లు సైతం అందుబాటులో ఉన్నాయి. దీనికి రూ.3ల‌క్ష‌ల నుంచి రూ.4ల‌క్ష‌కుపైగానే ఖ‌ర్చు అవుతుంది. ఇందులో సాధారణంగా రవాణా, వసతి, భోజనం, టిబెట్ అనుమతులు, చైనా గ్రూప్ వీసా, మెడిక‌ల్ టెస్టులు, గైడ్ ఖర్చులు ఉంటాయి. అయితే, వ్యక్తిగత ఖర్చులు, పోనీ, యాక్ ఛార్జీలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, అత్యవసర వైద్య ఖర్చులు మాత్రం అద‌నంగా భ‌రించాల్సి ఉంటుంది.

హైద‌రాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?

కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర‌కు హైదరాబాద్ నుంచి వెళ్లాల‌నుకునే వారు మొద‌ట ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ వ‌ర‌కు రైలు, విమానంలో వెళ్లొచ్చు. బ‌డ్జెట్‌ను బ‌ట్టి రైలు, విమానంలో వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవ‌చ్చు. అయితే, ఢిల్లీకి చేరాక విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వైద్య ప‌రీక్ష‌లు చేస్తారు. ప‌త్రాల‌ను ప‌రిశీలించి, యాత్ర‌కు అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తారు. అనంతరం యాత్రికులను బ్యాచ్‌ల వారీగా సంబంధిత మార్గాల‌కు త‌ర‌లిస్తారు. లిపులేఖ్ మీదుగా వెళ్లే వారిని ఢిల్లీ నుంచి ఉత్త‌రాఖండ్‌లోని ధార్చులా వ‌ర‌కు తీసుకువెళ్తారు. అక్క‌డి నుంచి రోడ్డుమార్గం, ట్రెక్కింగ్ ద్వారా లిపులేఖ్ పాస్ చేరుకొని టిబెట్‌లోకి ప్ర‌వేశిస్తారు. ఇక నాథులా మార్గంలో వెళ్లేవారు ఢిల్లీ నుంచి బాగ్‌డోగ్రా లేదంటే గ్యాంగ్‌ట‌క్ నుంచి నాథులా పాస్ ద్వారా టిబెట్‌లోకి ప్ర‌వేశం ఉంటుంది. నాథులా మార్గంలో టెక్కింగ్ త‌క్కువ‌గా ఉంటుంది. వృద్ధులు, శారీర‌కంగా కొంత ఇబ్బంది త‌ప్పుతుంది. కానీ, ఖ‌ర్చు మాత్రం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది.

ఏయే సౌక‌ర్యాలు క‌ల్పిస్తారంటే..?

విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత-టిబెట్ సరిహద్దు పోలీస్ (ITBP), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యాత్రికులకు పలు సౌకర్యాలు కల్పిస్తాయి. మొద‌ట ఢిల్లీలో ప‌ర్యాట‌కుల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేస్తారు. యాత్రకు ముందు ఫిట్‌నెస్ పరీక్షలు త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయి. అలాగే, వసతి, భోజన ఏర్పాట్లు, గ్రూప్ ట్రాన్స్‌పోర్ట్, టిబెట్ అనుమతులు, వీసా ప్రక్రియ, వైద్య బృందాలు, అత్యవసర సేవలు, లైజన్ అధికారులు, గైడ్ సేవ‌లు, ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్, ప్రాథమిక వైద్య సహాయంతో పాటు భద్రతా ఏర్పాట్లు క‌ల్పిస్తారు. యాత్రలో భాగంగా సుమారు 4,500 మీటర్లకు పైబడిన ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో ఫిట్‌గా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. స‌ముద్ర‌మ‌ట్టానికి భారీ ఎత్తులోకి వెళ్తుండ‌డంతో శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు, అల‌స‌ట త‌దిత‌ర ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement