త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM-CM Removal Bill | మళ్లీ తెరపైకి పీఎం-సీఎం తొలగింపు బిల్లు..?

PM-CM Removal Bill | ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సహా కీలక రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో ప్రధాని, సీఎం అరెస్టై వరుసగా వరుసగా 30 రోజులకుపైగా జైలులో ఉంటే ఆటోమేటిక్‌గా పదవి రద్దయ్యేలా బిల్లును తీసుకురాబోతున్నది.

P

National | Published On Jul 2, 2026, 9.30 am IST

PM-CM Removal Bill | మళ్లీ తెరపైకి పీఎం-సీఎం తొలగింపు బిల్లు..?
Advertisement
  • ఈ నెల 17న నివేదికను ఆమోదించనున్న జేసీపీ
  • ఈ నెల 20 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ఛాన్స్‌
  • ఈ సమావేశాల్లోనూ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం
  • నెల రోజుల జైలులో ఉంటే పదవి రద్దు
  • రాజకీయాల ప్రక్షాళన కోసమేనంటున్న కేంద్రం
  • రాజ్యాంగ వ్యతిరేకమంటున్న ప్రతిపక్షాలు

PM-CM Removal Bill | ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సహా కీలక రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో ప్రధాని, సీఎం అరెస్టై వరుసగా వరుసగా 30 రోజులకుపైగా జైలులో ఉంటే ఆటోమేటిక్‌గా పదవి రద్దయ్యేలా బిల్లును తీసుకురాబోతున్నది. గతేడాది నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల అభ్యంతరాలతో పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అప్పగించిన విషయం తెలిసిందే. బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ జూలై 17న తన నివేదికను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో నివేదికను లోక్‌సభకు సమర్పించనున్నారు. జులై 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. బిల్లు సభ ముందుకు వస్తే మరోసారి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర లభించే ఛాన్స్‌ ఉంది. దీంతో ఈ ప్రతిపాదనలు త్వరలోనే చట్టరూపం దాల్చే అవకాశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇంతకు బిల్లలు ఏముంది?

ప్రస్తుత చట్టాల ప్రకారం.. ప్రజాప్రతినిధి దోషిగా తేలి శిక్ష ఖరారైన తర్వాతే అనర్హతకు సంబంధించిన నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే, కొత్త బిల్లులు ఈ విధానంలో కీలక మార్పులను ప్రతిపాదించారు. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు అరెస్టై వరుసగా 30 రోజులపాటు కస్టడీలో కొనసాగితే తప్పనిసరిగా పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అరెస్టైన 31వ రోజునుంచే వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దయినట్లుగా పరిగణించే నిబంధనలను బిల్లులో చేర్చారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగకుండా కస్టడీనే పదవి కోల్పోయేందుకు ప్రాతిపదికగా తీసుకోనున్నారు.

రాజకీయల్లో నేర చరిత్రకు చెక్‌ పడుతుందా?

ఈ బిల్లులను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి అధ్యక్షత వహిస్తున్నారు. నివేదిక తయారీకి ముందు కమిటీ పలువురు మాజీ న్యాయమూర్తులు, రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు నిర్వహించింది. రాజకీయ వ్యవస్థలో నేరచరిత్ర కలిగిన వ్యక్తుల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరంపై కమిటీ సభ్యులందరిలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని అపరాజిత సారంగి గతంలో పేర్కొన్నారు. రాజకీయాల ప్రక్షాళనకు ఈ బిల్లులు ఉపయోగపడతాయని అధికార పక్షం వాదిస్తోంది. అయితే, ఈ బిల్లులను కాంగ్రెస్, ఏఐఎంఐఎం, ఆర్‌ఎస్‌పీ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. న్యాయస్థానం దోషిగా నిర్ధారించే వరకు ప్రతి వ్యక్తి నిర్దోషేననే భారత న్యాయవ్యవస్థలోని మౌలిక సూత్రానికి ఇవి విరుద్ధమని పేర్కొంటున్నాయి. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ మార్పులు రాజ్యాంగ విరుద్ధమని, ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచే ఉద్దేశంతోనే తీసుకొస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ఈ నిబంధనలు రాజకీయ కక్షసాధింపునకు ఆయుధంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నేరం నిరూపితం కాకముందే ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించడం రాజ్యాంగ హక్కులను దెబ్బతీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ కూడా బిల్లులను ఇంత త్వరగా ముందుకు తీసుకురావడంపై ప్రశ్నలు లేవనెత్తారు. సమగ్ర చర్చ లేకుండానే కీలక మార్పులు చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

జమ్మూకశ్మీర్‌, కేంద్ర పాలిత ప్రాంతాలకు

ఈ బిల్లులతో పాటు జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల (సవరణ) బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు అరెస్టైన సందర్భంలో వారిని పదవి నుంచి తొలగించే విషయంలో స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు లేవు. ఈ లోటును భర్తీ చేసేందుకు 1963 చట్టంలోని సెక్షన్-45లో సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇదిలా ఉండగా.. 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీలో బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ప్రతిపక్షం తరఫున సుప్రియా సూలే, అసదుద్దీన్ ఒవైసీ, ఎస్‌ నిరంజన్ రెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. అనంతరం వాటిని జేపీసీ పరిశీలనకు పంపించారు. జేపీసీ నివేదిక వెలువడిన తర్వాత ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు రాజకీయాల్లో నేరచరిత్రను తగ్గించే సంస్కరణగా బిల్లును అధికార పక్షం చెబుతుండగా.. మరోవైపు ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ హక్కులకు విఘాతం కలిగించేలా బిల్లు ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో ఈ బిల్లులపై పార్లమెంట్‌లో వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement
Advertisement