త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India New Zealand Trade Pact | అక్టోబర్ 19 నుంచి భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం షురూ

భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 19 నుంచి అమల్లోకి రానుంది. భారత ఎగుమతులకు 100% పన్ను మినహాయింపుతో పాటు భారీ పెట్టుబడులు రానున్నాయి.

J

National | Published On Sep 15, 2026, 2.49 pm IST

India New Zealand Trade Pact | అక్టోబర్ 19 నుంచి భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం షురూ

సంక్షిప్త సారాంశం

భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అక్టోబర్ 19 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్‌కు వెళ్లే భారతీయ ఎగుమతులన్నింటికీ (100 శాతం) పూర్తి స్థాయి సుంకాల రహిత (Duty-free) ప్రవేశం లభించనుంది. ప్రస్తుతం భారతీయ వస్తువులైన ఆటోమొబైల్స్, సెరామిక్స్, కార్పెట్లపై న్యూజిలాండ్ విధిస్తున్న గరిష్టంగా 10% పన్నులు పూర్తిగా రద్దు కానున్నాయి. భారత్‌లో రాబోయే 15 ఏళ్ల వ్యవధిలో 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.65 లక్షల కోట్లకు పైగా) భారీ పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ ముందుకొచ్చింది.

Advertisement
  • భారత ఎగుమతులకు పన్ను రహిత దారులు

India New Zealand Trade Pact | త్రినేత్ర.న్యూస్ : భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన ప్రతిష్ఠాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA) త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఈ ఒప్పందం రాబోయే అక్టోబర్ 19 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చే అవకాశముందని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య వస్తువులు, సేవల ఎగుమతులు-దిగుమతులను పరుగులు పెట్టించడంతో పాటు ద్వైపాక్షిక పెట్టుబడులను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 27న ఈ  ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం భారత్‌కు అంతర్జాతీయ వాణిజ్యపరంగా భారీ ప్రయోజనాన్ని చేకూర్చనుంది. ముఖ్యంగా భారతదేశం నుంచి న్యూజిలాండ్‌కు ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు (100 శాతం ప్రొడక్ట్స్‌కు) పూర్తిస్థాయిలో డ్యూటీ-ఫ్రీ (సుంకాల రహిత) యాక్సెస్ లభించడం అతిపెద్ద మైలురాయిగా నిలవనుంది.

భారీగా రద్దు కానున్న సుంకాలు

ప్రస్తుతం భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే కీలక ఉత్పత్తులపై న్యూజిలాండ్ దాదాపు 10 శాతం వరకు గరిష్ట దిగుమతి సుంకాలను (టారిఫ్‌లను) వసూలు చేస్తోంది. ముఖ్యంగా సెరామిక్ ఉత్పత్తులు, కార్పెట్లు, ఆటోమొబైల్ వాహనాలు, ఆటో కాంపోనెంట్లపై ఈ పన్నుల భారం ఉండేది. తాజా ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన వెంటనే ఈ సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈ (MSME) రంగాలకు చెందిన తయారీదారులకు న్యూజిలాండ్ మార్కెట్లో తిరుగులేని అవకాశాలు లభించనున్నాయి.

భారత్‌కు రూ.1.65 లక్షల కోట్ల పెట్టుబడులు

ఈ ట్రేడ్ డీల్‌లో భాగంగా న్యూజిలాండ్ కేవలం ఎగుమతులకు వెసులుబాటు కల్పించడమే కాకుండా, భారత మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాబోయే 15 ఏళ్ల వ్యవధిలో భారత్‌లో దాదాపు 20 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.1.65 లక్షల కోట్లకు పైగా) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సులభతరం చేసేందుకు న్యూజిలాండ్ అధికారికంగా అంగీకరించింది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే దేశీయంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడటమే కాకుండా రెండు దేశాల ఆర్థిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement