త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IMD | మీ ఇంటి వ‌ద్ద వ‌ర్షం ఎంత ప‌డుతుందో చెప్పేస్తుంది..! కొత్త టూల్‌ని ప‌రిచ‌యం చేసిన ఐఎండీ..!

IMD | వాతావ‌ర‌ణ అంచ‌నాల విష‌యంలో మ‌రో కీల‌క ముంద‌డుగు ప‌డింది. ఇక‌పై ప్ర‌తి కిలోమీట‌ర్‌కు అంచ‌నాల‌ను తెలుసుకునే సౌల‌భ్యం క‌లిగింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రతి ఒక్క కిలోమీటర్ పరిధిలోనూ వాతావరణ అంచనాలు అందించే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

P

National | Published On May 13, 2026, 7.43 pm IST

IMD | మీ ఇంటి వ‌ద్ద వ‌ర్షం ఎంత ప‌డుతుందో చెప్పేస్తుంది..! కొత్త టూల్‌ని ప‌రిచ‌యం చేసిన ఐఎండీ..!
Advertisement

IMD | వాతావ‌ర‌ణ అంచ‌నాల విష‌యంలో మ‌రో కీల‌క ముంద‌డుగు ప‌డింది. ఇక‌పై ప్ర‌తి కిలోమీట‌ర్‌కు అంచ‌నాల‌ను తెలుసుకునే సౌల‌భ్యం క‌లిగింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రతి ఒక్క కిలోమీటర్ పరిధిలోనూ వాతావరణ అంచనాలు అందించే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ కొత్త వ్యవస్థను ఆవిష్కరించింది. దీని స‌హాయంతో వచ్చే ప‌ది రోజుల్లో హైపర్ లోకల్ స్థాయిలో వర్షపాతం అంచనాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

హై స్పెషల్ రెసల్యూషన్ రైన్‌ఫాల్ ఫోర్‌కాస్ట్ ఫర్ ఉత్తరప్రదేశ్’ పేరుతో రూపొందించిన ఈ వ్యవస్థను భారత వాతావరణ శాఖ (IMD), పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ (IITM), అలాగే నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ (NCMRWF) కలిసి అభివృద్ధి చేశాయి. ఈ సాంకేతికతలో ముందుగా 12.5 కిలోమీటర్ల లెవ‌ల్ వ‌ర‌కు వాతావరణ డేటాను సేకరిస్తారు. అనంతరం 4 కిలోమీటర్ల స్థాయికి కుదించి, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డౌన్‌స్కేలింగ్ ద్వారా కిలోమీట‌ర్ రిజల్యూషన్ స్థాయికి తీసుకువస్తారు. ఈ విధంగా అత్యంత సూక్ష్మ స్థాయిలో వర్ష సూచనలు రికార్డు చేస్తారు.

ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, రాడార్లు, ఉపగ్రహ డేటా వంటి వనరుల సమాచారాన్ని సమగ్రంగా కలిపి ఈ అంచనాలు రూపొందిస్తున్నారు. దీంతో ఒకే నగరంలోనూ వేర్వేరు ప్రాంతాలకు భిన్నమైన వాతావరణ సమాచారం అందే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక నగరంలో ప్రతి కాలనీకి వేర్వేరు వర్ష సూచనలు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర భూమి శాస్త్రశాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో బలమైన వాతావరణ పరిశీలనా నెట్‌వర్క్ ఉండడం వల్లే కిలో కిలోమీటర్ స్థాయిలో ఖచ్చితమైన సూచనలు ఇవ్వడం సాధ్యమైందని తెలిపారు.

ఈ హైపర్ లోకల్ డేటా రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. విత్తనాల సాగు సమయం, నీటిపారుదల ప్రణాళికలు, పురుగుమందుల వినియోగం వంటి నిర్ణయాల్లో ఇది కీలక పాత్ర పోషించనుంది. అదే విధంగా పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణ, నీటి వనరుల నిర్వహణతో పాటు పునరుత్పాదక ఇంధన రంగానికి కూడా ఈ సమాచారం ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ మోడల్‌ను రియ‌ల్ టైమ్ డేటాతో మ‌రింత పెరుగుప‌రిచి.. దేశ‌వ్యాప్తంగా ఇత‌ర రాష్ట్రాల‌కు విస్త‌రించే ప్ర‌ణాళిక ఉంద‌ని అధికారులు తెలిపారు. ఈ వెద‌ర్ అప్‌డేట్స్ ఐఎండీ, ఎన్‌సీఎంఆర్‌డ‌బ్ల్యూఎఫ్ వెబ్‌సైట్ల‌తో పాటు మొబైల్ అప్లికేష‌న్ల ద్వారా అంద‌రికీ అందుబాటులో ఉంటాయ‌ని అధికారులు వివ‌రించారు.

Advertisement
Advertisement