త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran Conflict | ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: భారత్ ముంగిట ఉన్న అతిపెద్ద సవాళ్లు.. మార్కెట్ల పరిస్థితి ఏంటి?

పశ్చిమాసియాలో భగ్గుమన్న యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం సోమవారం భారత స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపనుంది.

J

National | Published On Feb 28, 2026, 8.24 pm IST

US-Israel-Iran Conflict | ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: భారత్ ముంగిట ఉన్న అతిపెద్ద సవాళ్లు.. మార్కెట్ల పరిస్థితి ఏంటి?
Advertisement

US-Israel-Iran Conflict | ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడం.. దానికి ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించడంతో పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లతో పాటు భారతదేశ చమురు భద్రత, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ చోక్‌పాయింట్ అయిన 'హార్ముజ్ జలసంధి' చుట్టూ ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీనివల్ల భారతదేశ ప్రయోజనాలకు ఎలా విఘాతం కలగనుంది?

హార్ముజ్ జలసంధి - భారత్‌కు ఇంధన జీవనాడి

ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు ఐదో వంతు హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. Kpler డేటా ప్రకారం, 2026 జనవరి-ఫిబ్రవరిలో భారతదేశ నెలవారీ చమురు దిగుమతుల్లో దాదాపు 50 శాతం ఈ జలసంధి గుండానే వచ్చాయి. ఇరాన్, ఒమన్, యూఏఈల మధ్య ఉన్న ఈ సన్నని మార్గం గుండా భారత్ ప్రతిరోజూ సుమారు 2.6 మిలియన్ బ్యారెళ్ల చమురును (ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి) దిగుమతి చేసుకుంటోంది. ఈ మార్గంలో ఏ చిన్నపాటి అంతరాయం ఏర్పడినా, అది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తక్షణ ప్రభావాన్ని చూపుతుంది.

ముడి చమురు ధరల మంట

యుద్ధం కారణంగా భౌతికపరంగా సరఫరాకు అంతరాయం కలగకపోయినా, మార్కెట్లు భయంతో రియాక్ట్ అవుతాయి. అమెరికా తన సైనిక బలగాలను మోహరించినప్పటి నుండే క్రూడాయిల్ ధరలు దాదాపు 10 శాతం పెరిగాయి. ఈక్విరస్ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఇరాన్ చమురు ఉత్పత్తికి ఆటంకం కలిగితే ధరలు 9-15 శాతం పెరిగి, బ్యారెల్ 70 డాలర్ల నుంచి 76-81 డాలర్లకి చేరుకోవచ్చు. ఒకవేళ హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే, అది 95-110 డాలర్ల వరకు కూడా వెళ్లే తీవ్ర ప్రమాదం ఉంది.

భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రధాన ప్రభావాలు

భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. కాబట్టి ధరలు పెరిగితే ఈ కింది పరిణామాలు తలెత్తుతాయి. దిగుమతుల బిల్లు పెరిగిపోయి కరెంట్ అకౌంట్ లోటు విపరీతంగా పెరుగుతుంది. చమురు కొనడానికి డాలర్ల డిమాండ్ పెరిగి, రూపాయి విలువ క్షీణిస్తుంది. ఇంధన ఖర్చులు పెరగడం వల్ల రవాణా, లాజిస్టిక్స్ భారం పెరిగి అంతిమంగా ఆహార, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రజలపై భారం తగ్గించడానికి ప్రభుత్వం ఇంధన పన్నులను తగ్గించాల్సి రావడం లేదా సబ్సిడీలు ఇవ్వాల్సి రావడంతో ఖజానాపై ఒత్తిడి పెరుగుతుంది.

సోమవారం భారత స్టాక్ మార్కెట్లు ఎలా రియాక్ట్ కాబోతున్నాయి?

అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు నెగిటివ్ సెంటిమెంట్‌తో, నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్రూడాయిల్ బ్యారెల్ 80 డాలర్లు దాటితే భారత మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. విమానయానం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్, పెయింట్ సెక్టార్ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల మార్జిన్లు దెబ్బతింటాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. కాబట్టి ఎనర్జీ, డిఫెన్స్ స్టాక్స్‌తో పాటు బంగారం, యూఎస్ ట్రెజరీ బాండ్లకు డిమాండ్ పెరుగుతుంది.

భారత్ వేస్తున్న ప్రత్యామ్నాయ అడుగులు

ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు న్యూఢిల్లీ ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. గల్ఫ్ వెలుపల ఉన్న సరఫరాదారుల నుండి కొనుగోళ్లను వేగవంతం చేస్తోంది. అవసరమైతే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఉపయోగించుకోవడానికి సన్నద్ధమవుతోంది. గల్ఫ్ సరఫరా తగ్గితే, పశ్చిమ దేశాల ఆంక్షలను పక్కనపెట్టి మళ్లీ రష్యా ముడి చమురు కొనుగోళ్లను పెంచే అవకాశం ఉంది. మరోవైపు, ఏప్రిల్ 1 నుండి ఉత్పత్తిని పెంచుతామని పెట్రోలియం ఎగుమతి దేశాలు ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం.

Advertisement
Advertisement