త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hottest Cities | నిప్పుల కొలిమిలా భార‌త్‌.. టాప్‌-50 అత్యంత వేడి న‌గ‌రాలు దేశంలోనే..!

Hottest Cities | భార‌త్ నిప్పుల కొలిమిలా త‌యారైంది. దేశ‌వ్యాప్తంగా భానుడు విరుచుకుప‌డుతున్నాడు. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశాన్ని కమ్మేసిన తీవ్రమైన వడగాలుల ప్రభావంతో శుక్రవారం ఉదయం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 50 నగరాలన్నీ భారత్‌లోనే ఉండ‌డం ఆందోళన కలిగిస్తోంది.

P

National | Published On May 22, 2026, 1.26 pm IST

Hottest Cities | నిప్పుల కొలిమిలా భార‌త్‌.. టాప్‌-50 అత్యంత వేడి న‌గ‌రాలు దేశంలోనే..!
Advertisement
  • 45 డిగ్రీల‌తో ఒడిశా బాలంగీర్ టాప్‌
  • తెలంగాణ నుంచి నాలుగు న‌గ‌రాలు
  • జాబితాను ప్ర‌క‌టించిన ఏక్యూఐ సంస్థ‌

Hottest Cities | భార‌త్ నిప్పుల కొలిమిలా త‌యారైంది. దేశ‌వ్యాప్తంగా భానుడు విరుచుకుప‌డుతున్నాడు. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశాన్ని కమ్మేసిన తీవ్రమైన వడగాలుల ప్రభావంతో శుక్రవారం ఉదయం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 50 నగరాలన్నీ భారత్‌లోనే ఉండ‌డం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 10.50 గంటలకే పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. వాతావరణ, గాలి నాణ్యత పరిశీలన సంస్థ AQI.in విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బలాంగీర్ 45 డిగ్రీల సెల్సియస్‌తో ప్రపంచంలోనే అత్యంత వేడిగల నగరంగా నిలిచింది. మహారాష్ట్రలోని చంద్రపూర్, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మధ్యాహ్నానికి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోనే సగానికిపైగా నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. వారణాసి, బండా, బరేలీ, అయోధ్య వంటి నగరాల్లో మధ్యాహ్నానికి ముందే 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే ఉత్తర పశ్చిమ, మధ్య భారతదేశంలో తీవ్రమైన వడగాలులు కొనసాగనున్నాయని హెచ్చరించింది. పలుచోట్ల రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. పొడి గాలులు, వ‌ర్షాలు లేక‌పోవ‌డం కార‌ణంగా ఈ పరిస్థితి మరింత తీవ్రమైందని వాతావ‌ర‌ణ నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతంలోనూ ఎండల తీవ్రత పెరిగింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ అంచ‌నా వేసింది.

తెలంగాణ నుంచి నాలుగు న‌గ‌రాలు..

ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతల జాబితాలో తెలంగాణకు చెందిన నాలుగు నగరాల‌కు చోటు దక్కించుకున్నాయి. ఉదయం వేళలోనే 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడం రాష్ట్రంలో ఎండల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. జ‌గిత్యాల‌లో 43, ఆదిలాబాద్ 43, ఖమ్మం 42, వరంగల్ 42 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు రికార్డ‌యిన‌ట్లు ఏక్యూఐ పేర్కొంది. ఉదయం 10 గంటలకే రోడ్లు వేడెక్కిపోయాయి. పలుచోట్ల జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం సమయాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది.

హీట్ డోమ్ ప్ర‌భావం..

ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, మహారాష్ట్ర వరకు విస్తరించిన భారీ హీట్ డోమ్ ప్రభావం దేశాన్ని వేడెక్కిస్తోంది. విదర్భ ప్రాంతంలోని కొన్ని నగరాల్లో ఈ వారం ఇప్పటికే 46 డిగ్రీల మార్క్ దాటింది. ఇక ఆస్పత్రుల్లో డీహైడ్రేషన్, వడదెబ్బ, అలసట కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బహిరంగ పనులు చేసే కార్మికులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. అవ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయట తిర‌గొద్ద‌ని, పిల్లలు, వృద్ధులను ఎండకు దూరంగా ఉండేలా చూసుకోవాల‌న్నారు. తరచూ నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ తీసుకోవాల‌ని.. తలనొప్పి, అలసట, వాంతులు ఉంటే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించాల‌ని అధికారుల‌ను సూచించారు.

హీట్‌డోమ్ అంటే ఏమిటి?

దేశంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలకు ప్రధాన కారణంగా హీట్‌డోమ్ (Heat Dome) కార‌ణ‌మ‌ని వాతావ‌ర‌ణ నిపునులు పేర్కొంటున్నారు. అయితే, ఇది ఒకే ప్రాంతంపై అధిక పీడన గాలి వ్యవస్థ స్థిరంగా ఏర్పడి, వేడి గాలిని బయటకు వెళ్లనివ్వకుండా “మూత”లా బంధించే పరిస్థితి అని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో మేఘాలు ఏర్పడే అవకాశం తగ్గిపోవడం, వర్షాలు కుర‌వ‌డం ఆగిపోతుంది. ఆకాశం నిర్మ‌లంగా మారడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. ఒకసారి ఏర్పడిన ఈ అధిక పీడనం రోజుల తరబడి కదలకపోవడం వల్ల ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంపై ఇదే తరహా హీట్‌డోమ్ ప్రభావం కొనసాగుతోంది. దీంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతున్నాయి. ఇటీవ‌ల ఏపీలోని పిడుగురాళ్ల‌లో గ‌రిష్టంగా 48 డిగ్రీల‌కుపైగా ఉష్ణోగ‌త్ర‌లు న‌మోదైన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement