త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PMGSY | తెలంగాణ‌కు అద‌నంగా నిధులివ్వాలి : మంత్రి సీత‌క్క‌

PMGSY | తెలంగాణ‌లోని గ్రామీణ ర‌హ‌దారుల అభివృద్ధికి మ‌రిన్ని అనుమ‌తులు, నిధులు ఇవ్వాల‌ని మంత్రి సీత‌క్క కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పీఎంజీఎస్‌వై ప్రాంతీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో వివరించారు.

P

Telangana | Published On May 22, 2026, 2.49 pm IST

PMGSY | తెలంగాణ‌కు అద‌నంగా నిధులివ్వాలి : మంత్రి సీత‌క్క‌
Advertisement

PMGSY | తెలంగాణ‌లోని గ్రామీణ ర‌హ‌దారుల అభివృద్ధికి మ‌రిన్ని అనుమ‌తులు, నిధులు ఇవ్వాల‌ని మంత్రి సీత‌క్క కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పీఎంజీఎస్‌వై ప్రాంతీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో వివరించారు. సమావేశం తర్వాత కూడా అధికారులతో జరిగిన చర్చల్లో స్ప‌ష్ట‌మైన వాద‌న‌లు వినిపించారు. ప్ర‌ధానమంత్రి గ్రామీణ స‌డ‌క్ యోజ‌న కింద ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్లకు చేరుకునే మార్గాల్లో ఈ పథకం కీలక పాత్ర పోషించిందని ఆమె గుర్తుచేశారు. అయితే, మారుమూల గిరిజన గ్రామాలను పూర్తిగా అనుసంధానించాలంటే ఇంకా పెద్ద ఎత్తున పనులు మంజూరు చేయాల్సి ఉంటుంద‌న్నారు.

గతంలో ఈ పథకానికి వంద‌శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేదని, ప్రస్తుతం రాష్ట్రాలపై 40 శాతం భారం వేయడంతో ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని పునఃసమీక్షించి, పాత విధానాన్నే కొనసాగించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాలకు ప్రత్యేక సడలింపులు అవసరమని ఆమె పేర్కొన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ వంటి గిరిజన ప్రాంతాల్లో అటవీ, వన్యప్రాణి చట్టాల కారణంగా రోడ్డు పనులకు అనుమతులు ఆలస్యం అవుతున్నాయని మంత్రి సమావేశంలో వివరించారు. ఫలితంగా అభివృద్ధి పనులు వేగం కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ, వన్యప్రాణి చట్టాల్లో మార్పులు చేసి గిరిజన అభివృద్ధికి అడ్డంకులు తొలగించాలని ఆమె కేంద్రాన్ని కోరారు.

పాత రహదారులు, కల్వర్టుల పునర్నిర్మాణం, అప్‌గ్రేడేషన్ పనులకూ అనుమతులు ఆలస్యమవుతున్న విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. ఇప్పటికే దెబ్బతిన్న మౌలిక వసతులను పునరుద్ధరించడానికైనా సులభమైన అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఇటీవల జరిగిన చట్టసవరణలు కూడా కొన్ని సందర్భాల్లో ఆదివాసీ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొంటూ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా పనులు చేపడుతున్న విషయాన్ని సమావేశంలో వివరించారు.

స‌డ‌క్ యోజ‌న కింద మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలను వేగంగా అనుసంధానించేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సీతక్క కేంద్రానికి స్పష్టం చేశారు. పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లు వంటి మౌలిక కేంద్రాలకు ప్రజలు సులభంగా చేరుకునేలా నూతన పనులు చేపట్టాలని ఆమె కోరారు. మంత్రి విజ్ఞప్తులపై కేంద్ర ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సమావేశంలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అతిథి సింగ్ మాట్లాడుతూ రాష్ట్రం ప్రస్తావించిన అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు. అటవీ, వన్యప్రాణి చట్టాల కారణంగా ఎదురవుతున్న సమస్యలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement