త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ground Report | తారల పొలిటికల్‌ స్క్రిప్ట్‌.. లైట్స్‌, కెమెరా నుంచి బ్యాలెట్‌ బాక్స్‌ వరకు..!

Ground Report | సినిమారంగానికి, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎందరో రాజకీయాల్లో తమ సత్తా చాటారు. తెరపై అభిమానులను అలరించిన నటీనటులు ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజల ఆదరాభిమానాలు పొందారు.

P

National | Published On Apr 21, 2026, 7.00 pm IST

Ground Report | తారల పొలిటికల్‌ స్క్రిప్ట్‌.. లైట్స్‌, కెమెరా నుంచి బ్యాలెట్‌ బాక్స్‌ వరకు..!
Advertisement
  • తమిళనాట ఐదుగురు సీఎంలకు సినీరంగంతో అనుబంధం
  • తమిళ రాజకీయాల్లో మరో సినీ అధ్యాయం
  • విజయ్ ఎంట్రీతో మళ్లీ సినిమారంగానికి దగ్గరైన రాజకీయాలు
  • సరికొత్త క్లైమాక్స్‌ రాసేందుకు సిద్ధమైన దళపతి

Ground Report | సినిమారంగానికి, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎందరో రాజకీయాల్లో తమ సత్తా చాటారు. తెరపై అభిమానులను అలరించిన నటీనటులు ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ఇక తమిళనాట సినిమాలు, రాజకీయాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమిళనాడులో రాజకీయాలు అంటేనే లైట్స్‌, కెమెరా తర్వాత వచ్చే సన్నివేశంలా మారిపోయింది. ఇక్కడ సినిమా డైలాగ్‌లకు ఓట్లు రాలుతాయి. సినిమా సెట్స్‌ నుంచే రాజకీయాలు పుట్టుకొస్తాయి. బాక్సాఫీస్‌ బ్యాలెట్‌బాక్స్‌గా మారిపోతుంది.

ఐదుగురు ముఖ్యమంత్రులకు సినీరంగంతో అనుబంధం..

ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించిన ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తూ చర్చనీయాంశంగా మారారు. తమిళనాట సినీ తారలతో ముడిపడిన రాజకీయ కథలో కొత్త క్లైమాక్స్‌ రాయడానికి సిద్ధమయ్యారు. తమిళనాడు రాజకీయాలల్లో సినిమాల ప్రభావం కొత్తదేం కాదు. ఈ రాష్ట్రంలో పనిచేసిన ఐదుగురు ముఖ్యమంత్రులకు సినిమారంగంతో అనుబంధం ఉంది. అన్నాదురై సినిమా డైలాగ్‌లు రాశారు. కరుణానిధి స్క్రిప్ట్‌రైటర్‌గా పనిచేశారు. ఎంజీఆర్‌ నటుడిగా రాణించి.. ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన భార్య వీఎన్‌ జానకి రామచంద్రన్‌ కూడా నటి కాగా, కేవలం 23 రోజులపాటు రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయలలిత సైతం సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.

అన్నాదురై నుంచి జయలలిత వరకు..

1950 దశకంలోనే అన్నాదురై, కరుణానిధి తమ రాజకీయ ప్రభావాన్ని పెంచుకునేందుకు సినీ రంగాన్ని వినియోగించారు. ద్రావిడ రాజకీయాలు సినిమాల్లో భాగమయ్యాయి. ఎంజీఆర్‌ తెరపై పేదల రక్షకుడిగా గుర్తింపు పొందారు. అదే ఇమేజ్‌తో ఆయన 1977లో ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 130 సినిమాల్లో నటించిన ఆయన పాత్రల్లో అవినీతిపై పోరాటం ప్రధానాంశంగా ఉండేది. సినిమాల్లో చెప్పిన డైలాగ్‌లనే ఎన్నికల ప్రసంగాల్లో ఉపయోగించేవారు. ఆయన కోసం పోస్టర్లు అంటించిన యువకులు, రక్తదాన శిబిరాలు నిర్వహించిన వారు తర్వాత పార్టీ కార్యకర్తలయ్యారు. ఆయన అనారోగ్యానికి గురయ్యాక ఆలయాల్లో పూజలు జరిగాయి. మరణం అనంతరం కొందరు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు ఆహారం, నీళ్లు మానేసి వీధుల్లోకి వచ్చారు. జయలలిత ఆయన వారసత్వాన్ని స్వీకరించారు. సినిమాల్లో బలమైన మహిళ పాత్రలను పోషించిన ఆమె.. రాజకీయాల్లో ‘అమ్మ’ బ్రాండ్‌ని సృష్టించుకున్నారు. 1991, 2001, 2011, 2016లో ముఖ్యమంత్రిగా ఎన్నికై తన ప్రభావాన్ని చాటారు. 2016లో ఆమెకు 41 శాతం ఓట్లు రావడం విశేషం.

అందరికీ సక్సెస్‌ రాలేదు..

అయితే, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారందరూ విజయవంతం కాలేదు. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌ 1988లో పార్టీ స్థాపించినా సఫలం కాలేకపోయారు. విజయకాంత్‌ 2005లో డీఎండీకే పార్టీని ప్రారంభించి 2011లో ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు. కమల్‌ హాసన్‌ 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించినప్పటికీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. కేవలం 3.7 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటు శాతం 2.6కు పడిపోయింది. కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ టీ రామకృష్ణన్‌ అభిప్రాయం ప్రకారం.. కమల్‌ హాసన్‌ రాజకీయాల్లో ప్రభావవంతంగా నిలవలేకపోయారు. గొప్ప నటుడైనా రాజకీయ నాయకుడిగా ఎదగలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం స్టాలిన్‌తో కలిసిన విధానం ఆయన వ్యూహపరమైన లోపాలను బయటపెట్టిందన్నారు. ఇదే తరహా పరిస్థితి విజయ్‌ విషయంలోనూ తలెత్తవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరు ప్రతిష్టల కంటే రాజకీయ అనుభవమే ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. మద్రాస్‌ యూనివర్సిటీ రాజకీయ శాస్త్ర విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్‌ రాము మాట్లాడుతూ ఎంజీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆయనకు ముందుగానే విస్తృత అనుభవం ఉందని చెప్పారు. ఆయన కుటుంబానికి ద్రావిడ రాజకీయాలతో బలమైన అనుబంధం ఉందన్నారు. జయలలిత కూడా ఎన్నికల్లో పోటీకి ముందే పార్టీ లోపల పలు బాధ్యతలు నిర్వహించారని, ఎంజీఆర్‌ వారసురాలిగా ఎదిగారని వివరించారు. కానీ విజయ్‌కు అలాంటి అనుభవం లేదని, రెండేళ్ల క్రితమే పార్టీని స్థాపించి నేరుగా ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు.

పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తానని.. తలైవా యూటర్న్‌..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలో భారీగానే చర్చ జరిగిన విషయం తెలిసిందే. అభిమాన వర్గం, రాజకీయ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఒక దశలో గత కొద్ది సంవత్సరాల కిందట పార్టీని స్థాపించనున్నట్లు సంకేతాలు ఇచ్చిన తలైవా ఆ తర్వాత యూటర్న్‌ తీసుకున్నారు. ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లోకి రావడం సాధ్యం కాదని ప్రకటించారు. ముఖ్యంగా వైద్యుల సూచనలు, ఆరోగ్య పరిమితులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సమయంలో ఆయన స్పష్టం చేశారు. దాంతో తలైవా రాజకీయాల్లోకి వస్తారని ఆశించిన అభిమానులను నిరాశే ఎదురైంది. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూ.. సినిమాలతో ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు.

తలపతి విజయ్‌ గురించి..

జోసఫ్‌ విజయ్‌ చంద్రశేఖర్‌ 1974 జూన్‌ 22న చెన్నైలో జన్మించాడు. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌. సినీ నేపథ్యం ఉన్న ఇంట్లో పెరిగిన విజయ్‌ మొదట బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. 1992లో ‘నాళయ్య తీర్పు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభంలో కెరీర్‌ చప్పగా సాగింది. 1996లో వచ్చిన ‘పూవే ఉనక్కాగ’ మూవీ టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు. డ్యాన్స్‌, యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్స్‌తో కూడిన చిత్రాలతో భారీగా అభిమానుల్లో తళపతి విజయ్‌గా పేరు సంపాదించాడు. ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పేరుతో అభిమాన సంఘం ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సినీమాల విడుదల సమయంలో అభిమాన సంఘం చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే, సినీరంగం నుంచి వచ్చిన విజయ్‌కి ఉన్న ఫ్యాన్‌ బేస్‌తో రాజకీయాల్లో ఎంత వరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఉత్కంఠ భరితంగా పోటీ..

ప్రస్తుతం, తమిళనాడు రాజకీయాల్లో పోటీ ఉత్కంఠభరితంగా మారింది. అధికారానికి సంబంధించిన కథను ఈ నెల 23న ప్రజలు రాయబోతున్నారు. ఒకప్పుడు సినీ తారలను దేవుళ్లుగా భావించిన ప్రజలు.. ఇప్పుడు ‘మీరు మాకు ఏమిస్తారు? ఉద్యోగాలా, ఉచిత పథకాలా, లేక విద్య, ఆరోగ్య సదుపాయాలా?’ అని ప్రశ్నిస్తున్నారు. విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే.. తమిళనాడులో సినిమాలు రాజకీయాలకు ద్వారంలా ఉపయోగపడతాయి. కానీ, అధికారాన్ని దక్కించుకోవాలంటే బలమైన సంస్థాగత వ్యవస్థ తప్పనిసరి. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఐదో వంతు యువత ఉండటం ఈ ఎన్నికల్లో కీలక అంశంగా మారింది. ఈ సారి తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న విజయ్‌ అధికారాన్ని చేజిక్కించుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement