త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | ప్ర‌జ‌ల ఆదాయాన్ని ఇన్‌స్టాల్‌మెంట్ల వారీగా దోచుకుంటోంది.. కేంద్రంపై మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే విమ‌ర్శ‌లు..!

Mallikarjun Kharge | దేశంలో పెట్రోల్ ధ‌ర‌ల మోత మోగుతోంది. గ‌డిచిన ఎనిమిది రోజుల్లో చ‌మురు కంపెనీలు మూడుసార్లు ధ‌ర‌లు పెరిగాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

P

National | Published On May 23, 2026, 4.01 pm IST

Mallikarjun Kharge | ప్ర‌జ‌ల ఆదాయాన్ని ఇన్‌స్టాల్‌మెంట్ల వారీగా దోచుకుంటోంది.. కేంద్రంపై మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే విమ‌ర్శ‌లు..!
Advertisement

Mallikarjun Kharge | దేశంలో పెట్రోల్ ధ‌ర‌ల మోత మోగుతోంది. గ‌డిచిన ఎనిమిది రోజుల్లో చ‌మురు కంపెనీలు మూడుసార్లు ధ‌ర‌లు పెరిగాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ ప్రజలకు ఉపశమనం ఇవ్వకుండా కేంద్రం పన్నుల భారాన్ని పెంచుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టారు. దేశంలో నాయకత్వ సంక్షోభం నెలకొందని వ్యాఖ్యానించారు.

పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో అనేక దేశాలు ప్రజలకు ఇంధన ధరల బారి నుంచి ఉపశమనం కల్పిస్తుంటే.. భార‌త్‌లో మాత్రం బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుతూ సామాన్యుల జేబుపై భారం మోపుతోంద‌ని ఆరోపించారు. పెట్రోల్ ధరలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లీటర్‌కు రూ.100 దాటాయని ఆయన పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ఆదాయాన్ని ఇన్‌స్టామెంట్ల వారీగా దోచుకుంటోంద‌ని కేంద్రం తీరుపై ధ్వ‌జ‌మెత్తారు. రోజుకు సుమారు రూ.వెయ్యికోట్ల వ‌ర‌కు పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో వసూళ్లు జరుగుతున్నాయని ఖ‌ర్గే ఆరోపించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో ఆ ప్ర‌యోజ‌నాన్ని ప్ర‌జ‌ల‌కు అందించ‌లేద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ నేత‌లు బిజీగా ఉన్నార‌ని.. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ప్ర‌జ‌లు త్యాగం చేయాల‌నే మాట‌ల మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. కేవ‌లం ఎనిమిది రోజుల్లో మూడుసార్లు ధ‌ర‌లు పెంచాయ‌ని మండిప‌డ్డారు. ఇటలీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించిందని ఖర్గే తెలిపారు. ఆస్ట్రేలియాలో లీటర్‌కు సుమారు రూ.17 వరకు ధరలు తగ్గేలా పన్నులు తగ్గించారని, జర్మనీ కూడా పన్ను తగ్గింపుల రూ.17 నుంచి రూ.19 వరకు ధరలను తగ్గించిందని చెప్పారు. బ్రిటన్ ఇంధ‌నం, ప‌వ‌ర్‌పై ప‌న్నులు త‌గ్గించ‌డంతో పాటు వంద యూరోల వ‌ర‌కు ఆర్థిక సహాయం అందించిందని, ఐర్లాండ్ కూడా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందని వివ‌రించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన ఆయ‌న‌.. ఇన్‌స్టాల్‌మెంట్ లూటీలో భాగం ఎవ‌రు పొందుతున్నార‌ని ప్ర‌శ్నించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఇప్పటికే ప్రభుత్వ అసలు సమస్య నాయకత్వమేనని అర్థం చేసుకున్నారన్నారు. ఇదిలా ఉండ‌గా.. శనివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌పై లీటర్‌కు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచాయి. గత పది రోజుల్లో మొత్తంగా ఇంధన ధరలు సుమారు లీటర్‌కు రూ.5 వరకు పెరిగాయి. తొలిసారి మే 15న పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు రూ.3 వ‌ర‌కు పెరిగాయి. మే 19న మ‌రోసారి 90 పైస‌లు.. తాజాగా శ‌నివారం 80 పైస‌ల వ‌ర‌కు పైకి క‌దిలాయి. తాజాగా మూడోసారి ధ‌ర‌ల పెంపుతో సామాన్యులపై భారం ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement