త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delimitation | ‘బిల్లు’ పాసయ్యేనా? డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు

Delimitation | ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో సవరణలు ఆమోదం పొందేనా? ఈ బిల్లుతో పాటు ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు విపక్షాలు సమ్మతిస్తాయా?

S

National | Published On Apr 14, 2026, 6.00 pm IST

Delimitation | ‘బిల్లు’ పాసయ్యేనా? డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు
Advertisement

మహిళా బిల్లుకు మద్దతిచ్చినా..
డీలిమిటేషన్‌కు నో చెప్పనుందా
బీసీ కోటా అమలుకు డిమాండ్ చేసే చాన్స్
బిల్లు ఆమోదానికి 2/3 మెజారిటీ అవసరం
లోక్‌సభలో ఎన్డీఏ బలం 292
బిల్లుకు అవసరమైన బలం 362
రాజ్యసభలో కావాల్సింది 164
ఎల్లుండి ప్రారంభం కానున్న చర్చ
డీలిమిటేషన్‌కు ఒప్పుకోం
స్టాలిన్, మమతల ప్రకటన

Delimitation | త్రినేత్ర.న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో సవరణలు ఆమోదం పొందేనా? ఈ బిల్లుతో పాటు ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు విపక్షాలు సమ్మతిస్తాయా? ఒకవైపు తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతుండగానే .. కేంద్రం ఉద్దేశించిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగిపోయేనా? ఎన్డీఏ ప్రతిపాదనలకు యూపీఏ అంత సులువుగా ఒప్పుకుంటుందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చలివే.

2023 నాటి బిల్లులో సవరణలు

మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. 106వ రాజ్యాంగ సవరణగా లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని చట్టం నిర్దేశిస్తుంది. అయితే ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత జరిగే 2027 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా అమలు చేయాలని బిల్లు చెబుతుంది. అంటే వాస్తవానికి 2034లో ఈ బిల్లు అమలవుతుందన్నమాట. అయితే ప్రస్తుతం ఈ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని సవరణలు చేయనున్నది. 2011 జన గణాంకాల ప్రకారం డీలిమిటేషన్ చేసి దాని ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలన్నది బీజేపీ ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా తయారైన సవరణ చట్ట ముసాయిదాను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. దీన్ని పార్లమెంటులో ఆమోదింపజేసేందుకు ఏప్రిల్ 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

కావాల్సింది 362.. ఉన్నది 292

రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే.. లోక్‌స‌భ, రాజ్యసభల్లోనూ 2/3 (ప్రత్యేక మెజారిటీ ) మెజారిటీ అవసరం. ఓటింగ్ సమయంలో సగానికి కన్నా ఎక్కువ మంది సభ్యులు సభలో ఉండాలి. రెండు సభల్లోనూ.. సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు పలకాలి. లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందేందుకు ప్రస్తుతం 362 మంది సభ్యులు అవసరం. కానీ ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. యూపీఏకు 234 మంది సభ్యుల బలం ఉండగా ఏ పక్షానికి చెందని వారు 17 మంది సభ్యులు ఉన్నారు. అలాగే రాజ్యసభలో 245 స్థానాలకు గాను ఝార్ఖండ్ సీటు ఒకటి ఖాళీగా ఉంది. అది మినహా మిగిలిన 244 సభ్యులకు గాను దాదాపుగా ఈ బిల్లుకు 164 మంది మద్దతు పలకాల్సి ఉంటుంది. కానీ ఎన్డీఏ బలం 139 మాత్రమే. ఇంకా 25 మంది సభ్యుల బలం అవసరం. యూపీఏకు 75 మంది సభ్యుల బలం ఉండగా.. ఇతరులు 30 మంది ఉన్నారు

కాంగ్రెస్ మద్దతు పలికేనా?

ప్రత్యేక మెజారిటీతో మాత్రమే ఆమోదం పొందే ఈ బిల్లులకు లోక్ సభలో యూపీఏ పక్షాల నుంచి మద్దతు తప్పనిసరి. కానీ ఈ బిల్లుపై ప్రస్తుతం యూపీఏ పక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 2023లోనే ఆమోదం పొందిన బిల్లుకు మోదీ ప్రభుత్వం అత్యవసరంగా సవరణలు తీసుకురావాల్సిన అవసరమేమిటని ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 వ తేదీల్లో తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు జరుగుతుండగా ఏప్రిల్ 16నే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శలు చేస్తున్నాయి. అయితే.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని..కేవలం ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్సన్ సోనియాగాంధీ అభ్యంతరాలు లేవనెత్తారు.

మాకు విఘాతం కలిగితే ఊరుకోం : స్టాలిన్

తమిళనాడుకు తీవ్ర విఘాతం కలిగించే డీలిమిటేషన్‌ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని యూపీఏ సభ్యుడైన ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ చెప్పారు. కుటుంబ నియంత్ర‌ణ పాటించిన ద‌క్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా న‌ష్ట‌పోతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే భారీ ఎత్తున ఉద్య‌మం చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. "పార్లమెంటు ప్ర‌త్యేక‌ సమావేశాల్లో మా ఎంపీలు పాల్గొంటారు. ఈ స‌మావేశాల్లో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు న‌ష్టం క‌లిగించే నిర్ణ‌యాలు తీసుకుంటే మేము మౌనంగా ఉండం. త‌మిళ‌నాడు స్తంభించిపోతుంది. తమిళనాట ప్ర‌తి కుటుంబం వీధుల్లోకి వ‌స్తుంది. 1960 నాటి డీఏంకేను మళ్లీ పరిచయం చేస్తాం. కేంద్రానికి, ప్ర‌ధానికి ఇదే నా చివ‌రి హెచ్చ‌రిక" అని స్టాలిన్ తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించారు. లోక్ సభలో డీఎంకేకు 22 మంది సభ్యుల బలం ఉంది.

బెంగాల్‌ను ముక్కలు చేసేందుకే : మమతా బెనర్జీ

నియోజకవర్గాల పునర్విభజన ద్వారా బెంగాల్‌ను 3 ముక్కలు చేయాలని చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పునర్విభజన బిల్లుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేసింది. పశ్చిమబెంగాల్‌ను మూడుగా విభజించేందుకే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును బీజేపీ తెస్తోంది. ఒడిశా లేదా బిహార్‌లో ఆ భాగాలను కలిపేసి అక్కడి బెంగాలీలకు నరకం చూపించనుంది అని మోదీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్‌కు 28 మంది సభ్యుల బలం ఉంది.

డీలిమిటేషన్ పేరుతో కుట్రలు : సీఎం రేవంత్ రెడ్డి

నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 50 శాతం ప్రాతిపదికన పెంచుతామని దక్షిణాది రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. ఈ చిన్న లెక్క కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళకి తెలియడం లేదా? దక్షిణాది రాష్ట్రాల్లో ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించారు.

సవరణలతో.. కొత్త అడ్డంకులు

వాస్తవానికి 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లుకు కొత్త రాజ్యాంగ సవరణల పేరుతో బీజేపీ ప్రభుత్వం కొత్త తేనెతుట్టెను కదిపినట్టయ్యింది. 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేసి తద్వారా ఆ గణాంకాలతో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని చూడడం కొత్త చర్చకు దారి తీసింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందేమోనన్న చర్చ మొదలైంది. పైగా తమిళనాడు, బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతుండగానే ఆ రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఇంత హడావుడిగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారంటూ విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, యూపీఏ పక్షాలైన డీఎంకే, తృణమూల్, సమాజ్‌వాదీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఈ బిల్లులో అనేక లోపాలను ఎత్తి చూపుతున్నారు. దీంతో మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు అడ్డంకులు తప్పవని తెలుస్తున్నది.

లోక్ సభలో పార్టీల బలాలు

ఎన్డీఏ - 292
యూపీఏ - 234
ఇతరులు - 17
ప్రత్యేక మెజారిటీకి అవసరమైన బలం - 362
ఎన్డీఏకు ఇంకా అవసరమైన సభ్యులు - 70

రాజ్యసభలో బలాలు

ఎన్డీఏ - 139
యూపీఏ - 75
ఇతరులు - 30
ఖాళీ - 01
ఎన్డీఏకు ఇంకా అవసరమైన సభ్యులు - 25

Advertisement
Advertisement