త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Antibiotics | పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు..!

Antibiotics | నొప్పి, జ్వరం వచ్చిందంటే చాలామంది పెయిన్‌కిల్లర్లు.. చిన్న ఇన్ఫెక్షన్‌కే యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) కీల‌క సూచ‌న‌లు చేసింది. పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా వాడొద్దని సూచించింది.

P

National | Published On Sep 22, 2026, 7.44 pm IST

Antibiotics | పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు..!
Advertisement

Antibiotics | నొప్పి, జ్వరం వచ్చిందంటే చాలామంది పెయిన్‌కిల్లర్లు.. చిన్న ఇన్ఫెక్షన్‌కే యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) కీల‌క సూచ‌న‌లు చేసింది. పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా వాడొద్దని సూచించింది. మందుల విక్రయం, పంపిణీ విషయంలో డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ యాక్ట్‌–1940, డ్రగ్స్‌ రూల్స్‌–1945 నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. చాలా పెయిన్‌కిల్లర్లు షెడ్యూల్‌–హెచ్ పరిధిలో ఉంటాయని సీడీఎస్‌సీవో పేర్కొంది. వీటిని రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా రిటైల్‌గా విక్రయించకూడదు. ఇదే విధంగా పలు యాంటీబయాటిక్స్‌ షెడ్యూల్‌–హెచ్‌1 కింద ఉన్నాయి. వైద్యుల సలహా లేకుండా వాడితే ప్రమాదకరమనే హెచ్చరికను వాటి లేబుళ్లపై ఉంచాలి. ప్రిస్క్రిప్షన్‌ లేకుండా విక్ర‌యించ‌కూడ‌దు.

ప్రజలకు కేంద్రం సూచనలు

నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్‌ను తరచూ లేదా దీర్ఘకాలం సొంతంగా వాడ‌కూడ‌ద‌ని చెప్పింది. సాధారణ వైరల్‌ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ను సొంత వైద్యం వ‌ద్ద‌ని తెలిపింది. వైద్యుడు సూచించిన యాంటీబయాటిక్‌ను నిర్దేశించిన మోతాదు, వ్యవధిలోనే వాడాల‌ని, మిగిలిపోయిన యాంటీబయాటిక్స్‌ను మళ్లీ వాడకూడదు.. ఇతరులకు ఇవ్వ‌కూడ‌ద‌ని తెలిపింది. కిడ్నీ సమస్యలు, కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపే ఇతర రిస్క్‌ ఉన్నవారు పెయిన్‌కిల్లర్‌ తీసుకునే ముందు వైద్యుడికి వివరించాల‌ని తెలిపింది. నొప్పి, జ్వరం, ఇతర లక్షణాలు తగ్గకుండా పదేపదే వ‌స్తుంటే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించాల‌ని సూచించింది.

వైద్యులకు కూడా మార్గదర్శకాలు

పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌ను అవసరమైనప్పుడు మాత్రమే సూచించాలని సీడీఎస్‌సీవో తెలిపింది. రోగి వయసు, ఇతర అనారోగ్యాలు, వాడుతున్న మందులు, సంబంధిత రిస్క్‌లను పరిగణనలోకి తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నవారిలో పెయిన్‌కిల్లర్‌ తక్కువ ప్రభావవంతమైన మోతాదులో.. అవసరమైనంత తక్కువ కాలం ఇవ్వాలని సూచించింది. యాంటీబయాటిక్స్‌ విషయంలో ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే సూక్ష్మజీవి, ఇన్ఫెక్షన్‌ తీవ్రత, ప్రభావిత ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అవసరమైతే మైక్రోబయాలజీ పరీక్షలు, స్థానిక డ్రగ్‌ సెన్సిటివిటీ వివరాలను కూడా పరిశీలించాలని సూచించింది. అవసరం లేని మందుల కాంబినేషన్లు, తప్పు యాంటీబయాటిక్‌, తప్పు మోతాదు, అవసరానికి మించిన కాలం వాడటాన్ని నివారించాలని స్పష్టం చేసింది.

మెడికల్‌ షాపులపై నిఘా

షెడ్యూల్‌–హెచ్‌, హెచ్‌1 సహా ప్రిస్క్రిప్షన్‌ మందుల విక్రయంపై నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఫార్మసిస్టులు, రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించింది. యాంటీబయాటిక్స్‌, ప్రిస్క్రిప్షన్‌ పెయిన్‌కిల్లర్లను సొంతంగా వాడేలా ప్రోత్సహించకూడదని పేర్కొంది. మందుల లేబుళ్లపై ఉన్న హెచ్చరికలు, విక్రయ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలంది. ఆస్పత్రులు, వైద్య సంస్థలు పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌ వినియోగంపై పర్యవేక్షణను బలోపేతం చేయాలని కేంద్రం సూచించింది. యాంటీమైక్రోబయల్‌ స్టీవార్డ్‌షిప్‌, ప్రిస్క్రిప్షన్‌ సమీక్ష, రోగులకు తగిన అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు వైద్యులు, ఫార్మసిస్టులు, రిటైలర్లు, ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నిబంధనల అమలును పర్యవేక్షించాలని ఆదేశించింది. విచ్చలవిడి వినియోగంతో వచ్చే నివారించగల దుష్ప్రభావాలు, కిడ్నీ సమస్యలు, యాంటీమైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ను తగ్గించడమే ఈ చర్యల లక్ష్యమని కేంద్రం పేర్కొంది.

Advertisement
Advertisement