త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBSE | సీబీఎస్‌ఈ 10, 12 త‌ర‌గ‌తుల పరీక్షల షెడ్యూల్ వ‌చ్చేసింది..! ఫుల్ టైమ్ టేబుల్ ఇదే..!

CBSE | సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 9తో ముగియనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 9 వరకు కొనసాగనున్నాయి.

P

National | Published On Nov 6, 2026, 9.45 pm IST

CBSE | సీబీఎస్‌ఈ 10, 12 త‌ర‌గ‌తుల పరీక్షల షెడ్యూల్ వ‌చ్చేసింది..! ఫుల్ టైమ్ టేబుల్ ఇదే..!
Advertisement

CBSE | సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 9తో ముగియనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 9 వరకు కొనసాగనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయని బోర్డు వెల్లడించింది. విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతకు తగిన సమయం లభించేలా పరీక్షల ప్రారంభానికి 101 రోజుల ముందుగానే టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది పదో తరగతిలో 83 సబ్జెక్టులకు, 12వ తరగతిలో 121 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 204 సబ్జెక్టుల్లో జరిగే పరీక్షలకు 45.68 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్షలకు 26.5 లక్షల మందికి పైగా, 12వ తరగతి పరీక్షలకు 19.18 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.

పరీక్షల తేదీలు

పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 17న మ్యాథమెటిక్స్‌, ఫిబ్రవరి 22న సైన్స్‌, ఫిబ్రవరి 26న ఇంగ్లిష్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 3న హిందీ కోర్సు ఏ, బీ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 8న సోషల్‌ సైన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 9తో పదో తరగతి బోర్డు పరీక్షలు ముగియనున్నాయి. 12వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 16న ఫిజిక్స్‌ పరీక్షతో బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 23న అకౌంటెన్సీ, ఫిబ్రవరి 25న జాగ్రఫీ, ఫిబ్రవరి 27న కెమిస్ట్రీ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 2న సైకాలజీ, మార్చి 3న పలు ప్రాంతీయ భాషల పరీక్షలు జరగనున్నాయి. మార్చి 5న ఇంగ్లిష్‌ కోర్‌, ఎలక్టివ్‌ పరీక్షలు, మార్చి 9న మ్యాథమెటిక్స్‌, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 13న హిందీ కోర్‌, ఎలక్టివ్‌, మార్చి 16న ఎకనామిక్స్‌, మార్చి 19న పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 25న బయాలజీ, మార్చి 27న హిస్టరీ, మార్చి 30న సోషియాలజీ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరీక్షలు, ఏప్రిల్‌ 1న బిజినెస్‌ స్టడీస్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరీక్షలు జరగనున్నాయి. చివరి విడతలో ఏప్రిల్‌ 9న రిటైల్‌, వెబ్‌ అప్లికేషన్‌ వంటి సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఏప్రిల్‌ 9తో 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తికానున్నాయి.

షెడ్యూల్‌నూ పరిగణనలోకి తీసుకుని..

12వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షల అనంతరం జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా సీబీఎస్‌ఈ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాన ప్రవేశ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని బోర్డు పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించింది. విద్యార్థులు బోర్డు పరీక్షలతో పాటు పోటీ పరీక్షలకు కూడా సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లభించేలా షెడ్యూల్‌ రూపొందించినట్లు తెలిపింది. విద్యార్థులు సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను పరిశీలించి ముందుగానే రివిజన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలని బోర్డు సూచించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని పేర్కొంది. విద్యార్థులు అధికారిక డేట్‌షీట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని భద్రపరచుకోవాలని సూచించింది.

Advertisement
Advertisement