త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Cabinet Decisions | క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లకు బిగ్ బూస్ట్: 3 కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

గ్రిడ్ స్కేల్ ఎనర్జీ స్టోరేజ్, క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన పూర్తి వివరాలు ఇవే.

J

National | Published On Nov 4, 2026, 6.21 pm IST

Union Cabinet Decisions | క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లకు బిగ్ బూస్ట్: 3 కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

సంక్షిప్త సారాంశం

92 గిగావాట్-అవర్స్ (GWh) భారీ గ్రిడ్-స్కేల్ ఎనర్జీ స్టోరేజ్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం (30 GWh బ్యాటరీ, 60 GWh పంప్డ్ స్టోరేజ్, 2 GWh ఎమర్జింగ్ టెక్నాలజీస్). 24 కీలక ముడి ఖనిజాల (Critical Minerals) ప్రాసెసింగ్ కోసం సరికొత్త విధానం; ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ రంగానికి భారీ ఊతం. దేశంలో ప్రస్తుతం దాదాపు 52 శాతం విద్యుత్ ఉత్పత్తి నాన్-ఫాసిల్ ఫ్యూయల్స్ (పునరుత్పాదక ఇంధనం) నుంచే వస్తున్నట్లు ప్రకటన. దేశ గణాంక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రూ.4,371 కోట్ల డేటా-డ్రివెన్ స్కీమ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.

Advertisement

Union Cabinet Decisions | త్రినేత్ర న్యూస్ : భారత పునరుత్పాదక ఇంధన రంగం, అత్యాధునిక తయారీ పరిశ్రమలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రివర్గం మూడు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. క్లీన్ ఎనర్జీ స్టోరేజ్, క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్, దేశ గణాంక వ్యవస్థ ప్రక్షాళన రంగాల్లో భారీ కార్యాచరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన స్పష్టం చేశారు.

92 GWh గ్రిడ్-స్కేల్ ఎనర్జీ స్టోరేజ్ స్కీమ్

పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పూర్తిస్థాయిలో పెంచేందుకు 92 గిగావాట్-అవర్స్ (GWh) సామర్థ్యంతో గ్రిడ్-లెవల్ ఎనర్జీ స్టోరేజ్ స్కీమ్‌ను కేబినెట్ ఆమోదించింది. ఈ మొత్తం సామర్థ్యంలో 30 GWh బ్యాటరీ స్టోరేజ్, 60 GWh హైడ్రో పంప్డ్ స్టోరేజ్ (సోలార్ పవర్ ద్వారా నీటిని ఎగువకు పంపింగ్ చేసి, రాత్రి వేళల్లో విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం), 2 GWh అల్ట్రా-కెపాసిటర్లు వంటి సరికొత్త ఎమర్జింగ్ టెక్నాలజీల కోసం కేటాయించారు.

రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తారు. సౌర విద్యుత్ ప్లాంట్లలో పగలు ఉత్పత్తయ్యే అదనపు విద్యుత్‌ను స్టోర్ చేయడం ద్వారా ట్రాన్స్‌మిషన్ సామర్థ్యం పూర్తిస్థాయిలో సద్వినియోగం అవుతుందని, విద్యుత్ వృథా గణనీయంగా తగ్గుతుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం భారత్ ఉత్పత్తి చేసే విద్యుత్‌లో ఏకంగా 52 శాతం శిలాజేతర (నాన్-ఫాసిల్ ఫ్యూయల్స్) వనరుల నుంచే వస్తోందని ఆయన గుర్తుచేశారు.

24 క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కొత్త పథకం

ఆధునిక పరిశ్రమలకు అత్యంత కీలకమైన 'క్రిటికల్ మినరల్స్ మిషన్'లో మరో ముందడుగు పడింది. మైనింగ్ ద్వారా వెలికితీసిన ముడి ఖనిజాలతో పాటు రీసైక్లింగ్ ద్వారా లభించే మెటీరియల్‌ను మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలకు అనుగుణంగా మార్చేందుకు ప్రత్యేక ప్రాసెసింగ్ స్కీమ్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. గుర్తించిన 24 క్రిటికల్ మినరల్స్‌కు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇది దేశీయంగా సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, హెవీ మెషినరీ రంగాలకు భారీ ఊతాన్ని ఇస్తుందని మంత్రి తెలిపారు.

రూ.4,371 కోట్లతో డేటా వ్యవస్థ ప్రక్షాళన

పాలసీల రూపకల్పనలో ‘చల్తా హై’ ధోరణికి స్వస్తి పలికి, కచ్చితమైన డేటా ఆధారంగా (డేటా-డ్రివెన్) నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా దేశ గణాంక విభాగాన్ని (Statistical System) ఆధునీకరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.4,371 కోట్ల బడ్జెట్‌తో అమలయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా డేటా సేకరణ పద్ధతులు, సర్వే మెథడాలజీల ఆధునీకరణ, బయాస్ రిడక్షన్, క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ ట్రూతింగ్), వర్సిటీలలో సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించి వ్యవస్థను పూర్తి పారదర్శకంగా తీర్చిదిద్దనున్నారు.

Advertisement
Advertisement