త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP New National Team | బీజేపీ కొత్త కార్యవర్గం: తెలంగాణకు బిగ్ షాక్.. ఏపీకి మూడు కీలక పదవులు!

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు మొండిచేయి ఎదురైంది. కీలక నేత డీకే అరుణను తప్పించగా.. ఏపీకి మాత్రం భారీ ప్రాధాన్యం దక్కింది.

J

National | Published On Aug 17, 2026, 4.39 pm IST

BJP New National Team | బీజేపీ కొత్త కార్యవర్గం: తెలంగాణకు బిగ్ షాక్.. ఏపీకి మూడు కీలక పదవులు!
Advertisement
  • బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు దక్కని ప్రాతినిధ్యం
  • ఉపాధ్యక్ష పదవి నుంచి ఎంపీ డీకే అరుణ తొలగింపు
  • ఏపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, రామ్ మాధవ్‌లకు జాతీయ ఉపాధ్యక్షులుగా, విష్ణువర్ధన్ రెడ్డికి జాయింట్ కో-ఆర్డినేటర్‌గా అవకాశం
  • జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ రీ-ఎంట్రీ
  • మొత్తం 13 మంది ఉపాధ్యక్షుల్లో 6 మంది మహిళలకే చోటు
  • రాబోయే అసెంబ్లీ, 2029 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో సమగ్ర మార్పులు

BJP New National Team | త్రినేత్ర.న్యూస్ : భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించిన నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ రాష్ట్రానికి ఊహించని షాక్ తగిలింది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో విడుదలైన కొత్త జాబితాలో తెలంగాణ నేతలకు ఒక్క కీలక పదవి కూడా దక్కలేదు. గతంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను తాజా టీమ్ నుంచి తప్పించారు. అటు ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌ స్థానంలో అమర్‌పాల్ మౌర్యను నియమించారు. దీంతో తెలంగాణ నుంచి ఎవరికీ చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఏపీకి పెద్దపీట.. పురందేశ్వరి, రామ్ మాధవ్‌లకు కీలక బాధ్యతలు

తెలంగాణకు నిరాశ ఎదురైనా.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం బీజేపీ అధిష్ఠానం సముచిత స్థానం కల్పించింది. ఏపీ నుంచి ముగ్గురు కీలక నేతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

డీకే అరుణ ఔట్ - పురందేశ్వరి ఇన్: పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు.

రామ్ మాధవ్ పునరాగమనం: సీనియర్ నేత రామ్ మాధవ్‌కు కూడా జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

విష్ణువర్ధన్ రెడ్డికి ప్రమోషన్: పార్టీ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని నియమించారు.

స్మృతి ఇరానీకి జనరల్ సెక్రటరీ బాధ్యతలు.. మహిళలకు 50% వాటా

రాబోయే ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ సమరాలతో పాటు 2029 పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ భారీ సంస్థాగత మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శిగా (General Secretary) నియమించి క్రియాశీలక బాధ్యతలు అప్పగించారు.

మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షులను నియమించగా, అందులో ఏకంగా ఆరుగురు మహిళా నేతలే ఉండటం విశేషం. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింధియాతో పాటు వివిధ రాష్ట్రాల సీనియర్లకు ప్రాధాన్యత కల్పించారు.

జాతీయ ఉపాధ్యక్షుల జాబితా

దగ్గుబాటి పురందేశ్వరి, రామ్ మాధవ్, వసుంధరా రాజే సింధియా, తీరథ్ సింగ్ రావత్, బైజయంత్ జే పాండా, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మ, వర్షాబెన్ దోషి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, లాల్ సింగ్ ఆర్య, ఎం. నాగరాజ్, తారిక్ మన్సూర్, మధుచందా కర్.

8 మంది ప్రధాన కార్యదర్శులు.. మోర్చాలకు కొత్త అధ్యక్షులు

పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్ తన పదవిలో కొనసాగనున్నారు. 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో స్మృతి ఇరానీతో పాటు వినోద్ తావుడే, సునీల్ బన్సల్, బిప్లవ్ కుమార్ దేవ్, సతీష్ పునియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా చోటు దక్కించుకున్నారు.

ఇక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు జాతీయ కోశాధికారి బాధ్యతలు అప్పగించగా.. యువ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ హేమంత్ జోషి, మహిళా మోర్చా చీఫ్‌గా రూప్ కుమారి చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. మీడియా కన్వీనర్‌గా అనిల్ బలూని కొనసాగనున్నారు. మొత్తం మీద రాబోయే ఎన్నికల వ్యూహాలకు అనుగుణంగా నితిన్ నబీన్ టీమ్ సమూల మార్పులతో రంగంలోకి దిగింది.

Advertisement
Advertisement