త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Sweep in Gujarat | గుజరాత్‌లో కమలం క్లీన్‌స్వీప్.. కాంగ్రెస్, ఆప్ అడ్రస్ గల్లంతు

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘనవిజయం సాధించింది. నగరపాలక సంస్థల నుంచి గ్రామ పంచాయితీల వరకు కమలం పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.

J

National | Published On Apr 28, 2026, 5.09 pm IST

BJP Sweep in Gujarat | గుజరాత్‌లో కమలం క్లీన్‌స్వీప్.. కాంగ్రెస్, ఆప్ అడ్రస్ గల్లంతు
Advertisement

BJP Sweep in Gujarat | త్రినేత్ర.న్యూస్ : గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పట్నం, పల్లె అనే తేడా లేకుండా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఒకవైపు బీజేపీ అప్రతిహత విజయాలతో దూసుకుపోతే.. ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు (ఆప్) నామమాత్రపు స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూశాయి.

సూరత్‌లో ఆప్‌కు ఘోర పరాభవం

సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో 27 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించిన ఆప్.. ఈసారి పాతాళానికి పడిపోయింది. మొత్తం 127 స్థానాలకు గాను బీజేపీ 115 స్థానాల్లో విజయదుందుభి మోగించగా, ఆప్ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుని ఐదేళ్ల తర్వాత ఖాతా తెరిచింది. ఆప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు, కార్పొరేషన్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న అభ్యర్థి కూడా ఓటమి పాలు కావడం గమనార్హం. ఈ టైమ్‌లో ఆప్ భవిష్యత్తు గుజరాత్‌లో ప్రశ్నార్థకంగా మారింది.

మున్సిపల్ కార్పొరేషన్లలో ఏకపక్షం

రాష్ట్రంలోని 15 మున్సిపల్ కార్పొరేషన్లలోని 1,044 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 856 స్థానాలను కైవసం చేసుకుని పట్టణ ఓటర్లపై తన పట్టును నిలుపుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 77 స్థానాలతో సరిపెట్టుకోగా, ఇతరులు 12 స్థానాలు గెలుచుకున్నారు.

మున్సిపాలిటీలు, పంచాయతీల్లోనూ అదే జోరు

మున్సిపాలిటీలు: మొత్తం 84 మున్సిపాలిటీల్లోని 2,030 స్థానాలకు గాను, బీజేపీ 1,791 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 414, ఇతరులు 144 స్థానాలు దక్కించుకున్నారు.

జిల్లా పంచాయతీలు: 34 జిల్లా పంచాయతీల్లో (1,090 స్థానాలు) బీజేపీ 568 స్థానాలు సాధించగా, కాంగ్రెస్ 77, ఇతరులు 30 స్థానాల్లో విజయం సాధించారు.

తాలూకా పంచాయతీలు: 260 తాలూకా పంచాయతీల్లో (5,234 స్థానాలు) బీజేపీ ఏకంగా 2,397 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 591, ఇతరులు 329 స్థానాలు సాధించారు.

స్పష్టమైన రాజకీయ సంకేతం

ఈ ఎన్నికల ఫలితాలు గుజరాత్‌లో బీజేపీకి ఉన్న తిరుగులేని సంస్థాగత బలాన్ని మరోసారి దేశానికి చాటిచెప్పాయి. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయి నుంచి అధికార పార్టీ ఎంత బలంగా ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. సూరత్‌లో ఆప్ పతనం కావడం, కాంగ్రెస్ పరిమిత విజయాలకే పరిమితం కావడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు మధ్య అంతరం భారీగా పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement