త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | రాహుల్ పార్ల‌మెంట్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలి.. నోటీసు ఇచ్చిన బీజేపీ ఎంపీ

Rahul Gandhi | పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో మ‌రో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు (Rahul Gandhi Parliament Membership) చేయాలని కోరుతూ బీజేపీ నోటీసు ఇచ్చింది.

D

National | Published On Feb 12, 2026, 12.22 pm IST

Rahul Gandhi | రాహుల్ పార్ల‌మెంట్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలి.. నోటీసు ఇచ్చిన బీజేపీ ఎంపీ
Advertisement

Rahul Gandhi | పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో మ‌రో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. భార‌త్‌-అమెరికా మ‌ధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హంతో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్ష నేత‌పై చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు (Rahul Gandhi Parliament Membership) చేయాలని కోరుతూ బీజేపీ నోటీసు ఇచ్చింది.

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey).. రాహుల్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ స‌భ‌లో స‌బ్‌స్టాంటివ్ మోష‌న్ (substantive motion) దాఖ‌లు చేశారు. రాహుల్ గాంధీకి విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నాయని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని దూబే డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధించాలని బీజేపీ తన నోటీసులో పేర్కొంది.

భరతమాతను అమెరికాకు అమ్మేశారు..

కాగా, బుధ‌వారం లోక్‌స‌భ‌లో రాహుల్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ( India-US trade deal) ఓ 'లొంగుబాటు' చ‌ర్య‌గా రాహుల్‌ అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా భారత ప్రయోజనాలను పూర్తిగా అమెరికాకు తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. భరతమాతను అమెరికాకు అమ్మేశారని.. ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా..? అంటూ ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

రైతుల‌కు న‌ష్టం..

రాహుల్ గాంధీ తన ప్రసంగంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల భారత రైతులు, డేటా భద్రతకు ముప్పు ఉందని తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌స‌భ‌లో రాహుల్ ప్ర‌సంగిస్తూ.. అమెరికా టారిఫ్‌ల‌తో దేశ రైతాంగానికి తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంది. అమెరికాలోని కొన్ని ఉత్ప‌త్తుల‌కు మోదీ ప్ర‌భుత్వం గేట్లు తెరిచింది. దీంతో రైత‌న్న‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతారు. అమెరికా టారిఫ్‌ల‌తో టెక్స్ టైల్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుంది. అనేక మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. పార్టీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కోసమే టారిఫ్‌ల‌కు మోదీ ఒప్పుకున్నారు. దేశ ఇంధన భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడింది. చమురు ఎవరి నుండి కొనుగోలు చేయాలో కూడా అమెరికానే నిర్ణయించే స్థితికి మనం చేరుకున్నాం అంటూ రాహుల్‌ దుయ్యబట్టారు.

రాహుల్‌వి నిరాధార‌మైన వ్యాఖ్య‌లు

రాహుల్ ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ మండిప‌డింది. బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు, ప్ర‌తిప‌క్ష నేత‌కు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం అల‌వాటే అంటూ బీజేపీ ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు.

Advertisement
Advertisement