త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Aruna | అధ్య‌క్షా.. జై తెలంగాణ‌.. లోక్‌స‌భ‌లో డీకే అరుణ నినాదం

DK Aruna | లోక్‌స‌భ‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ జై తెలంగాణ.. జై తెలంగాణ.. అని నిన‌దించారు. చైర్‌లో ఉన్న ప్యానెల్ స్పీక‌ర్ కూడా జై తెలంగాణ అని నిన‌దించారు.

S

National | Published On Apr 17, 2026, 6.25 pm IST

DK Aruna | అధ్య‌క్షా.. జై తెలంగాణ‌.. లోక్‌స‌భ‌లో డీకే అరుణ నినాదం
Advertisement

DK Aruna | త్రినేత్ర‌.న్యూస్ : లోక్‌స‌భ‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ జై తెలంగాణ.. జై తెలంగాణ.. అని నిన‌దించారు. చైర్‌లో ఉన్న ప్యానెల్ స్పీక‌ర్ కూడా జై తెలంగాణ అని నిన‌దించారు. ఈ బిల్లుపై చ‌ర్చ నేప‌థ్యంలో డీకే అరుణ‌కు మాట్లాడేందుకు అవ‌కాశం రాగా ఆమె.. జై తెలంగాణ అని నిన‌దించి త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.

డీకే అరుణ ప్ర‌సంగం ఆమె మాట‌ల్లోనే..

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లుపై ప్ర‌సంగించే అవ‌కాశం క‌ల్పించినందుకు ధ‌న్య‌వాదాలు. ద‌శాబ్దాల మ‌హిళ‌ల క‌ల‌ను నిజం చేస్తూ 2023 సెప్టెంబ‌ర్‌లో నారీ శ‌క్తి వంద‌నం అధినియ‌మ్ బిల్లును పార్ల‌మెంట్‌లో పాస్ చేయించి, దేశ మ‌హిళ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి మ‌హిళ‌లంద‌రి త‌ర‌పున కోటి కోటి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ద‌శాబ్దాలుగా మ‌హిళ‌లు రాజ‌కీయాల్లో త‌క్కువ ప్రాతినిధ్యం క‌లిగి ఉన్నారు. ఈ బిల్లు అమ‌ల్లోకి రావ‌డం వ‌ల్ల మ‌హిళ‌ల గొంతులు చ‌ట్ట స‌భ‌ల్లో మ‌రింత బ‌లంగా వినిపించే అవ‌కాశం వ‌స్తుంది. నిర్ణ‌యాల్లో కూడా స‌మ‌తుల్య‌త వ‌స్తుంది. స‌మాజ అభివృద్ధికి కొత్త దిశ ఏర్ప‌డుతుంది. ఈ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును 2029 ఎన్నిక‌ల నాటికి అమ‌లు చేయాల‌నే ఉద్దేశంతో ఈ స‌మావేశాలు నిర్వ‌హించారు. రాబోయే ఎన్నిక‌ల్లో మ‌హిళా రిజర్వేష‌న్ శాతాన్ని పెంచే దిశ‌గా తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని హృద‌య‌పూర్వ‌కంగా స్వాగ‌తిస్తున్నాను.

సువ‌ర్ణాక్ష‌రాల‌తో నిలిచిపోయేట‌టువంటి ఈ చారిత్రాత్మ‌క ఘ‌ట్టంలో న‌న్ను భాగ‌స్వామిని చేసిన నా పాల‌మూరు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ఈ బిల్లు భార‌తీయ మ‌హిళ‌ల సాధికారిక‌త‌కు నూత‌న ద‌శ‌ను ప్రారంభిస్తుంది. మ‌హిళ‌ల ప్రాతినిధ్యం పెరిగే కొద్ది దేశ పాల‌న స‌మాన‌త్వంతో ముందుకు సాగుతుంది. వంటింటికే ప‌రిమిత‌మైన మ‌హిళ‌లు ఇవాళ అన్ని రంగాల్లో వారి స‌మ‌ర్థ‌త‌ను చాటుతూ భువి నుంచి దివి దాకా మ‌హిళ‌లు ఎదిగారు. చ‌ట్ట‌స‌భ‌ల్లోకి మ‌హిళ‌లు రావ‌డం వ‌ల్ల దేశ ప్ర‌గ‌తిలో వారు భాగ‌స్వాములు అవుతారు అని డీకే అరుణ పేర్కొన్నారు.

Advertisement
Advertisement