BMC Elections 2026 | మహారాష్ట్ర రాజధాని ముంబై.. తన మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని శుక్రవారం లిఖించబోతోంది. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి కార్పొరేషన్ పీఠాన్ని అధిరోహించిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ ఈసారి చతికిలపడింది. దీంతో ఉద్ధవ్ శివసేన కోటలు ముంబైలో బీటలు పడ్డాయి. బీఎంసీ ఎన్నికల్లో ఉన్న 227 వార్డుల్లో బీజేపీ 91 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఉద్ధవ్ ఠాక్రే శివ సేన 71 స్థానాలు, షిండే సేన 32 స్థానాలు, కాంగ్రెస్ 14, ఎంఎన్ఎష్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. బీజేపీ, షిండే శివసేన పార్టీల కూటమి మహాయుతి మెజారిటీ దిశగా దూసుకుపోతుండటంతో ముంబై పీఠం ఈసారి మహాయుతికి దక్కడం కన్ఫమ్ అయింది. దీంతో ముంబై వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబురాలు జరుపుతున్నారు. ముంబైతో పాటు నవీ ముంబై, నాసిక్, పూణె, పింప్రి చించ్వాడ్, పన్వేల్, కల్యాణ్ డోంబివలి, మిరా భయందర్, ఉల్లాస్ నగర్, శంభాజీ నగర్, నాగ్‌పూర్, సోలాపూర్, అకోలా, నాందెడ్ వాఘలా, సాంగ్లీ మీరజ్ కుప్వాడ్, జల్‌గావ్, ధులె, జాల్నా, ఇచల్‌కరణ్‌జీ లాంటి ప్రాంతాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే.. ఈ ఎన్నికల్లో కొందరు ప్రముఖ నేతలు ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి రవి రాజా.. 185 వ వార్డులో ఓడిపోయాడు. 2024 లో కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరిన రవి రాజా ఈ ఎన్నికల్లో ఓడిపోయాడు. శివసేన పార్టీకి చెందిన సమాధాన్ సర్వాంకర్ వార్డు నెంబరు 194 నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మాజీ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ కొడుకు ఈయన. వార్డు నెంబర్ 73 లో ఎంపీ రవీంద్ర వైకర్ కూతురు దీప్తి వైకర్ ఓడిపోయారు.