త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Diwali | అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపకాంతుల్లో వెలిగిపోయిన రామ‌న‌గిరి..!

Diwali | రామనగరి అయోధ్య మరోసారి చరిత్రకు వేదికైంది. భక్తి, ఆధ్యాత్మికత, సంస్కృతి ఉట్టిపడేలా శనివారం నిర్వహించిన దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఏకంగా 30 లక్షల దీపాల వెలుగులతో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

P

National | Published On Nov 7, 2026, 9.10 pm IST

Diwali | అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపకాంతుల్లో వెలిగిపోయిన రామ‌న‌గిరి..!
Advertisement

Diwali | రామనగరి అయోధ్య మరోసారి చరిత్రకు వేదికైంది. భక్తి, ఆధ్యాత్మికత, సంస్కృతి ఉట్టిపడేలా శనివారం నిర్వహించిన దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఏకంగా 30 లక్షల దీపాల వెలుగులతో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. సాకేత్‌ కళాశాల నుంచి ఉదయం ప్రారంభమైన శ్రీరామ పట్టాభిషేక శోభాయాత్ర దాదాపు మూడు కిలోమీటర్లు సాగి రామ్‌కథా పార్క్‌కు చేరుకుంది. 14 రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, రామాయణంలోని ఏడు కాండాల ఇతివృత్తంతో రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారిపొడవునా జైశ్రీరామ్‌ నినాదాలు మార్మోగాయి.

రామ్‌కథా పార్క్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రామజన్మభూమి ఆలయంలో రామ్‌లల్లాకు హారతి ఇచ్చి దీపాలు వెలిగించారు. ఆలయ ఘాట్లు, పరిసర ప్రాంతాల్లో 30 లక్షల దీపాలను వెలిగించారు. సరయూ నది తీరంలో 2,100 మందికి పైగా నిర్వహించిన మహా హారతి భక్తులను ఆకట్టుకుంది. డ్రోన్‌ షో, లేజర్‌ ప్రదర్శన, బాణసంచా వెలుగులతో వేడుకలు మరింత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. శ్రీరామ జన్మభూమి ఆలయం హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. దాదాపు 500 ఏళ్ల నిరీక్షణ, పోరాటం తర్వాత అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మితమైందన్నారు. శ్రీరాముడి జీవితం ధర్మం, కరుణ, కర్తవ్యనిష్ఠకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బ్రజేశ్‌ పాఠక్‌, మంత్రులు, సాధువులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement