త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Diwali 2026 | ఇంట్లో లక్ష్మీగణేశుల పూజ ఎలా చేయాలి? పూర్తి విధానం, మంత్రాలు ఇవే!

Diwali 2026 | దీపావళి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కార్తీక మాసం అమావాస్య రోజున వచ్చే ఈ పర్వదినాన ఇళ్లను దీపాలతో అలంకరించి లక్ష్మీదేవి, గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది నవంబర్‌ 8, ఆదివారం దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ముఖ్యంగా ప్రదోష కాలంలో లక్ష్మీగణేశుల పూజకు విశేష ప్రాధాన్యం ఉంది.

P

Devotional | Published On Nov 7, 2026, 8.35 pm IST

Diwali 2026 | ఇంట్లో లక్ష్మీగణేశుల పూజ ఎలా చేయాలి? పూర్తి విధానం, మంత్రాలు ఇవే!
Advertisement

Diwali 2026 | దీపావళి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కార్తీక మాసం అమావాస్య రోజున వచ్చే ఈ పర్వదినాన ఇళ్లను దీపాలతో అలంకరించి లక్ష్మీదేవి, గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది నవంబర్‌ 8, ఆదివారం దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ముఖ్యంగా ప్రదోష కాలంలో లక్ష్మీగణేశుల పూజకు విశేష ప్రాధాన్యం ఉంది. గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని, లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. మరి దీపావళి రోజు ఇంట్లో పూజ ఎలా చేయాలి? పూజా విధానం, మంత్రాలు ఏమిటో తెలుసుకుందాం.

దీపావళి లక్ష్మీపూజ విధానం ఇదే..

ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం పూజా పీఠంపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి. ఎదురుగా గోడపై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలను ఉంచాలి లేదా వారి విగ్రహాలను పీఠంపై ప్రతిష్ఠించాలి. అనంతరం కలశాన్ని ఏర్పాటు చేయాలి. కలశంలో శుద్ధమైన నీటితోపాటు వక్క, నాణెం, పూలు, బియ్యం, పసుపు వేయాలి. కలశం ముఖంపై ఐదు మామిడి ఆకులు ఉంచాలి. కొబ్బరికాయకు కుంకుమ తిలకం పెట్టి, దానికి పవిత్రమైన దారం కట్టి కలశంపై ఉంచాలి.

లక్ష్మీదేవి కోసం అష్టదళ పద్మం

లక్ష్మీదేవికి తామర పువ్వు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. అందుకే పూజా పీఠంపై బియ్యంతో అష్టదళ పద్మాన్ని రూపొందించవచ్చు. పూజకు తామర పువ్వు అందుబాటులో ఉంటే ప్రత్యేకంగా బియ్యంతో పద్మాన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు.

లక్ష్మీగణేశులు, కుబేరుడి ప్ర‌తిష్ట‌

పూజా పీఠంపై బియ్యంతో చిన్న చిన్న రాశులు ఏర్పాటు చేసి వాటిపై గణేశుడు, లక్ష్మీదేవి, కుబేరుడి విగ్రహాలు లేదంటే చిత్రాలను ఉంచాలి. లక్ష్మీదేవి సమీపంలో విష్ణుమూర్తికి ప్రతీకగా వక్కను ఉంచాలి. ధన త్రయోదశి సందర్భంగా కొనుగోలు చేసిన బంగారు, వెండి వస్తువులు, కొత్త పాత్రలను కూడా పూజా స్థలంలో ఉంచాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేయకపోతే ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, పాత్రలను ఉంచవచ్చు. వాటితోపాటు కొంత నగదును కూడా ఉంచాలి.

దేవతలకు అభిషేకం..

పూజ సమయంలో పూలతో దేవతల విగ్రహాలపై నీటిని చల్లి ప్రతీకాత్మకంగా స్నానం చేయించాలి. అనంతరం పెద్ద ఆవ నూనె దీపాన్ని వెలిగించాలి. కొన్ని కుటుంబాల్లో ఈ దీపాన్ని రాత్రంతా వెలిగించే సంప్రదాయం ఉంది. లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తమ కుటుంబంపై అనుగ్రహం చూపాలని వేడుకోవాలి.

తిలకం, జనివారాలు, చున్నీ సమర్పణ

గణేశుడు, విష్ణుమూర్తికి వస్త్రాలకు ప్రతీకగా జనివారాలు, మౌలీ సమర్పించాలి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు చున్నీ సమర్పించాలి. అనంతరం దేవతలందరికీ రోలి లేదా కుంకుమతో తిలకం పెట్టి, దానిపై అక్షింతలు వేయాలి. తాజా పూలను సమర్పించాలి. లక్ష్మీదేవికి తామర పువ్వులు, అలంకరణ సామగ్రి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువుల సమర్పణ

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలో తామర గింజలు, గోమతి చక్రం, వక్కలు, గవ్వలు, పసుపు కొమ్ములు సమర్పించవచ్చు. అనంతరం సప్తధాన్యాలను అమ్మవారికి సమర్పించాలి. ఇందులో గోధుమలు, బియ్యం, ధనియాలు, వడ్లు, పసుపు ఆవాలు, మినుములు, పెసలు ఉంటాయి.

నైవేద్యం.. దక్షిణ సమర్పణ

లక్ష్మీదేవికి నైవేద్యంగా తమలపాకులో పేలాలు, పటికబెల్లం ఉంచి సమర్పించాలి. ఐదు రకాల సీజనల్‌ పండ్లు, డ్రైఫ్రూట్స్‌ కూడా నివేదించాలి. పూజా స్థలంలో శుద్ధమైన నీటితో నింపిన పాత్రను ఉంచాలి. తమ శక్తి, భక్తి మేరకు దేవతలకు దక్షిణ సమర్పించాలి.

వ్రత కథ.. హారతి

దీపావళి సందర్భంగా ఉపవాసం ఉంటే పూజ సమయంలో లక్ష్మీదేవి వ్రత కథ లేదా దీపావళికి సంబంధించిన పౌరాణిక కథను వినాలి. అనంతరం రెండు నెయ్యి దీపాలు, మరో ఆవ నూనె దీపాన్ని వెలిగించాలి. సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవికి వడ్లను సమర్పించాలి. చివరగా గణేశుడు, లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. అనంతరం కుటుంబ సభ్యులందరికీ హారతి, ప్రసాదం పంపిణీ చేయాలి.

దీపావళి పూజలో జపించాల్సిన మంత్రాలు

గణేశ బీజ మంత్రం
ఓం గం గణపతయే నమః.

గణేశ వందన మంత్రం
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా.

లక్ష్మీదేవి బీజ మంత్రం
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.

మహాలక్ష్మీ మంత్రం
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే.

దీపావళి పూజ ఏ దిశలో చేయాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి పూజకు ఉత్తర దిశను శుభప్రదంగా భావిస్తారు. ఉత్తర దిశ కుబేరుడికి, సంపదకు సంబంధించినదని విశ్వాసం. కొన్ని కారణాల వల్ల ఉత్తర దిశలో పూజ చేయడం సాధ్యం కాకపోతే దక్షిణ దిశ మినహా ఇంట్లో అనుకూలమైన మరో దిశలో పూజా స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని వాస్తు సంప్రదాయాలు చెబుతున్నాయి. పూజ సమయంలో పరిసరాల పరిశుభ్రత, భక్తి, ఏకాగ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

Advertisement
Advertisement