త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jantar Mantar Protest | ఇదీ మానవత్వం అంటే: జంతర్ మంతర్‌‌కు క్యూ కడుతున్న స్విగ్గీ, జొమాటో బాయ్స్.. ఆర్డర్లు పెడుతోంది వీళ్లే!

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు భారీగా ఫుడ్ ఆర్డర్లు పంపుతున్నారు. ఈ ట్రెండ్ ఎందుకంటే..

J

National | Published On Jul 22, 2026, 12.27 pm IST

Jantar Mantar Protest | ఇదీ మానవత్వం అంటే: జంతర్ మంతర్‌‌కు క్యూ కడుతున్న స్విగ్గీ, జొమాటో బాయ్స్.. ఆర్డర్లు పెడుతోంది వీళ్లే!
Advertisement
  • నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ (CJP) విద్యార్థుల ఆందోళన
  • నిరసనకారులకు స్విగ్గీ, జొమాటో యాప్స్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆహారం పంపుతున్న గుర్తుతెలియని దాతలు
  • ఆహారం భారీ ఎత్తున చేరుకుంటుండటంతో, ఫుడ్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఆర్డర్లు ఆపాలని వాలంటీర్ల విజ్ఞప్తి
  • భారీ జనసందోహం కారణంగా చుట్టుపక్కల సెక్షన్ 163 విధించిన పోలీసులు
  • నిరసనలకు సంబంధించి 10 ఎఫ్ఐఆర్లు నమోదు

Jantar Mantar Protest | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక డిజిటల్ సంఘీభావానికి వేదికగా మారాయి. ఇటీవల నీట్-యూజీ (NEET-UG) ఎగ్జామ్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) విద్యార్థులు సోమవారం నుంచి నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడికి భౌతికంగా వెళ్లి మద్దతు తెలపలేని దేశ విదేశాల్లోని గుర్తుతెలియని వ్యక్తులు.. స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) వంటి డెలివరీ యాప్స్ ద్వారా భారీగా ఫుడ్ ఆర్డర్లు పంపి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Anonymous Swiggy and Zomato Orders Flood Jantar Mantar Protests

వైరల్ వీడియోతో మొదలైన ట్రెండ్

ఈ ట్రెండ్ ఒకే ఒక్క వీడియోతో ఊపందుకుంది. భారీ వర్షంలో ఒక జొమాటో డెలివరీ బాయ్ పెద్ద ఎత్తున ఆహారం తీసుకుని జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. ముంబైకి చెందిన ఒక దాత ఆ ఫుడ్ ఆర్డర్ చేసినట్లు తెలియడంతో, ఆ స్ఫూర్తితో చాలా మంది ఈ విధంగా సహాయం చేయడం ప్రారంభించారు.

అన్నా.. ఆకలితో ఉన్నవారికి ఇచ్చేయండి

"అన్నా.. జంతర్ మంతర్ దగ్గర ఆకలితో ఉన్న ఎవరికైనా ఈ ఫుడ్ పంచిపెట్టేయండి" అనే సూచనలతో డెలివరీ ఏజెంట్లకు ఆన్‌లైన్ యాప్స్ ద్వారా ఆర్డర్లు వస్తున్నాయి. బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, రోల్స్, సమోసాలు.. ఇలా రకరకాల ఫుడ్ బాక్సులతో డెలివరీ బాయ్స్ అక్కడికి చేరుకుంటున్నారు. ప్రదీప్ కుమార్ సింగ్ అనే స్విగ్గీ ఏజెంట్ మాట్లాడుతూ.. "ఎవరో సమోసాలు ఆర్డర్ చేసి, అక్కడ ఎవరికైనా పంచేయమని చెబుతున్నారు, వాటిని ఎవరూ తీసుకోరు మేమే పంచుతున్నాం" అని తెలిపాడు. అలాగే విదేశాల నుంచి కూడా ఒక కస్టమర్ టీ ఆర్డర్ చేశాడని మహేంద్ర కుమార్ అనే మరో ఏజెంట్ చెప్పాడు. దీనిని డెలివరీ ఏజెంట్లు ఒక "స్టూడెంట్ సర్వీస్" గా భావిస్తున్నారు.

Anonymous Swiggy and Zomato Orders Flood Jantar Mantar Protests

ఆర్డర్లు ఆపండి: వాలంటీర్ల విజ్ఞప్తి

ఆన్‌లైన్ ద్వారా అంచనాలకు మించి ఫుడ్ వస్తుండటంతో అక్కడి వాలంటీర్లు, స్టూడెంట్ కోఆర్డినేటర్లు కీలక విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారుల సంఖ్య కంటే ఆహారం మించిపోతోందని, ఫుడ్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఇకపై స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ద్వారా ఆర్డర్లు పంపొద్దని సోషల్ మీడియా వేదికగా దాతలను కోరారు.

పోలీసుల ఆంక్షలు.. 10 కేసులు నమోదు

ఇదిలా ఉంటే.. ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతుండటంతో ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి.. భారీ జనసందోహాన్ని నియంత్రించే సెక్షన్ 163 విధించారు. దీంతో డెలివరీ బాయ్స్ నేరుగా ప్రధాన ఆందోళనా శిబిరం లోపలికి వెళ్లడం కష్టంగా మారింది. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా ఈ ఆందోళనలకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో 10 ఎఫ్ఐఆర్ (FIR) లను పోలీసులు నమోదు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్‌లో 4, కన్నాట్ ప్లేస్‌లో 3, మందిర్ మార్గ్, బారాఖంబా రోడ్, కర్తవ్య పథ్ స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

Advertisement
Advertisement