త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | బాధితుల గాయాల‌పై కారం చ‌ల్ల‌డ‌మేనా?

Amit Shah | 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన నవంబర్‌ 1వ తేదీనే కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిక్కుల ఊచకోతకు సంబంధించిన తేదీల్లో సభ నిర్వహించవద్దని ముందుగానే విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్‌ పట్టించుకోలేదని విమర్శించారు. రాహుల్‌ గాంధీ నిర్వహించిన ఈ ర్యాలీ సిక్కు బాధితుల గాయాలపై కారం చల్లినట్లుగా ఉందని మండిపడ్డారు.

P

National | Published On Nov 1, 2026, 4.07 pm IST

Amit Shah | బాధితుల గాయాల‌పై కారం చ‌ల్ల‌డ‌మేనా?
Advertisement
  • సిక్కుల ఊచ‌కోత రోజున కాంగ్రెస్ ర్యాలీపై ఆగ్ర‌హం
  • అబ‌ద్ధాలు చెప్ప‌డం, గంద‌ర‌గోళం సృష్టించ‌డ‌మే కాంగ్రెస్ తీరు
  • ప్ర‌తిప‌క్షాల ర్యాలీపై కేంద్ర‌మంత్రి అమిత్ షా ఆగ్ర‌హం
  • రాహుల్ ప్ర‌ధాని కావాల‌నుకుంటే మాక్‌పార్ల‌మెంట్‌లోనే ఉండాలంటూ సెటైర్లు

Amit Shah | 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన నవంబర్‌ 1వ తేదీనే కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిక్కుల ఊచకోతకు సంబంధించిన తేదీల్లో సభ నిర్వహించవద్దని ముందుగానే విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్‌ పట్టించుకోలేదని విమర్శించారు. రాహుల్‌ గాంధీ నిర్వహించిన ఈ ర్యాలీ సిక్కు బాధితుల గాయాలపై కారం చల్లినట్లుగా ఉందని మండిపడ్డారు. గురువుల నేల నుంచి కాంగ్రెస్‌ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని, సిక్కుల ఊచకోతను దేశం, పంజాబ్‌ ఎప్పటికీ మరిచిపోవని స్పష్టం చేశారు. చండీగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్‌ షా మాట్లాడుతూ.. 1984 నవంబర్‌ 1న ఢిల్లీలో జరిగిన అల్లర్లలో వేలాది మంది సిక్కులను సజీవ దహనం చేశారని గుర్తుచేశారు. అనేక కుటుంబాలు నిరాశ్రయమయ్యాయని, పిల్లలు అనాథలుగా, మహిళలు వితంతువులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ‘పెద్ద చెట్టు కూలినప్పుడు భూమి కంపిస్తుంది’ అంటూ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వేలాది మంది సిక్కుల ఊచకోతను ఇంతటి తేలికపాటి మాటలతో ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు.

ర్యాలీ వాయిదా వేయాలని కోరినా..

నవంబర్‌ 1, 2, 3 తేదీలు సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు అత్యంత విషాదకరమైనవని అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ తేదీల్లో ర్యాలీ నిర్వహిస్తే సిక్కు సమాజంలోని తల్లులు, సోదరీమణులు, చిన్నారుల మనోభావాలు దెబ్బతింటాయని కాంగ్రెస్‌కు ముందుగానే సూచించామని తెలిపారు. ర్యాలీని దీపావళి తర్వాత నిర్వహించాలని కోరుతూ ప్రెస్‌మీట్‌ కూడా పెట్టామని చెప్పారు. అయినా కాంగ్రెస్‌ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని విమర్శించారు. విదేశాల నుంచి వచ్చిన ఆదేశాలతోనే అదే రోజున సభ నిర్వహించారని ఆరోపించారు. దీపావళి సమయంలో ఢిల్లీ వ్యాపారులకు ఏడాదిలో అత్యధికంగా వ్యాపారం జరుగుతుందని, ఆ సమయంలో ర్యాలీ నిర్వహించవద్దని వారు కాంగ్రెస్‌ను కోరారని అమిత్‌ షా తెలిపారు. స్వీట్లు, టపాసుల నిల్వలు అమ్ముడుపోకపోతే తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. మూడుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి, లేఖలు రాసి ర్యాలీని వాయిదా వేయాలని కోరినా కాంగ్రెస్‌ మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. ఢిల్లీలో గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదని, రాబోయే మూడు ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు.

మరో ఐదేళ్లు ప్రతిపక్షంలోనే..

అబద్ధాలు ప్రచారం చేయడం, గందరగోళం సృష్టించడం, పార్లమెంట్‌ కార్యకలాపాలను అడ్డుకోవడం కాంగ్రెస్‌ తీరుగా మారిందని అమిత్‌ షా విమర్శించారు. పార్లమెంటరీ అంశాలను వీధుల్లోకి తీసుకొచ్చి రచ్చ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇదే వైఖరి కొనసాగిస్తే మరో ఐదేళ్లు ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుందని రాహుల్‌ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత 15 ఏళ్లుగా వరుసగా ఎన్నికల్లో ఓటములు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌.. సోనియాగాంధీ తన కుమారుడిని ప్రధానిని చేయాలన్న కలను నెరవేర్చుకోలేకపోయిందని అమిత్‌ షా అన్నారు. ఇప్పుడు కొత్తగా మాక్‌ పార్లమెంట్‌ నిర్వహిస్తోందని విమర్శించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలనుకుంటే జీవితాంతం మాక్‌ పార్లమెంట్‌లోనే ఉండాలని, ఆయనకు ఆ అవకాశం రాదంటూ ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్:

1984 Anti Sikh RiotsAmit ShahAnti Sikh Riots AnniversaryCongress PartyCongress RallyDelhi RallyRahul GandhiRajiv GandhiSikh MassacreSonia GandhiTelugu News
Advertisement
Advertisement