త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?

పాకిస్థాన్‌లో రహస్య ఏజెంట్‌గా తిరిగారని చెప్పే అజిత్ దోవల్ ప్రచారంలో నిజమెంత? దౌత్య హోదా నుంచి పఠాన్‌కోట్, పుల్వామా దాకా వెలుగుచూడని వాస్తవాలు ఇవే.

J

National | Published On Sep 20, 2026, 6.46 pm IST

India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?

సంక్షిప్త సారాంశం

పాకిస్థాన్‌లో హాలీవుడ్ తరహా గూఢచారిగా కాకుండా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో దౌత్యవేత్త హోదాలోనే దోవల్ విధులు నిర్వర్తించారు. 1999 కాందహార్ విమానం హైజాక్ సంప్రదింపుల్లో పాల్గొని మసూద్ అజహర్‌ను విడుదల చేయడంపై స్వయంగా విమర్శలు వచ్చాయి. ఎన్‌ఎస్‌ఏ (NSA)గా ఉన్న కాలంలో పఠాన్‌కోట్, పుల్వామా దాడులు, గల్వాన్ ఘర్షణలు, మణిపూర్ సంక్షోభంపై జవాబుదారీతనం కొరవడిందనే విమర్శలు వచ్చాయి. అజిత్ దోవల్ రహస్య ఆపరేషన్ల ప్రచారానికి, క్షేత్రస్థాయి ఫలితాలకు మధ్య ఉన్న తేడాలపై సమగ్ర విశ్లేషణ ఇది.

Advertisement
  • అజిత్ దోవల్ నిజంగానే జేమ్స్ బాండా?
  • రీల్ ప్రచారాలు వర్సెస్ రియల్ ట్రాక్ రికార్డ్

India Spy Ajit Doval | త్రినేత్ర.న్యూస్ : భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పేరు వినగానే సోషల్ మీడియాలోనూ, సినిమాల్లోనూ ఆయనో అపర చాణక్యుడు, హాలీవుడ్ తరహా సీక్రెట్ ఏజెంట్ అనే ప్రచారం విస్తృతంగా కనిపిస్తుంది. శత్రుదేశం నడిబొడ్డున మారువేషాల్లో తిరిగి రహస్యాలు రాబట్టారనే కథనాలు దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్నాయి. అయితే, సినిమాటిక్ ఇమేజ్‌ను పక్కనపెట్టి అధికారిక రికార్డులు, గత పరిణామాలను పరిశీలిస్తే వాస్తవాలు భిన్నంగా కనిపిస్తాయనే చర్చ రక్షణ, రాజకీయ విశ్లేషకుల్లో సాగుతోంది.

పాకిస్థాన్‌లో రహస్య ఏజెంటా.. దౌత్యవేత్తా?

దోవల్ పాకిస్థాన్‌లో ఎవరికీ తెలియకుండా తిరిగిన గూఢచారి కాదన్నది బహిరంగ రహస్యం. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ (Indian High Commission) కమర్షియల్ విభాగంలో దౌత్యవేత్త (Diplomatic cover) హోదాలో అధికారిక రక్షణతోనే ఆయన అక్కడ పనిచేశారు. రాయబార కార్యాలయాల్లో ఇతర దేశాల అధికారులు ఎలా ఉంటారో, ఆయన కూడా అంతర్జాతీయ దౌత్య నిబంధనల ప్రకారమే విధులు నిర్వర్తించారు తప్పితే, రీల్స్‌లో చూపించే జేమ్స్ బాండ్ తరహా ఆపరేషన్లు అక్కడ జరగలేదన్నది నిపుణుల మాట.

కుటుంబ నెట్‌వర్క్.. వ్యాపార వివాదాలు

దోవల్ వ్యక్తిగత రికార్డుతో పాటు ఆయన కుటుంబ నేపథ్యంపైనా గతంలో పలు కథనాలు వచ్చాయి. ఒక కుమారుడు అధికార బీజేపీ అనుబంధ వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉంటూ పాలకపక్షానికి దగ్గరగా ఉండే మేధోమథన వేదిక 'ఇండియా ఫౌండేషన్' బాధ్యతలు చూస్తుండగా, మరో కుమారుడు కేమన్ ఐలాండ్స్ కేంద్రంగా పనిచేసిన హెడ్జ్ ఫండ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారనే వార్తలు 2019లో చర్చనీయాంశమయ్యాయి. ఆ సమయంలో ఒక వ్యాపార భాగస్వామ్యంపై వచ్చిన కథనాలు కూడా మెయిన్ స్ట్రీమ్ ప్రచారంలో కనిపించకుండా పోయాయి.

రికార్డుల్లో కనిపించే విఫల ఆపరేషన్లు

పోస్టర్లలో కనిపించని కొన్ని చారిత్రక వాస్తవాలను రక్షణ రంగ విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు.

1999 కాందహార్ హైజాక్: కాందహార్ విమానం హైజాక్ సమయంలో బందీలను విడిపించేందుకు వెళ్లిన సంప్రదింపుల బృందంలో దోవల్ కూడా ఉన్నారు. ఆ సమయంలో భారత జైలు నుంచి ఉగ్రవాది మసూద్ అజహర్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తర్వాతే అతడు జైషే మహ్మద్‌ను స్థాపించి భారత్‌పై వరుస దాడులకు తెగబడ్డాడు. దీన్ని స్వయంగా దోవలే.. వాజ్‌పేయి హయాంలో జరిగిన దౌత్యపరమైన వైఫల్యంగా పేర్కొన్నారు.

2005 దావూద్ ఆపరేషన్: దుబాయ్‌లో దావూద్ ఇబ్రహీంపై దాడి చేసేందుకు వేసిన వ్యూహం, బ్రీఫింగ్ సమయంలోనే ముంబై పోలీసులు షూటర్లను అరెస్ట్ చేయడంతో భద్రతా సంస్థల మధ్య సమన్వయ లోపం బయటపడి ఆపరేషన్ నిలిచిపోయింది.

ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు.. సవాళ్లు, ప్రశ్నలు

జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దాడి రోజులు తరబడి సాగడం, పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన ఘటనలు దేశాన్ని తీవ్రంగా కలచివేశాయి. ఇంటెలిజెన్స్ వైఫల్యాలపై హెచ్చరించినా పట్టించుకోలేదని అప్పటి జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆ తర్వాత పహల్గాం, ఎర్రకోట సమీప ఘటనలు కూడా భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపాయి.

ఇక విదేశాంగ, సరిహద్దు పరంగా చూస్తే.. గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనా సరిహద్దుల్లో యథాతథ స్థితి (Status Quo) పునరుద్ధరణపై చర్చలు కొనసాగుతున్నా పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఏళ్ల తరబడి హింస చెలరేగడం, ఆయుధాగారాలు లూటీ కావడం అంతర్గత భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. పెగాసస్ (Pegasus) నిఘా సాఫ్ట్‌వేర్ వ్యవహారంలో విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టు నియమించిన కమిటీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందలేదన్న అంశాలు చర్చకు వచ్చాయి.

ప్రచారం హాలీవుడ్.. వాస్తవాలు వేరు

దౌత్య రక్షణలో విధులు, రాజకీయ అనుబంధాలు కలిగిన కుటుంబం, మధ్యలోనే ఆగిపోయిన కొన్ని ఆపరేషన్లు, ఎన్‌ఎస్‌ఏ హయాంలో జరిగిన భారీ ఉగ్రదాడులు, వాటిపై బహిరంగ విచారణ లేకపోవడం.. ఇవీ రికార్డుల్లో ఉన్న వాస్తవాలు. భారత ఇంటెలిజెన్స్ పితామహుడిగా పేరొందిన ఆర్.ఎన్. కావ్‌తో దోవల్‌ను పోల్చడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. సినిమాటిక్ హైప్‌ను నమ్మడం కంటే, నాణేనికి ఉన్న రెండో వైపు వాస్తవాలను సరిచూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది.. అంటూ సోషల్ మీడియాలో అజిత్ దోవల్ గురించి నెటిజన్లు చర్చలు సాగిస్తున్నారు.

Advertisement
Advertisement