త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajasthan | పొలంలో దాచిన రూ. 5 ల‌క్ష‌లు చెద‌ల‌పాలు.. ఓ రైతు నిర్ల‌క్ష్యం ఇదీ..!

Rajasthan | ఆయ‌నో వృద్ధ రైతు.. త‌న‌కున్న ఓ ప్లాట్‌ను విక్ర‌యించాడు. ఇక ఆ న‌గ‌దుతో పొలంలో ఓ ఇల్లు నిర్మించుకోవాల‌నుకున్నాడు. దాంతో ఆ డ‌బ్బు గురించి కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌కుండా.. పొలం వ‌ద్ద‌నే దాచిపెట్టాడు. చివ‌ర‌కు ఆ న‌గ‌దు చెద‌ల పాలైంది.

S

National | Published On Aug 11, 2026, 7.20 am IST

Rajasthan | పొలంలో దాచిన రూ. 5 ల‌క్ష‌లు చెద‌ల‌పాలు.. ఓ రైతు నిర్ల‌క్ష్యం ఇదీ..!
Advertisement

Rajasthan | త్రినేత్ర‌.న్యూస్ : ఆయ‌నో వృద్ధ రైతు.. త‌న‌కున్న ఓ ప్లాట్‌ను విక్ర‌యించాడు. ఇక ఆ న‌గ‌దుతో పొలంలో ఓ ఇల్లు నిర్మించుకోవాల‌నుకున్నాడు. దాంతో ఆ డ‌బ్బు గురించి కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌కుండా.. పొలం వ‌ద్ద‌నే దాచిపెట్టాడు. చివ‌ర‌కు ఆ న‌గ‌దు చెద‌ల పాలైంది. విష‌యం తెలుసుకున్న రైతు భార్య‌, కుమారులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌స్థాన్‌( Rajasthan )లోని బ‌లోత్రా జిల్లాకు చెందిన రైతు మంగీలాల్.. ఏడాది క్రితం త‌న‌కున్న ఓ ప్లాట్‌ను విక్ర‌యించాడు. దాంతో రూ. 5 ల‌క్ష‌లు ఆయ‌న‌కు వ‌చ్చాయి. ఇక ఆ డ‌బ్బుతో త‌న పొలంలోనే ఇల్లు క‌ట్టుకోవాల‌నుకున్నాడు. అయితే ఇంట్లో డ‌బ్బు దాచిపెడితే ఎవ‌రైనా దొంగిలించే అవ‌కాశం ఉంద‌ని భ‌యప‌డ్డాడు రైతు. అంతేకాదు.. కుటుంబ స‌భ్యులు వృథా ఖ‌ర్చు చేసే అవ‌కాశం ఉంద‌ని భావించాడు. దీంతో రూ. 5 ల‌క్షల న‌గ‌దును ఓ పాలిథీన్ సంచిలో ఉంచి.. పొలంలోనే గుంత తీసి దాచిపెట్టాడు.

ఇక మంగీలాల్‌కు మ‌ద్యం అల‌వాటు ఉంది. మ‌తిమ‌రుపు కూడా ఉంది. ఈ క్ర‌మంలో డ‌బ్బు ఎక్క‌డా దాచి పెట్టాడ‌న్న విష‌యం మ‌రిచిపోయాడు. ఏడాది త‌ర్వాత ఇల్లు క‌ట్టుకుందామ‌నే ఆలోచ‌న రావ‌డంతో.. న‌గ‌దు ఎక్కడా దాచాన‌నే దానిపై దృష్టి సారించాడు. చివ‌ర‌కు భార్య‌, కుమారుల‌కు విష‌యం చెప్పాడు.

కుటుంబ స‌భ్యులంతా క‌లిసి వారం రోజుల పాటు పొల‌మంతా త‌వ్వి చూశారు. కానీ ఎక్క‌డా న‌గ‌దు ఆచూకీ ల‌భించ‌లేదు. ఇటీవ‌లి కాలంలో వ‌ర్షాలు ప‌డ‌డంతో, సాగు కోసం ట్రాక్ట‌ర్‌తో భూమిని దున్నించారు. ఓ రోజు రాత్రి ఆ న‌గ‌దు సంచి బ‌య‌ట‌ప‌డింది. చీక‌టి కావ‌డంతో దాన్ని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు.

మ‌రుస‌టి రోజు ఉద‌యం మంగీలాల్ భార్య‌, కుమారుడు పొలం వ‌ద్ద‌కు రాగానే పాలిథీన్ సంచి క‌నిపించింది. సంచిని తెరిచి చూడ‌గా.. రూ. 500 నోట్లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. నోట్ల‌కు చెద‌లు ప‌ట్టాయి.. తునాతున‌క‌ల‌య్యాయి. వాట‌న్నింటిని మూట‌గ‌ట్టుకుని స్థానిక ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ల‌గా.. నోట్లన్నీ ప‌నికిరాని స్థితిలో ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని బ్యాంకు అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని మంగీలాల్‌కు సూచించారు. వారు కూడా రైతుకు ఎలాంటి స‌హాయం చేయ‌లేక‌పోయారు. దీంతో మంగీలాల్ తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యాడు.

Advertisement
Advertisement