త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

World Asthma Day 2026 | వ‌ర‌ల్డ్ ఆస్త‌మా డే.. ఈ స‌మ‌స్య‌కు ఇంట్లోని ఈ వ‌స్తువులే ప్ర‌ధాన‌ కార‌ణాల‌ని తెలుసా..?

World Asthma Day 2026 | ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారాన్ని వ‌రల్డ్ ఆస్తమా డేగా నిర్వహిస్తూ వ‌స్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాల శ్వాస సంబంధిత వ్యాధి అయిన ఆస్తమాపై అవగాహన పెంచడం ఈ రోజు ప్రధాన లక్ష్యం. ఈ రోజును 1998లో గ్లోబ‌ల్ ఇనిషియేటివ్ ఫ‌ర్ ఆస్త‌మా ప్రారంభించింది.

S

Lifestyle | Published On May 5, 2026, 5.09 pm IST

World Asthma Day 2026 | వ‌ర‌ల్డ్ ఆస్త‌మా డే.. ఈ స‌మ‌స్య‌కు ఇంట్లోని ఈ వ‌స్తువులే ప్ర‌ధాన‌ కార‌ణాల‌ని తెలుసా..?
Advertisement

World Asthma Day 2026 | ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారాన్ని వ‌రల్డ్ ఆస్తమా డేగా నిర్వహిస్తూ వ‌స్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాల శ్వాస సంబంధిత వ్యాధి అయిన ఆస్తమాపై అవగాహన పెంచడం ఈ రోజు ప్రధాన లక్ష్యం. ఈ రోజును 1998లో గ్లోబ‌ల్ ఇనిషియేటివ్ ఫ‌ర్ ఆస్త‌మా ప్రారంభించింది. ఆస్తమా లక్షణాలు, కారణాలు, నియంత్రణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంపు దీని ముఖ్యం ఉద్దేశ్యంగా నిర్ణ‌యించారు. సాధారణంగా ఆస్తమా లక్షణాలు ఎక్కువైతే, చాలా మంది కాలుష్యం, పుప్పొడి, వాతావరణ మార్పులే కార‌ణ‌మ‌ని భావిస్తారు. అయితే నిపుణులు తెలిపిన ప్రకారం అనేక ప్రమాదకర కారణాలు ఇంటి లోపలే ఉంటాయి. ఇవి తెలియకుండానే సమస్యను పెంచుతుంటాయి.

దుమ్ము, డ‌స్ట్ మైట్స్‌, ఇండోర్ మోల్డ్‌..

ఇంటి దుమ్ములో ఉండే చిన్న జీవులు (డస్ట్ మైట్స్) అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి. ఇవి సోఫాలు, కార్పెట్లు, మంచాల‌ వంటి వస్తువుల్లో ఎక్కువగా పెరుగుతాయి. వీటి వ్యర్థాలు గాలిలో కలిసినప్పుడు రాత్రి సమయంలో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వీజింగ్ (గుర‌గుర‌) వంటి సమస్యలు పెరుగుతాయి. ఇండోర్ మోల్డ్ కూడా ఒక ప్రధాన కారణం. బాత్రూమ్‌లు, తడిగా ఉండే వంటగదులు వంటి ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. కనిపించకపోయినా గాలిలో ఉన్న మోల్డ్ స్పోర్స్ శ్వాసనాళాలను ప్ర‌భావితం చేసి ఆస్తమా అటాక్‌కు దారితీస్తాయి. క్లీనింగ్ ప్రొడక్ట్స్, ఎయిర్ ఫ్రెషెనర్లు కూడా ప్రమాదకరం. వీటిలో ఉండే కెమికల్స్, సువాసనలు శ్వాసనాళాలను ఇబ్బంది పెట్టి సమస్యను పెంచుతాయి. శుభ్రంగా ఉందని అనుకునే వాతావరణం కూడా కొన్నిసార్లు హానికరంగా మారుతుంది.

ఏసీల్లోని ఫిల్ట‌ర్లు, పిల్ల‌ల ఆట వ‌స్తువులు..

ఇటీవలి కాలంలో ఎయిర్ కండిషనర్‌ల‌ వినియోగం పెరగడంతో కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. ఫిల్టర్లు శుభ్రం చేయకుండా ఉపయోగిస్తే బ్యాక్టీరియా, దుమ్ము, అలర్జెన్స్ గాలిలో వ్యాపిస్తాయి. అలాగే అగరబత్తులు, కొవ్వొత్తులు, వంటలో వచ్చే పొగ కూడా సరైన గాలి ప్రవాహం లేకపోతే శ్వాసకు హానికరంగా మారుతుంది. దిండ్లు, కర్టెన్లు, సాఫ్ట్ టాయ్స్ వంటి వస్తువుల్లో కూడా అలర్జెన్స్ పేరుకుపోతాయి. పెంపుడు జంతువుల రోమాలు గాలిలో తేలుతూ ఉండి గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ఇంట్లో సరైన గాలి ప్రసరణ లేకపోతే కాలుష్య పదార్థాలు, అలర్జెన్స్ నిల్వ ఉంటాయి. బయటకు శుభ్రంగా కనిపించినా, లోపల గాలి నాణ్యత తగ్గి లక్షణాలు తీవ్రమవుతాయి.

అగ‌ర‌బ‌త్తులు, హెయిర్ డై..

పెస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత లేదా అగరబత్తులు ఉపయోగించినప్పుడు కూడా కొంతమందిలో ఆస్తమా తీవ్రంగా మారిన ఘటనలు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో హెయిర్ డై వాడిన తర్వాత కూడా ప్రమాదకర ప్రతిక్రియలు కనిపించాయి. అందుకే ప్రతి వ్యక్తి తనకు ప్రత్యేకంగా ఏవి ట్రిగ్గర్లు అనేది గుర్తించాలి. ఆస్తమాను నియంత్రించాలంటే మందులు మాత్రమే సరిపోవు. దాగి ఉన్న కారణాలను గుర్తించడం ముఖ్యం. ఏసీల‌లో ఎయిర్ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచడం, ఇంట్లో తడి లేకుండా చూసుకోవడం, బెడ్డింగ్‌ను వేడి నీటితో కడగడం, సరైన వెంటిలేషన్ కల్పించడం వంటి చర్యలు అలర్జెన్స్‌ను తగ్గిస్తాయి. లక్షణాలు ఎప్పుడు పెరుగుతున్నాయో గమనించడం కూడా కీలకం. ఇంట్లో లేదా కొన్ని కార్యకలాపాల సమయంలో సమస్య పెరిగితే, అది ఇండోర్ ట్రిగ్గర్ సంకేతంగా భావించాలి.

వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా నిపుణులు ముఖ్య‌మైన విష‌యాన్ని స్ప‌ష్టంగా చెబుతున్నారు. బయట కాలుష్యాన్ని నివారించడం ఎంత అవసరమో, ఇంట్లో సురక్షిత వాతావరణం కల్పించడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలని అంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement