త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WHO | ఒజెంపిక్ లాంటి మందుల వాడ‌కంపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ముఖ్య‌మైన సూచ‌న‌లు

S

Health | Published On Dec 16, 2025, 1.42 pm IST

WHO | ఒజెంపిక్ లాంటి మందుల వాడ‌కంపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ముఖ్య‌మైన సూచ‌న‌లు
Advertisement

WHO | డెన్మార్క్‌కు చెందిన నోవోనోర్డిస్క్ అనే కంపెనీ ఇటీవ‌లే భార‌త్‌లో ఒజెంపిక్ అనే మెడిసిన్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. ఈ మెడిసిన్ ఇప్ప‌టికే రైబెల్‌సెస్ పేరిట ట్యాబ్లెట్ల రూపంలో ప‌లు ర‌కాల డోసుల్లో అందుబాటులో ఉంది. అయితే దీన్ని ఇంజెక్ష‌న్ రూపంలో ఒజెంపిక్ పేరిట భార‌త్‌లో విడుద‌ల చేశారు. ట్యాబ్లెట్లు 3ఎంజీ, 7ఎంజీ, 14ఎంజీ డోసుల్లో అందుబాటులో ఉండ‌గా వీటిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒజెంపిక్ అయితే వారానికి ఒక డోసు తీసుకోవాలి. ఈ ఇంజెక్ష‌న్ 0.25, 0.5, 1 ఎంజీ డోసుల్లో అందుబాటులో ఉంది. ఈ రెండు మెడిసిన్ల‌లోనూ సెమాగ్లుటైడ్ అనే డ్ర‌గ్ ఉంటుంది. ఇది జీఎల్‌పీ-1 ర‌కానికి చెందిన టైప్ 2 డ‌యాబెటిస్‌, వెయిట్ లాస్ ఔష‌ధం. అయితే ఈ మందుల వాడ‌కంపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా ముఖ్య‌మైన సూచ‌న‌లు చేస్తూ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఒబెసిటీ (స్థూల‌కాయం)తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. దీని వ‌ల్ల టైప్ 2 డయాబెటిస్ రావ‌డంతోపాటు గుండె జ‌బ్బులు కూడా సంభ‌విస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఒబెసిటీ, టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి సెమాగ్లుటైడ్ ఒక వ‌రంగా మారింది. ఈ మెడిసిన్‌ను తీసుకుంటే శ‌రీర బ‌రువులో క‌నీసం 15 నుంచి 25 శాతం వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా గ‌ణ‌నీయంగా నియంత్ర‌ణ‌లో ఉంటాయి. దీనికి తోడు దీర్ఘ‌కాలంలో గుండె సంబంధ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక‌నే చాలా మంది వైద్యులు ఈ మెడిసిన్‌ను త‌మ పేషెంట్ల‌కు ఇస్తున్నారు. అయితే ఈ మెడిసిన్లు జీఎల్‌పీ-1 ర‌కానికి చెందిన‌వి కాగా, ఈ విభాగంలో ప‌లు ఇత‌ర మెడిసిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. లిరాగ్లుటైడ్‌, టైర్జెప‌టైడ్ పేరిట ప‌లు ర‌కాల మందుల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్నారు. ఇవ‌న్నీ దాదాపు ఒకేవిధంగా ప‌నిచేస్తాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను సైతం నియంత్రిస్తాయి. దీంతో ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మందుల వాడ‌కం పెరిగింది.

అయితే జీఎల్‌పీ-1 ర‌కానికి చెందిన మందులు అన్నీ చాలా ఖ‌రీదు క‌ల‌వి. అందువ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా వీటిని ప్ర‌స్తుతం కేవ‌లం 10 శాతం లోపు ఉన్న ప్ర‌జ‌లే వాడుతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలియ‌జేసింది. కానీ ఒబెసిటీ, టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందికి ఉన్నందున పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు కూడా ఈ మందులు అందుబాటులోకి రావ‌ల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని ఆ సంస్థ అభిప్రాయ‌ప‌డింది. ఈ మందుల‌ను త‌యారు చేస్తున్న కంపెనీలు ధ‌ర‌ల‌ను మ‌రింత త‌గ్గించి మందుల‌ను ఇవ్వాల‌ని, లేదా ప్ర‌భుత్వాలు ఈ విష‌యం ప‌ట్ల చొర‌వ తీసుకుని సామాన్య ప్ర‌జ‌ల‌కు కూడా ఈ మందులు అందుబాటులో ఉండేలా చూడాల‌ని కోరింది. ఇక జీఎల్‌పీ-1 ర‌కానికి చెందిన మందుల‌ను వైద్యులు అడ్డ‌గోలుగా రోగుల‌కు ఇవ్వ‌వ‌ద్ద‌ని, వారికి ఈ మందుల‌ను సూచించ‌డంతోపాటు వారు నిత్యం వ్యాయామం చేసేలా, స‌రైన డైట్ పాటించేలా వైద్యులు చూడాల‌ని, అప్పుడే ఈ మెడిసిన్‌ల‌ను కాంబినేష‌న్ థెర‌పీగా రోగుల‌కు ఇవ్వాల‌ని సూచించింది. అవ‌స‌రం లేక‌పోయినా ఈ మందుల‌ను ఇస్తే రోగులు దుష్ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement