Vitamin B12 Deficient | ఆందోళనకర స్థాయిలో విటమిన్ బీ12 లోపం..!
Vitamin B12 Deficient | దేశంలో పోషకాహార లోపం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ బీ12 కొరత అన్ని వయసుల వారినీ వేధిస్తోంది. ప్రతి ముగ్గురు కౌమారదశ పిల్లల్లో దాదాపు ఇద్దరు ఈ పోషక లోపంతో బాధపడుతున్నట్లు తాజా జాతీయ స్థాయి సర్వే వెల్లడించింది. పెద్దల్లోనూ సగానికి పైగా మందికి విటమిన్ బీ12 స్థాయి తక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
- ప్రతి ముగ్గురు కౌమారదశ పిల్లల్లో ఇద్దరికి పోషక లోపం
- పెద్దల్లోనూ అదే పరిస్థితి.. గర్భిణుల్లో 63.1 శాతం మందికి విటమిన్ కొరత
- ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ సర్వేలో వెల్లడి
Vitamin B12 Deficient | దేశంలో పోషకాహార లోపం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ బీ12 కొరత అన్ని వయసుల వారినీ వేధిస్తోంది. ప్రతి ముగ్గురు కౌమారదశ పిల్లల్లో దాదాపు ఇద్దరు ఈ పోషక లోపంతో బాధపడుతున్నట్లు తాజా జాతీయ స్థాయి సర్వే వెల్లడించింది. పెద్దల్లోనూ సగానికి పైగా మందికి విటమిన్ బీ12 స్థాయి తక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గర్భిణులు, బాలింతల్లోనూ ఈ లోపం ఎక్కువగా ఉన్నది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ సర్వేలో ఈ కీలక అంశాలు వెలుగుచూశాయి.
కౌమారదశలోనే అధిక లోపం
భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం.. 10–19 ఏళ్ల మధ్య వయసున్న బాలికల్లో 65.4 శాతం, బాలురలో 66.1 శాతం మందికి విటమిన్ బీ12 లోపం ఉన్నట్లు తేలింది. అంటే కౌమారదశలో ఉన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరికి సరిపడా విటమిన్ బీ12 అందడం లేదన్నమాట. ఎదుగుదల, శారీరక ఆరోగ్యానికి కీలకమైన ఈ దశలో ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు పోషక లోపంతో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం పిల్లలకే పరిమితం కాలేదు. పని చేసే వయసులో ఉన్న పెద్దల్లోనూ ఈ సమస్య విస్తృతంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 20–59 ఏళ్ల మహిళల్లో 55.2 శాతం, పురుషుల్లో 60.4 శాతం మందిలో తక్కువగా ఉన్నట్లు తేలింది. 60 ఏళ్లు పైబడిన మహిళల్లోనూ 41.2 శాతం మందికి ఈ లోపం ఉన్నట్లు గుర్తించారు. అంటే వయసుతో సంబంధం లేకుండా వివిధ వర్గాల ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
పట్టణాలు.. పల్లెల్లోనూ ఇదే పరిస్థితి
గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య బీ12 లోపం గణాంకాల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ.. రెండు ప్రాంతాల్లోనూ సమస్య తీవ్రంగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని కౌమారదశ బాలికల్లో 66.5 శాతం మందికి ఈ లోపం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 61.7 శాతంగా నమోదైంది. మరోవైపు బాలురలో పట్టణ ప్రాంతాల్లో 68.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 65.3 శాతం మందికి విటమిన్ బి12 కొరత ఉన్నట్లు సర్వే గుర్తించింది. దీంతో ఈ సమస్య ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. చిన్న వయసులోనే విటమిన్ బీ12 కొరత కనిపిస్తోంది. 5–9 ఏళ్ల పిల్లల్లో 46.5 శాతం మందికి, 12–59 నెలల వయసున్న చిన్నారుల్లో 37.3 శాతం మందికి ఈ లోపం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. బాల్యంలోనే తగినంత పోషకాహారం అందకపోవడం భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. గర్భిణులు, బాలింతల్లో విటమిన్ బీ12 లోపం మరింత ఆందోళన కలిగిస్తోంది. గర్భిణుల్లో ఏకంగా 63.1 శాతం మందికి ఈ లోపం ఉన్నట్లు సర్వే గుర్తించింది. బాలింతల్లోనూ 51.8 శాతం మందికి విటమిన్ బి12 స్థాయులు తక్కువగా నమోదయ్యాయి. గర్భధారణ, ప్రసవానంతర దశల్లో తల్లుల పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ స్థాయిలో సర్వే
2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 183 జిల్లాల నుంచి 81 వేలకు పైగా కుటుంబాలకు చెందిన రెండు లక్షలకు పైగా ప్రజలను ఇందులో భాగస్వాములను చేశారు. వివిధ వయసులు, లింగాల వారీగా పోషక స్థితిని అంచనా వేసేందుకు 1.70 లక్షలకు పైగా రక్త నమూనాలను పరీక్షించారు. రక్తంలో విటమిన్ బీ12 స్థాయి మిల్లీలీటర్‌కు 203 పికోగ్రాముల కంటే తక్కువగా ఉంటే దాన్ని లోపంగా ఐసీఎంఆర్ పరిగణలోకి తీసుకుంది. దేశంలో విటమిన్ బీ12 లోపం అన్ని వయసుల వారిలోనూ విస్తృతంగా ఉందని ఈ సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కౌమారదశ పిల్లలు, గర్భిణులు, బాలింతలు, పని చేసే వయసులో ఉన్న పెద్దల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. కేవలం ఆహారం తీసుకోవడమే కాకుండా.. అందులో శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం గుర్తుచేస్తోంది. పోషకాహార లభ్యత, ఆహార వైవిధ్యం, విటమిన్ బీ12 స్థాయులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ప్రజారోగ్య కార్యక్రమాల్లోనూ వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rashtrapati Nilayam | రాష్ట్రపతి నిలయం సందర్శనకు బ్రేక్.. జనవరి 2 నుంచి అనుమతి..!
- ●CMC | ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్‌కు నవంబర్ 30 డెడ్‌లైన్
- ●IPL 2027 | పంజాబ్ కింగ్స్‌లో కీలక మార్పులు.. ఫీల్డింగ్ కోచ్‌గా రాజీవ్ కుమార్..
- ●Mrunal Thakur | బ్లాక్ సూట్లో మృణాల్ ఠాకూర్.. స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న సీతారామం బ్యూటీ!
- ●OTT Release This Week | ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఆరు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ..!
- ●BCCI | సిరాజ్ ఎంపికపై బీసీసీఐ క్లారిటీ.. తుది నిర్ణయం వారిదేనంటూ..!

Rashtrapati Nilayam | రాష్ట్రపతి నిలయం సందర్శనకు బ్రేక్.. జనవరి 2 నుంచి అనుమతి..!

CMC | ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్‌కు నవంబర్ 30 డెడ్‌లైన్

IPL 2027 | పంజాబ్ కింగ్స్‌లో కీలక మార్పులు.. ఫీల్డింగ్ కోచ్‌గా రాజీవ్ కుమార్..

Mrunal Thakur | బ్లాక్ సూట్లో మృణాల్ ఠాకూర్.. స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న సీతారామం బ్యూటీ!



