త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sprouts | రోజూ ఉద‌యం మొల‌క‌ల‌ను బ్రేక్ ఫాస్ట్‌లాగా తినండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

Sprouts | మొలకలు చూడటానికి చాలా సాధారణంగా క‌నిపిస్తాయి. కానీ ఆరోగ్య పరంగా అవి అందించే లాభాలు మాత్రం అద్భుత‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. రోజూ ఉదయమే మొలకలతో బ్రేక్‌ఫాస్ట్ ప్రారంభిస్తే శరీరానికి  ఎంతో మేలు జ‌రుగుతుంది. ఇవి జీర్ణాశ‌యంలోకి చేరిన అనంత‌రం చాలా తేలికైన ఫీలింగ్‌ను క‌లిగిస్తాయి.

S

Health | Published On Jan 20, 2026, 9.19 am IST

Sprouts | రోజూ ఉద‌యం మొల‌క‌ల‌ను బ్రేక్ ఫాస్ట్‌లాగా తినండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..
Advertisement

Sprouts | మొలకలు చూడటానికి చాలా సాధారణంగా క‌నిపిస్తాయి. కానీ ఆరోగ్య పరంగా అవి అందించే లాభాలు మాత్రం అద్భుత‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. రోజూ ఉదయమే మొలకలతో బ్రేక్‌ఫాస్ట్ ప్రారంభిస్తే శరీరానికి  ఎంతో మేలు జ‌రుగుతుంది. ఇవి జీర్ణాశ‌యంలోకి చేరిన అనంత‌రం చాలా తేలికైన ఫీలింగ్‌ను క‌లిగిస్తాయి. ఉద‌యం సాధార‌ణంగా మ‌నం తినే అల్పాహారం చాలా వ‌ర‌కు భారంగా అనిపిస్తుంది. కానీ మొల‌క‌ల‌ను తింటే చాలా లైట్ ఫీలింగ్ క‌లుగుతుంది. అలాగే తాజా రుచిని కూడా అందిస్తాయి. మొల‌క‌లు శ‌రీరానికి అవ‌స‌రం అయిన శ‌క్తిని రోజంతా నిరంత‌రాయంగా అందిస్తూనే ఉంటాయి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద‌యం మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల రోజంతా చురుగ్గా ఉండ‌వ‌చ్చ‌ని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఫైబర్‌, ప్రోటీన్లు..

మొలకలలో ఉండే ఫైబర్, ప్రోటీన్ల‌ కారణంగా వాటిని తిన్న త‌రువాత‌ ఎక్కువసేపు ఉన్నా కూడా ఆకలి అనిపించదు. ఉదయం తిన్నాక మధ్యాహ్నం వరకు చిన్న చిన్న స్నాక్స్ కోసం వెతకాల్సిన అవసరం తగ్గుతుంది. జీర్ణక్రియకు కూడా ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. జీర్ణ వ్య‌వ‌స్థ‌కు భారంగా కాకుండా పేగులకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతేకాదు, విటమిన్లు, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. మొలకలతో వంటలు చేయడం కూడా చాలా సులభం. సలాడ్‌లుగా తినొచ్చు, స్వల్పంగా వేడి చేసి మసాలాలతో కలిపి తీసుకోవచ్చు లేదా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి నేరుగా తిన‌వ‌చ్చు. తక్కువ క్యాలరీలు ఉండటం, ఎక్కువ పోషకాలు అందించడం వల్ల ఇవి తేలికపాటి బ్రేక్‌ఫాస్ట్‌గా ప‌నిచేస్తాయి. అలాగే ఎక్కువ సేపు పొట్ట నిండిన భావనను కూడా క‌లిగిస్తాయి. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇలా బ‌రువును త‌గ్గించుకోవ‌డం కూడా తేలిగ్గా ఉంటుంది.

వీటిని ట్రై చేయండి..

ఇక ఉద‌యం తినాల్సిన ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో మొల‌క‌లు ఒక‌టిగా పేరుగాంచాయి. ఇందుకు గాను పెస‌ర‌ మొల‌క‌ల‌ను తీసుకుని వాటిల్లో తరిగిన టమాటా, కీర‌దోసకా, ఉల్లిపాయ ముక్క‌లు వేసి కలిపి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా చల్లి, నిమ్మరసం పిండితే ఎంతో రుచిక‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతుంది. దీన్ని చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. పెద్ద స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. ఇక అవ‌స‌రం అనుకుంటే ఈ మిశ్ర‌మంపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ చ‌ల్లి కూడా తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చివరగా కొత్తిమీర చల్లి కలిపితే తాజాగా, కరకరలాడే రుచితో కూడిన ఆరోగ్యకరమైన అల్పాహారం రెడీ అవుతుంది. ఇక మసాలా రుచులు ఇష్టపడేవారికి మొలకల స్టిర్ ఫ్రై చ‌క్క‌ని రుచిని అందిస్తుంది. కొద్దిగా నూనెలో జీలకర్ర వేయించి, ఉల్లిపాయ, టమాటా ముక్క‌లు వేసి పసుపు, కారం, ఉప్పు కలిపి వేగిన‌ తరువాత మొలకలను కలిపి స్వల్పంగా వేయించాలి. ఎక్కువగా ఉడికించకుండా కొంచెం కరకరలాడేలా ఉంచితే రుచిగా ఉంటుంది. చివరగా నిమ్మరసం, కొత్తిమీర కలిపితే వేడి వేడి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతుంది.

అల‌వాటు చేసుకుంటే చాలా సుల‌భం..

రోజూ ఉదయం మొలకలను తినడం చాలా మందికి వీలు కాక‌పోవ‌చ్చు. కానీ వాటి ప్రభావం గురించి తెలిస్తే మాత్రం రోజూ మొల‌క‌ల‌ను భిన్న ర‌కాలుగా వండి తింటారు. మొల‌క‌ల వ‌ల్ల జీర్ణక్రియ మెరుగుపడటం నుంచి మనసుకు ప్రశాంతత వ‌ర‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అలాగే శరీరానికి శక్తి అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆధునిక జీవనశైలిలో ఇబ్బందిక‌ర‌మైన డైట్ ప్లాన్లతో స‌త‌మ‌తం అయ్యే వారు  రోజూ మొల‌క‌ల‌ను బ్రేక్‌ఫాస్ట్ లో భాగం చేసుకుంటే దాంతో రోజువారి దిన‌చ‌ర్య చాలా సుల‌భ‌త‌రం అవుతుంది. రోజూ ఏం బ్రేక్ ఫాస్ట్ చేయాలి అని ఆలోచించే వారు మొల‌క‌ల‌ను ఎంచుకుంటే ఇక‌పై అందుకోసం ఆలోచించాల్సిన ప‌ని ఉండ‌దు. చాలా త్వ‌ర‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసి తినేయ‌వ‌చ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. పోష‌కాలు, శ‌క్తి కూడా ల‌భిస్తాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement