త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bone Cancer | దేశంలో పెరుగుతున్న బోన్ క్యాన్స‌ర్ కేసులు.. అల‌ర్ట్‌గా ఉండాలంటున్న వైద్యులు.. ల‌క్ష‌ణాలు ఏమిటంటే..?

S

Lifestyle | Published On Dec 16, 2025, 5.07 pm IST

Bone Cancer | దేశంలో పెరుగుతున్న బోన్ క్యాన్స‌ర్ కేసులు.. అల‌ర్ట్‌గా ఉండాలంటున్న వైద్యులు.. ల‌క్ష‌ణాలు ఏమిటంటే..?
Advertisement

Bone Cancer | క్యాన్స‌ర్ అనేది మన శ‌రీరానికి అనేక ర‌కాలుగా వ‌స్తుంది. శ‌రీరంలోని అనేక భాగాల‌కు ఇది రావడాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. స‌రైన స‌మ‌యంలో చికిత్స తీసుకోకపోతే శ‌రీరంలోని అన్ని భాగాల‌కు వ్యాప్తి చెందుతుంది. దీంతో ప‌రిస్థితి ప్రాణాంత‌కంగా మారుతుంది. అయితే అన్ని క్యాన్స‌ర్ల మాదిరిగానే బోన్ క్యాన్స‌ర్ కూడా ఒక‌టి. ఇది కూడా చాలా మందికి ప్ర‌స్తుతం వ్యాప్తి చెందుతోంది. దేశంలో ప‌లు చోట్ల ప్ర‌స్తుతం బోన్ క్యాన్స‌ర్ బాధితుల సంఖ్య పెరుగుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ మేర‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా ఎస్ఎన్ మెడిక‌ల్ కాలేజీకి చెందిన ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్ట‌ర్ అమృత్ గోయల్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. బోన్ క్యాన్స‌ర్ ప‌ట్ల అల‌ర్ట్‌గా ఉండాల‌ని ఆయ‌న సూచిస్తున్నారు.

ఈ వ‌య‌స్సుల వారికి..

బోన్ క్యాన్స‌ర్ ప్ర‌స్తుతం రెండు ర‌కాల వ‌య‌స్సుల వారికి ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు. చిన్నారుల‌తోపాటు వృద్ధులు అధికంగా ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నార‌ని అన్నారు. బోన్ క్యాన్సర్ వ‌చ్చిన వారిలో ఆరంభంలోనే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. తీవ్ర‌మైన ఎముక‌ల నొప్పి, ఆ ప్రాంతంలో వాపులు రావ‌డం, ఆ భాగ‌మంతా చాలా సున్నితంగా మార‌డం, ఎముక‌లు సుల‌భంగా విరిగిపోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఇవి క‌నిపిస్తే క‌చ్చితంగా ఎముక‌ల క్యాన్స‌ర్ ఉన్న‌ట్లే అని ఆయ‌న తెలిపారు. అయితే ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ చాలా మంది ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేస్తార‌ని పేర్కొన్నారు.

ఆలస్యం చేయ‌వ‌ద్దు..

ఆయా స‌మ‌స్య‌లు ఉన్న చాలా మంది సాధార‌ణ నొప్పి అనుకుని అందుబాటులో ఉండే పెయిన్ కిల్ల‌ర్ ట్యాబ్లెట్ల‌ను వాడుతార‌ని లేదా ఇంటి చిట్కాల‌ను పాటిస్తార‌ని డాక్ట‌ర్ గోయ‌ల్ అన్నారు. అయితే అస‌లు బోన్ క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు ప్ర‌ధాన కార‌ణానికి చికిత్స చేయ‌కుండా నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఎలాంటి చికిత్స చేసినా వృథాయే అని అన్నారు. దీని వ‌ల్ల నొప్పి తాత్కాలికంగా త‌గ్గినా మ‌ళ్లీ వ‌స్తుంద‌ని, క‌నుక ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వాల‌ని, ప‌రీక్ష‌లు చేయించుకుని ఏదైనా స‌మ‌స్య ఉంటే వెంట‌నే చికిత్స తీసుకోవాల‌ని సూచించారు. క్యాన్స‌ర్ అనేది ప్రారంభంలో ఉంటే సుల‌భంగా చికిత్సను అందించ‌వ‌చ్చ‌ని అన్నారు.

చికిత్స సుల‌భ‌మే.. కానీ..

బోన్ క్యాన్స‌ర్ పిల్ల‌లు, వృద్ధుల్లో వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు. పిల్లల్లో 18 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు వారి ఎముక‌లు పెరుగుతూ, నిర్మాణం అవుతూనే ఉంటాయి. క‌నుక బోన్ క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ వారిలో అధికంగా ఉంటుంద‌ని తెలిపారు. ఇక 60 ఏళ్లు పైబ‌డిన వారిలోనూ ఈ రిస్క్ అధికంగా ఉంటుంద‌ని, వారికి క్యాన్స‌ర్ వ‌స్తే ఆ వ్యాధి చాలా త్వ‌ర‌గా వృద్ధి చెందుతుంద‌ని అన్నారు. క‌నుక ఇరు వ‌య‌స్సుల వారు ఈ వ్యాధి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. చిన్నారుల్లో బోన్ క్యాన్స‌ర్ వ‌స్తే దాన్ని ముందుగానే గుర్తిస్తే చికిత్స‌ను అందించ‌డం చాలా సుల‌భ‌మ‌ని, వారు చాలా త్వ‌ర‌గా కోలుకుంటార‌ని చెప్పారు. ఇక వృద్ధుల్లో ఈ వ్యాధి వ‌స్తే వారికి చికిత్స‌ను అందించ‌డం కాస్త క‌ష్ట‌మ‌వుతుంద‌ని, కొన్ని సార్లు క్యాన్స‌ర్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు గాను క్యాన్స‌ర్ వ‌చ్చిన ఎముక‌ను తొల‌గించాల్సి వ‌స్తుంద‌ని, ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అన్నారు. క‌నుక బోన్ క్యాన్స‌ర్ వ్యాధి ల‌క్ష‌ణాల ప‌ట్ల అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement