త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brown Bananas | బ్రౌన్ క‌ల‌ర్ అరటిపండ్లు తింటే ప్రమాదమా? నిజం ఏంటో తెలుసా!

Brown Bananas | అర‌టి పండ్ల గురించి సాధార‌ణంగా చాలా మందికి అనేక అపోహ‌లు ఉంటాయి. ముఖ్యంగా అరటిపండు తొక్కపై నల్లని మచ్చలు రావడం లేదా పూర్తిగా బ్రౌన్ రంగులోకి మారడం చూసి చాలామంది అది పాడైందని భావిస్తారు. కానీ ప్రతి సారి అలా కాదు. చాలా సందర్భాల్లో బ్రౌన్ అరటిపండ్లు పూర్తిగా తినడానికి సేఫ్‌గా ఉంటాయి.

S

Lifestyle | Published On May 13, 2026, 1.56 pm IST

Brown Bananas | బ్రౌన్ క‌ల‌ర్ అరటిపండ్లు తింటే ప్రమాదమా? నిజం ఏంటో తెలుసా!
Advertisement

Brown Bananas | అర‌టి పండ్ల గురించి సాధార‌ణంగా చాలా మందికి అనేక అపోహ‌లు ఉంటాయి. ముఖ్యంగా అరటిపండు తొక్కపై నల్లని మచ్చలు రావడం లేదా పూర్తిగా బ్రౌన్ రంగులోకి మారడం చూసి చాలామంది అది పాడైందని భావిస్తారు. కానీ ప్రతి సారి అలా కాదు. చాలా సందర్భాల్లో బ్రౌన్ అరటిపండ్లు పూర్తిగా తినడానికి సేఫ్‌గా ఉంటాయి. అంతేకాదు, కొన్ని పోషక ప్రయోజనాలు కూడా అందిస్తాయి. అసలు విషయం ఏమిటంటే సహజంగా పండిపోవడం, నిజంగా పాడవడం మధ్య తేడా తెలుసుకోవాలి. 2019లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం అరటిపండ్లు పండే సమయంలో ఎథిలీన్ గ్యాస్ విడుదల అవుతుంది. ఈ గ్యాస్ వల్ల తొక్కలోని పసుపు రంగు పిగ్మెంట్లు క్రమంగా తగ్గిపోతూ చివరికి తొక్క బ్రౌన్ రంగులోకి మారుతుంది.

ఎందుకు బ్రౌన్ అవుతాయి?

అరటిపండ్లు పండే ప్రక్రియలో సహజంగానే రంగు మారుతాయి. మొదట గ్రీన్‌గా ఉండే తొక్క, తర్వాత పసుపు రంగులోకి మారి, చివరికి బ్రౌన్ మచ్చలు ఏర్పడతాయి. దీనికి కారణం క్లోరోఫిల్ విచ్ఛిన్నం కావడం, పండులో చక్కెర శాతం పెరగడం. అరటిపండ్లు పండే సమయంలో స్టార్చ్ సహజ చక్కెరలుగా మారుతుంది. పండు మరింత మృదువుగా, తియ్యగా మారుతుంది. తొక్కపై బ్రౌన్ మచ్చలు కనిపించడం మొదలవుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా సహజం. కాబట్టి బ్రౌన్ మచ్చలు వచ్చాయని మాత్రమే పండు పాడైందని అనుకోకూడ‌దు.

తినడానికి ఎప్పుడు సేఫ్?

జర్నల్ ప్లాస్ వన్ లో ప్రచురితమైన మరో అధ్యయనం ప్రకారం బాగా పండిన అరటిపండ్లు యాంటీ ఆక్సిడెంట్లు, గుండె ఆరోగ్య రక్షణ, అథ్లెట్లకు తక్షణ శక్తి వంటి ప్రయోజనాల‌ను అందిస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే సోల్యూబుల్ షుగర్స్ శరీరానికి త్వరగా ఎనర్జీ ఇస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే బ్రౌన్ అరటిపండును ఇంకా సేఫ్‌గా చెప్ప‌వ‌చ్చు. లోపల భాగం క్రీమీ లేదా లైట్ బ్రౌన్ రంగులో ఉండాలి. చెడు వాసన లేదా ఫెర్మెంటెడ్ (పులిసిన‌) వాసన ఉండకూడదు. మృదువుగా ఉండాలి కానీ జిగురు లాగా కాకూడదు. ఎక్కడా ఫంగస్ కనిపించకూడదు. ఇలాంటి బాగా పండిన‌ అరటిపండ్లను చాలామంది ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా స్మూతీలు, బనానా బ్రెడ్, పాన్‌కేక్స్, ఓట్‌మీల్, డెజర్ట్స్‌లో సహజ తీపి కోసం వాడుతారు.

పోషక విలువల్లో మార్పులు ఉంటాయా?

అరటిపండు పండే కొద్దీ దాని పోషక లక్షణాల్లో స్వల్ప మార్పులు వస్తాయి. పూర్తిగా పండిన అరటిపండ్ల‌లో ఎక్కువ సహజ చక్కెరలు ఉంటాయి. సులభంగా జీర్ణమవుతాయి. ఫైబర్ మృదువుగా మారుతుంద. అయితే ఇవి గ్లైసెమిక్ ప్రభావాన్ని కొంచెం పెంచుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు బాగా పండిన అరటిపండ్లను త‌క్కువ‌గా తినాలి. లేదంటే షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా పెరుగుతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి సాధార‌ణ అర‌టి పండ్లు మేలు చేస్తాయి.

నిజంగా పాడైతే..

ప‌లు లక్షణాలు కనిపిస్తే ఆ అరటిపండును వెంటనే పారేయాలి. బలమైన పుల్లని లేదా ఆల్కహాల్ వాసన వ‌చ్చినా, తొక్క లేదా కాడపై ఫంగస్ క‌నిపించినా, ఎక్కువగా ద్రవం కారడం, లోపల పూర్తిగా నల్లగా కుళ్లిపోవడం, జిగురు లాంటి టెక్స్చర్ ఉండడం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే అలాంటి అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు. ప‌డేయాలి. అవి సహజంగా పండిన‌వి కాద‌ని గుర్తించాలి.

ఆరోగ్య సమస్యల‌ను కలిగిస్తాయా?

సహజంగా పండిన బ్రౌన్ అరటిపండ్లు సాధారణంగా హానికరం కావు. కానీ ఫంగస్ లేదా ఫెర్మెంటేషన్ వచ్చిన పండ్లు తింటే జీర్ణాశ‌యంలో అసౌకర్యం, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ముఖ్యంగా సెన్సిటివ్ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు లేదా షుగర్ తీసుకోవడం నియంత్రించే వారు పూర్తిగా పండిన అరటిపండ్ల కంటే మోస్తరు పండిన అరటిపండ్లను తీసుకోవడం మంచిది. ఇక అర‌టి పండ్లు త్వ‌ర‌గా పాడ‌వ‌కుండా, ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే వాటిపై సూర్య ర‌శ్మి పడకుండా గది ఉష్ణోగ్రతలో ఉంచాలి. ఎథిలీన్ గ్యాస్ విడుదల చేసే ఇతర పండ్ల నుంచి దూరంగా పెట్టాలి. అవసరమైతే ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. తొక్క నల్లబడినా లోపల పండు తాజాగా ఉండే అవకాశం ఉంటుంది.

బ్రౌన్ అరటిపండ్లు అంటే అవి తప్పనిసరిగా పాడయ్యాయని కాదు. ఎక్కువ సందర్భాల్లో అవి కేవలం బాగా పండి క‌నిపిస్తాయి. చెడు వాసన, ఫంగస్, జిగురు లాంటి లక్షణాలు లేకపోతే వాటిని సురక్షితంగా తినవచ్చు. అంతేకాదు, ఇలా బాగా పండిన అరటిపండ్లను ఆరోగ్యకరమైన వంటకాలలో ఉపయోగించడం ద్వారా ఫుడ్ వేస్ట్ కూడా తగ్గించవచ్చు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement