త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hair Problems | ఈ రెండు పోష‌కాల‌ను తీసుకుంటే.. అన్ని ర‌కాల జుట్టు స‌మ‌స్య‌లు మాయం..

Hair Problems | ప్ర‌స్తుతం చాలా మంది జుట్టు రాలిపోయి జుట్టు ప‌లుచ‌బ‌డే స‌మ‌స్య‌తో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం, హార్మోన్ల‌లో వ‌చ్చే హెచ్చు త‌గ్గులు, పోష‌కాల లోపం, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల చాలా మందికి జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.

S

Health | Published On Dec 22, 2025, 3.01 pm IST

Hair Problems | ఈ రెండు పోష‌కాల‌ను తీసుకుంటే.. అన్ని ర‌కాల జుట్టు స‌మ‌స్య‌లు మాయం..
Advertisement

Hair Problems | ప్ర‌స్తుతం చాలా మంది జుట్టు రాలిపోయి జుట్టు ప‌లుచ‌బ‌డే స‌మ‌స్య‌తో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం, హార్మోన్ల‌లో వ‌చ్చే హెచ్చు త‌గ్గులు, పోష‌కాల లోపం, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల చాలా మందికి జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే జుట్టు స‌మ‌స్య‌లు ఉంటే అనేక మంది రాత్రికి రాత్రే ఈ స‌మ‌స్య‌లు త‌గ్గిపోవాల‌ని భావిస్తుంటారు. కానీ ఆయా స‌మ‌స్య‌లు అంత సులభంగా త‌గ్గవు. దీంతో తీవ్ర అసంతృప్తికి గుర‌వుతుంటారు. అయితే డెర్మ‌టాల‌జిస్టులు చెబుతున్న ప్ర‌కారం జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్‌స్టంట్ చిట్కాలు ప‌నికిరావ‌ని, జుట్టు స‌మ‌స్య‌లు ఎందుకు వ‌స్తున్నాయో గుర్తించి అందుకు చికిత్స చేయాల్సి ఉంటుంద‌ని, అప్పుడే దీర్ఘ‌కాలంగా ఉండే జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే శిరోజాల సంర‌క్ష‌ణ‌లో ప‌లు పోష‌కాలు ముఖ్య పాత్ర పోషిస్తాయ‌ని అంటున్నారు. పోష‌కాల లోపం ఉంటే అనేక జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా జుట్టు పెరుగుద‌ల‌కు, సంర‌క్ష‌ణ‌కు రెండు పోష‌కాలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అంటున్నారు.

బ‌యోటిన్‌, జింక్ ఏం చేస్తాయి..?

జుట్టు పెరుగుద‌ల‌తోపాటు జుట్టును సంర‌క్షించేందుకు బ‌యోటిన్ (విట‌మిన్ బి7), జింక్ ఎంతో ముఖ్య పాత్ర‌ను పోషిస్తాయ‌ని కాన్పూర్‌లోని రీజెన్సీ హెల్త్‌కు చెందిన అసోసియేట్ క‌న్స‌ల్టెంట్ అండ్ డెర్మ‌టాల‌జిస్ట్ డాక్ట‌ర్ ప‌వ‌న్ సింగ్ తెలిపారు. ఈ విట‌మిన్‌-మిన‌ర‌ల్ కాంబినేష‌న్ జుట్టుకు ఎంతో స‌హాయం చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. క‌నుక ఈ రెండు పోష‌కాలు త‌ర‌చూ మ‌న‌కు ల‌భించేలా చూసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కాగా మ‌న శిరోజాలు కెరాటిన్ అనే ప్రోటీన్‌తో త‌యార‌వుతాయి. ఇక కెరాటిన్ ఉత్ప‌త్తికి గాను బ‌యోటిన్ స‌హాయం చేస్తుంది. అంటే బ‌యోటిన్ ఉండే ఆహారాల‌ను తీసుకుంటే కెరాటిన్ ఉత్ప‌త్తి పెరిగి త‌ద్వారా శిరోజాలు కూడా ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయ‌న్న‌మాట‌. ఇక జింక్ వ‌ల్ల జుట్టు క‌ణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వ‌ల్ల జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా శిరోజాల దృఢ‌త్వానికి, సంర‌క్ష‌ణ‌కు, పెరుగుద‌ల‌కు బ‌యోటిన్‌, జింక్ మ‌న‌కు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. క‌నుక‌నే ఈ రెండు పోష‌కాల‌ను త‌ర‌చూ తీసుకోవాలని డాక్ట‌ర్ ప‌వ‌న్ సింగ్ సూచించారు.

ట్యాబ్లెట్ల రూపంలోనూ..

బ‌యోటిన్, జింక్ మ‌న‌కు స‌ప్లిమెంట్ల రూపంలోనూ ల‌భిస్తాయి. కానీ వైద్యుల స‌ల‌హా మేర‌కు మాత్ర‌మే, అది కూడా ఆయా పోష‌కాల లోపం ఉంటేనే వాటి స‌ప్లిమెంట్ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీవ్ర దుష్ప‌రిణామాలు ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. బ‌యోటిన్, జింక్ ను మ‌నం మోతాదుకు మించి ట్యాబ్లెట్ల ద్వారా తీసుకుంటే శ‌రీరంలో ఐర‌న్‌తోపాటు ఇత‌ర పోష‌కాల స్థాయిలు మ‌రింత పెరుగుతాయి. దీని వ‌ల్ల తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. క‌నుక ఈ స‌ప్లిమెంట్ల‌ను వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే వాడాల్సి ఉంటుంది. అయితే బ‌యోటిన్‌, జింక్ మ‌న‌కు ప‌లు ప‌దార్థాల ద్వారా స‌హ‌జ‌సిద్ధంగా కూడా ల‌భిస్తాయి. క‌నుక ట్యాబ్లెట్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. ఆయా ఆహారాల‌ను తింటున్నా కూడా ఈ పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు.

ఈ ఆహారాల‌ను తినాలి..

బ‌యోటిన్ మ‌న‌కు కోడిగుడ్డులోని ప‌చ్చ సొన‌, మ‌ట‌న్ లివ‌ర్‌, చేప‌లు, బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్‌, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, ప‌ప్పు దినుసులు, ప‌ల్లీలు, సోయాబీన్‌, చిల‌గ‌డ‌దుంప‌లు, పాల‌కూర‌, బ్రోక‌లీ, పుట్ట‌గొడుగుద‌ల ద్వారా ల‌భిస్తుంది. అలాగే జింక్ మ‌న‌కు మ‌ట‌న్‌, చికెన్‌, చేప‌లు, రొయ్య‌లు, కోడిగుడ్లు, ప‌ప్పు దినుసులు, బీన్స్‌, శ‌న‌గ‌లు, జీడిప‌ప్పు, గుమ్మ‌డి విత్త‌నాలు, అవిసె గింజ‌లు, చియా సీడ్స్‌, తృణ ధాన్యాలు, పాలు, పెరుగు వంటి ఆహారాల ద్వారా ల‌భిస్తుంది. క‌నుక వీటిని రోజువారి డైట్‌లో భాగం చేసుకుంటే త‌ద్వారా బ‌యోటిన్, జింక్‌ను స‌రైన మోతాదులో పొంద‌వ‌చ్చు. దీంతో జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి. అన్ని ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement