త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UEFA Champions League | పారిస్‌లో హింసాత్మ‌కంగా మారిన విజ‌యోత్స‌వాలు.. 416 మందికిపైగా అరెస్ట్‌..!

UEFA Champions League | యూఈఎఫ్ఏ ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో పారిస్ సెయింట్-జర్మైన్ (పీఎస్‌జీ) ఘ‌న విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టు రెండోసారి చాంపియ‌న్స్ లీగ్ టైటిల్‌ను నెగ్గింది. దాంతో అభిమానులు భారీ ఎత్తున వీధుల్లోకి రావ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొల‌న్నాయి. అభిమానుల సంబ‌రాలు కాస్త పారిస్ న‌గ‌రంలో హింసాత్మ‌కంగా మారాయి.

P

International | Published On May 31, 2026, 11.11 am IST

UEFA Champions League | పారిస్‌లో హింసాత్మ‌కంగా మారిన విజ‌యోత్స‌వాలు.. 416 మందికిపైగా అరెస్ట్‌..!
Advertisement

UEFA Champions League | యూఈఎఫ్ఏ ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో పారిస్ సెయింట్-జర్మైన్ (పీఎస్‌జీ) ఘ‌న విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టు రెండోసారి చాంపియ‌న్స్ లీగ్ టైటిల్‌ను నెగ్గింది. దాంతో అభిమానులు భారీ ఎత్తున వీధుల్లోకి రావ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొల‌న్నాయి. అభిమానుల సంబ‌రాలు కాస్త పారిస్ న‌గ‌రంలో హింసాత్మ‌కంగా మారాయి. ప‌లువురు ఆక‌తాయిలు కార్లు, దుకాణాల‌ను ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 416 మందికిపైగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విష‌యాన్ని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పీఎస్‌జీ, ఆర్సెనల్‌ను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే పారిస్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వేలాది మంది అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

పొగ‌లో క‌నిపించ‌ని ఈఫిల్ ట‌వ‌ర్‌..

ఆర్క్ డీ ట్రయంఫ్, షాంప్స్-ఎలిసీస్ పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా గుమికూడి బాణాసంచా పేల్చుతూ, కార్ల హారన్లు మోగిస్తూ సంబరాలు జరుపుకున్నారు. అయితే, కొద్ది సేపటికే పరిస్థితి అదుపు తప్పింది. నగరంలోని పలు ప్రాంతాల్లో అల్లరి మూకలు దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు వాహనాలకు నిప్పుపెట్టాయి. కొన్ని చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించగా.. సీన్ నది ఒడ్డున చెలరేగిన భారీ మంటల నుంచి వచ్చిన పొగతో ఐఫిల్ టవర్ సైతం కనిపించకుండా పోయింది. పారిస్‌లోని విలాసవంతమైన 8వ అరోండిస్‌మెంట్ ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించగా, పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ ఘటనల్లో ఒక పోలీసు అధికారి గాయపడ్డాడు.

ట్రామ్ సేవ‌లు బంద్‌..

నగరాన్ని చుట్టుముట్టే ప్రధాన రింగ్ రోడ్డును కొంతసేపు అభిమానులు దిగ్బంధించినప్పటికీ.. కొద్దిసేప‌టి త‌ర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పీఎస్‌జీ హోం గ్రౌండ్ ‘పార్క్ డెస్ ప్రిన్సెస్’ స్టేడియం పరిసరాల్లో కూడా ఉద్రిక్తత నెలకొంది. సుమారు వెయ్యి మంది అభిమానులను పోలీసులు నియంత్రించగా, సైకిళ్లతో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించారు. స్టేడియం సమీపంలోని ‘లెస్ ఫొంటైన్స్’ రెస్టారెంట్ వద్ద అభిమానులు పోలీసులపై ఫైర్‌క్రాక‌ర్స్ కాల్చిన‌ట్లుగా స్థానిక మీడియా తెలిపింది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పారిస్ ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు మెట్రో స్టేషన్లను మూసివేయగా, కొన్ని ప్రాంతాల్లో బస్సు సర్వీసులను కూడా రద్దు చేశారు. అల్లర్లలో ఆరు వాహనాలు, రెండు వ్యాపార సంస్థలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. మ్యాచ్‌ను పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియంలోని భారీ స్క్రీన్‌లపై వీక్షించేందుకు దాదాపు 50 వేల మంది అభిమానులు హాజరైనట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ పేర్కొంది. ఫైనల్ సందర్భంగా సాధారణం కంటే రెండు లక్షల మంది అదనంగా ప్రజా రవాణా సేవలను వినియోగిస్తారని పారిస్ రవాణా సంస్థ ముందుగానే అంచనా వేసింది.

ఇదే తొలిసారేం కాదు..

ఇదే తరహా ఘటనలు గత ఏడాది కూడా చోటుచేసుకున్నాయి. పీఎస్‌జీ తొలి ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచిన తర్వాత ఫ్రాన్స్ వ్యాప్తంగా 500కుపైగా అరెస్టులు జరిగాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 201 మంది గాయపడ్డారు. ఆ నేపథ్యంలో ఈసారి 22 వేల మంది పోలీసులను దేశవ్యాప్తంగా మోహరించారు. వీరిలో 8 వేల మంది పారిస్ నగరంలోనే విధులు నిర్వహించారు. మూడు వారాల క్రితం పీఎస్‌జీ సెమీఫైనల్లో బాయర్న్ మ్యూనిక్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన సందర్భంగా కూడా అల్లర్లు చోటుచేసుకున్నాయి. అప్పట్లో 127 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఫ్రాన్స్ అధికారులు ఇప్పటికే హెచ్చరించినప్పటికీ, మరోసారి హింస చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement
Advertisement