త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Blue Collar Jobs | అమెరికాకు టెకీలు కాదు.. ప్లంబర్లు కావాలి: ఏఐ కాలంలో మారుతున్న జాబ్ మార్కెట్

ఐటీ ఉద్యోగాల కోతలతో టెకీలు ఆందోళన చెందుతుంటే.. అమెరికా, యూరప్ దేశాల్లో మాత్రం ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఎందుకో తెలుసా?

J

International | Published On Jun 4, 2026, 11.00 pm IST

US Blue Collar Jobs | అమెరికాకు టెకీలు కాదు.. ప్లంబర్లు కావాలి: ఏఐ కాలంలో మారుతున్న జాబ్ మార్కెట్
Advertisement
  • ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ వంటి వైట్-కాలర్ ఉద్యోగాల కంటే బ్లూ-కాలర్ వర్కర్లకు డిమాండ్
  • వచ్చే ఏడాది నాటికి కేవలం అమెరికాలోనే 5.5 లక్షల మంది ప్లంబర్ల కొరత ఏర్పడనుందని తాజా అంచనా
  • వృద్ధాప్య జనాభా పెరుగుతున్న యూరప్, అమెరికా దేశాలు.. ఇండియా నుంచి స్కిల్డ్ లేబర్‌ను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి
  • భారత్‌లో డిగ్రీలు ఉన్నా నిరుద్యోగం పెరుగుతుంటే.. చేతివృత్తుల వారికి మాత్రం డిమాండ్, జీతాలు రికార్డు స్థాయిలో

US Blue Collar Jobs | త్రినేత్ర.న్యూస్ : దశాబ్దాలుగా మన దేశంలో ఒక ట్రెండ్ ఉంది. పిల్లలు ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు లేదా డాక్టర్లు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్ (Job Market) సీన్ రివర్స్ అవుతోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో ప్రముఖ ఐటీ కంపెనీలు వేలాది మంది టెకీలను తొలగిస్తుంటే.. మరోవైపు ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్ల కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి అమెరికాలో ఏకంగా 5.5 లక్షల మంది ప్లంబర్ల కొరత ఏర్పడనుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా వేగంగా వృద్ధాప్యం బారిన పడుతోంది. పనులు చేసే యువత సంఖ్య తగ్గిపోతోంది. ముఖ్యంగా ఫిజికల్ ప్రెజెన్స్ (Physical presence) అవసరమైన ఎలక్ట్రీషియన్లు, కన్‌స్ట్రక్షన్ వర్కర్లు, మెషీన్ ఆపరేటర్లు, కేర్‌గివర్స్ వంటి బ్లూ-కాలర్ జాబ్స్‌కు భారీగా కొరత ఏర్పడింది. జర్మనీలో మూడో వంతు నిర్మాణ రంగ కంపెనీలు పనివాళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. బ్రిటన్‌లోనూ ఇదే పరిస్థితి. రాబోయే పదేళ్లలో అమెరికాలోని మూడో వంతు ఎలక్ట్రీషియన్లు రిటైర్ కాబోతున్నారు.

ఏఐ (AI) భయం లేని ఉద్యోగాలు ఇవే!

టెక్నాలజీ వస్తే శారీరక శ్రమ తగ్గుతుందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పుణ్యమా అని కూర్చుని చేసే వైట్-కాలర్ ఉద్యోగాలకే ఎసరు వస్తోంది. ప్లంబింగ్, వెల్డింగ్, కన్‌స్ట్రక్షన్ వంటి పనులను ఏఐ చేయలేకపోవడంతో ఇవి "AI-proof" ఉద్యోగాలుగా మారాయి. సర్వేల ప్రకారం బ్లూ-కాలర్ కంపెనీల్లో 85% రిక్రూట్‌మెంట్ సమస్యలు ఎదుర్కొంటుంటే, వైట్-కాలర్ కంపెనీల్లో అది 64% మాత్రమే ఉంది. ఈ ట్రెండ్ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే ఇలాంటి ట్రేడ్ స్కిల్స్ ఉన్నవారికే ఇప్పుడు వేతనాలు వేగంగా పెరుగుతున్నాయి.

US Needs 5.5 Lakh Plumbers Not Coders The Blue-Collar Boom

ఇండియాకు ఇది బంపరాఫర్.. కానీ!

ప్రపంచంలో యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశం మనదే. రాబోయే దశాబ్దంలో ప్రపంచానికి అవసరమైన వర్క్‌ఫోర్స్‌లో 25% ఇండియా నుంచే వెళ్లనుంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలకు మన కార్మికులు పెద్ద ఎత్తున వలస వెళ్తున్నారు. యూరప్ దేశాలు కూడా భారతీయ స్కిల్డ్ లేబర్ (Skilled Labour) కోసం రూల్స్ సడలిస్తున్నాయి. ఇక్కడి పల్లెటూళ్లలో నెలకు పది, పదిహేను వేలు సంపాదించే వర్కర్లు, గల్ఫ్ లేదా ఇతర దేశాలకు వెళితే దానికి 4 నుంచి 6 రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు.

డిగ్రీలు ఉన్నా ఉద్యోగాలు కరువు!

ఇండియాలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. చదువుకున్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ రేటు ఏకంగా 11 శాతంగా ఉంటే.. నిర్మాణ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో నైపుణ్యం ఉన్న కార్మికులు దొరక్క కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. భవిష్యత్తులో మనదేశంలో హైవేలు, రైల్ కారిడార్లు, సెమీకండక్టర్ ప్లాంట్ల నిర్మాణానికి స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ (Skilled tradesmen) చాలా అవసరం. 2030 నాటికి రాబోయే 9 కోట్ల ఉద్యోగాల్లో 70% బ్లూ-కాలర్ జాబ్సే ఉంటాయి. కానీ మన దగ్గర చేతి వృత్తులను తక్కువ చేసి చూసే ధోరణి ఉండటంతో యువత అంతా డిగ్రీల వైపే పరుగులు తీస్తున్నారు.

ఒకప్పుడు బ్రెయిన్ డ్రైన్ (Brain drain) అంటే డాక్టర్లు, ఇంజనీర్లు విదేశాలకు వెళ్లిపోవడం అనుకునేవాళ్లం. కానీ భవిష్యత్తులో ఈ వలసలు ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్ల రూపంలో ఉండబోతున్నాయి. చేతివృత్తులకు ప్రపంచవ్యాప్తంగా గోల్డెన్ డేస్ వస్తుంటే.. మనం ఇంకా డిగ్రీల మోజులో పడి ఆ అవకాశాలను వృథా చేసుకుంటున్నామనేది కాదనలేని నగ్నసత్యం.

Advertisement

తాజావార్తలు

Advertisement