త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఐసిస్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు.. ప్రతీకారం తీర్చుకున్న అగ్రరాజ్యం

అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15 జెట్లు, ఏ-10 థండర్‌బోల్ట్స్, అపాచీ హెలికాప్టర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. 100 కు పైగా క్షిపణులను ఐసిస్ స్థావరాలపై టార్గెట్ చేసి పంపించారు.

J

International | Published On Dec 20, 2025, 8.10 am IST

ఐసిస్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు.. ప్రతీకారం తీర్చుకున్న అగ్రరాజ్యం
Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రవాద సంస్థ చేస్తున్న ఉగ్రదాడులు ప్రపంచాన్నే భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఐసిస్‌ని అంతం చేసేందుకు అగ్రరాజ్యం అయిన అమెరికా కూడా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సిరియాలో ఉన్న ఐసిస్ స్థావరాలపై భారీ వైమానిక దాడులకు యూఎస్ పాల్పడింది. అమెరికా సైన్యం మెరుపు దాడులతో ఐసిస్‌పై విరుచుకుపడింది. ఇటీవల అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ ఉగ్రవాదులు దాడులు జరపగా, పలువురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దాడులకు ప్రతీకారంగా అమెరికా.. సిరియాలో ఉన్న పలు ఐసిస్ స్థావరాలపై ప్రతీకార దాడులు చేసింది.

ఆపరేషన్ హాకీ స్ట్రైక్

అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఈ దాడులను చేశారు. దీన్ని ఆపరేషన్ హాకీ స్ట్రైక్‌గా యూఎస్ డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్‌సెత్ తెలిపారు. తమ సైనికుల మరణానికి ఇది ప్రతీకారం అని మంత్రి స్పష్టం చేశారు. ఐసిస్‌కి చెందిన పలు ఆయుధ కేంద్రాలను యూఎస్ ఈ దాడుల్లో భాగంగా ధ్వంసం చేసింది.

దాడులకు సహకరించిన సిరియాలోని కొత్త ప్రభుత్వం

సిరియాలో ఐసిస్ పుంజుకోకుండా, అంతర్జాతీయ సమాజానికి, భద్రతకు ముప్పు కాకుండా ఉండేందుకు ఇలాంటి దాడులు చేస్తూనే ఉంటామని అమెరికా ప్రకటించింది. ఐసిస్‌ని అంతం చేయడానికి సిరియాలోని కొత్త ప్రభుత్వం కూడా అమెరికాకు మద్దతు పలకడంతో ఈ దాడులను అమెరికా సమర్థంగా నిర్వహించింది.

దాడుల్లో పాల్గొన్న ఎఫ్-15 జెట్లు, ఏ-10 థండర్ బోల్ట్స్

అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15 జెట్లు, ఏ-10 థండర్‌బోల్ట్స్, అపాచీ హెలికాప్టర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. 100 కు పైగా క్షిపణులను ఐసిస్ స్థావరాలపై టార్గెట్ చేసి పంపించారు. జోర్డాన్‌కి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు కూడా ఈ ఆపరేషన్‌లో యూఎస్‌కి సహకరించాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement