యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ వాణిజ్య విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్ వేస్తామని హెచ్చరించారు. యూఎస్‌లో భారత్ బియ్యాన్ని డంప్ చేస్తోందని, అలా చేస్తే యూఎస్ రైతులకు నష్టం కలిగించడమేనని ఆయన మండిపడ్డారు. వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ రైతుల కోసం 12 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన ట్రంప్.. ఆసియా దేశాల నుంచి యూఎస్‌లో డంప్ చేస్తున్న బియ్యం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, వియత్నాం, థాయ్‌లాండ్ లాంటి దేశాల నుంచి భారీగా బియ్యం యూఎస్‌లో డంప్ అవుతోందని.. దాని వల్ల యూఎస్ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని అధికారులు ట్రంప్‌నకు స్పష్టం చేశారు. దీంతో అలా ఎలా డంప్ చేస్తారు. అలా జరగడానికి వీల్లేదు. భారత్ బియ్యాన్ని డంప్ చేయడానికి ఎందుకు అనుమతిస్తున్నారు. తక్కువ ధరకే ఎక్కువ మొత్తంలో బియ్యం అమ్మకాలు చేస్తే యూఎస్ రైతుల పరిస్థితి ఏంటి? దానికి వాళ్లు సుంకాలు చెల్లించాలి కదా. బియ్యం ఎగుమతులపై వాళ్లకు మినహాయింపు ఉందా? అంటూ ట్రెజరీ సెక్రటరీతో ట్రంప్ అన్నారు. దీనికి ట్రెజరీ సెక్రటరీ స్పందిస్తూ.. భారత్, యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పడంతో.. అలా బియ్యాన్ని డంప్ చేయడం కుదరదు. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై కొత్తగా సుంకాలు విధించాల్సిందే అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. కెనడాపై గురి భారత్‌తో పాటు కెనడా నుంచి ఎరువులు యూఎస్‌కు దిగుమతి అవ్వడంపై కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తులను పెంచడం కోసం అవసరం అయితే కెనడా నుంచి దిగుమతి అవుతున్న ఎరువులపై కూడా భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం యూఎస్, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కిరాలేదు. ఈ ఒప్పందాలపై చర్చలు జరుగుతున్న తరుణంలో బియ్యంపై కూడా టారిఫ్స్ వేసేందుకు ట్రంప్ సిద్ధమవుతుండటంతో యూఎస్‌కు ఎగుమతి చేసే బియ్యం విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.